Wednesday 21 December 2016

నైవేద్య విశిష్టత, పద్ధతి ఎలాగో మీకు తెలుసా?

Offerings to god


మనం రోజూ తినే తిండి అనేక సంక్లిష్ట దశాభేదాల్ని దాటుకొని అంతిమంగా మన నోట్లోకొచ్చిపడుతున్నది. ఆ యావత్తు దశాభేదాల్లోను మనిషి చేసే కృషికి అడుగడుగునా సహకరిస్తున్న భగవంతుని లీలా విశేషం ఉంది. ఆ లీలావిశేషమే లేకపోతే మనం దున్నినా విత్తలేం ... విత్తినా మొక్కలు రావు ... వచ్చినా ధాన్యం పండదు ... పండినా దాన్ని ఇంటికి తెచ్చుకోలేం ... తెచ్చుకున్నా తినలేం ... ఇలా అడుగడుగునా మనం అత్యంత ప్రాథమికమైన తిండి అవసరాల కోసం భగవంతుని కృప మీద ఆధారపడి ఉన్నాం. అందుకే ఆ ఆహారద్రవ్యాల్ని ఆహారరూపంలోకి మార్చుకోగలిగిన తరువాత భగవంతుణ్ణి విధివిధానంగా పూజించి వండినవాటిని భగవంతుడి సన్నిధిలో పెట్టి "హే భగవాన్ ! ఇది నీ దయామృతవర్షం. మమ్మల్ని బతికించడం కోసమే నువ్వు దీన్ని సృష్టించావు. నీ ప్రసాదం కావడం చేత ఇది పరమ పవిత్రమైనది." అని కృతజ్ఞతలు చెప్పుకొని దాన్ని భుజించడం ఉత్తమం. ఈ విధమైన స్తోత్రం చేత ఆయన మిక్కిలి సంతోషిస్తాడు. వారికి ఈ జన్మలోనే కాక రాబోయే జన్మల్లో కూడా ఆహారాదులకు లోపం లేకుండా చూసుకుంటాడు. వారి వంశంలో కూడా ఏ విధమైన లోటూ ఉండదు.

ఈ విధమైన హృదయపూర్వక భగవన్నివేదనకి హిందూధర్మంలో నైవేద్య సమర్పణ అని పేరు. నైవేద్య సమర్పణలో కొన్ని సంప్రదాయాలున్నాయి. ముఖ్యంగా
ఇంట్లో నైవేద్యంగా సమర్పించబడే ఆహారపదార్థాలు శాకాహారమైనా కావచ్చు. మాంసాహారమైనా కావచ్చు. మొత్తం మీద మనం తినేదే పెట్టాలి. శాకాహారమే అయి ఉండాలనే నియమమేమీ లేదు. అయితే కొందరు మాంసాహారాన్ని ఎందుకు వద్దంటారంటే,  మాంసాహారాన్ని సమర్పించేవారు సాధారణంగా అబ్రాహ్మణులై ఉంటారు. మనం భగవంతుడికి ఏది సమర్పిస్తే అదే మనకి వచ్చే జన్మలో వందరెట్లుగా సంప్రాప్తమౌతుంది. కనుక వారు వచ్చే జన్మలో కూడా మాంసాహార కుటుంబాలలోనే జన్మించాల్సి వస్తుంది. అతిమాంసాహార వ్యసనం వల్ల మరుజన్మలో జాతకంలో సర్పదోషాలు ప్రవేశిస్తాయి. ఆధ్యాత్మిక పురోగతికి అదొక పెద్ద ఆటంకమని పూర్వీకులు భావించారు. కాని భవిష్యపురాణాది గ్రంథాల్లో చెప్పిన ప్రకారం ... కలియుగంలో బ్రాహ్మణుల్లో కంటే అబ్రాహ్మణుల్లోనే ఎక్కువమంది ఆధ్యాత్మిక మహాపురుషులు జన్మిస్తారు. కాబట్టి యుగధర్మాన్ని బట్టి అదొక లోపంగా భావించనక్కరలేదు.

ద్రవ్యశుద్ధి చాలా ముఖ్యమైన విషయం. అంటే ఏ విధమైన ధనంతో ఆ ఆహారాన్ని సిద్ధం చేశారు? అది అక్రమార్జితమా? సక్రమార్జితమా? హింసార్జితమా? అహింసార్జితమా? ద్రవ్యశుద్ధి లోపించిన నైవేద్యాల్ని భగవంతుడు తిరస్కరిస్తాడు. అలాగే తమకి మధుమేహం ఉంది గదా అని దేవుడికి తీపిలేని వంటలూ, లేదా తమకి రక్తపోటు ఉంది గదా అని ఆయనకి ఉప్పువెయ్యని వంటలూ నైవేద్యంగా సమర్పిస్తూంటారు. అది అవాంఛనీయం. ఇందాక చెప్పిన సూత్రం ప్రకారం మనం దేన్ని సమర్పిస్తామో దాన్నే ఆయన వందరెట్లుగా మనకి తిరిగి యిస్తాడు కాబట్టి అవే మధుమేహం, రక్తపోటూ మనకి మరుజన్మలో కూడా సంప్రాప్తిస్తాయి. దేవుడికి ఏది పెట్టినా, ఎంత పెట్టినా ఫర్వాలేదనే అపోహలో చాలామంది హిందువులు బతుకుతున్నారు. అందుచేత ఏదైనా దైవకార్యం వచ్చినప్పుడు వారు వంటకాల్లో తగినన్ని సంబారాలు వెయ్యకుండా మానవమాత్రుడెవడూ నోట్లో వేసుకోలేని విధంగా పదార్థాలు వండి వాటినే ఇంట్లోను, దేవాలయాల్లోను సమర్పిస్తున్నారు. దేవుడికి ఏం పెడతామనేది, ఎంత పెట్టాలనేది మన స్థితిగతుల్ని బట్టి నిర్ణయమైపోయే ఉంటుంది.

హైదరాబాదు బోనాల్లో అమ్మవారు పూనినప్పుడు "నీకేం కావాలి తల్లీ ?" అని భక్తులడిగారు. "నాకీ మధ్య మాంసం పెట్టడం మానేశారేంట్రా?" అనడిగారు అమ్మవారు. "జీవాల్ని బలివ్వడం మీద ప్రభుత్వం నిషేధం విధించింది తల్లీ ! శాకాహారంతో తృప్తిచెంది మమ్మల్ని కాపాడవమ్మా !" అని వేడుకున్నారు భక్తులు. అమ్మవారు శాంతించి "సరే ! అలాగే కానివ్వండ్రా" అన్నారు.
"శ్రియా దేయమ్, హ్రియా దేయమ్, భియా దేయమ్, సంవిదా దేయమ్" అన్నారు వేదఋషులు. అంటే కలిగినంతలో పెట్టాలి. ఎక్కడైనా పొరపాటు జరుగుతుందేమోననే జాగ్రత్తతో పెట్టాలి. భయభక్తులతో పెట్టాలి. ఆలోచించి పెట్టాలి అని అర్థం.

భగవంతుడు బాల్యప్రియుడు. అమ్మవారికి ఎనిమిదేండ్ల పిల్లగా దర్శనమివ్వడం అభిమతమైనట్లే అయ్యవారికి ఆరేళ్ళ పిల్లగాడుగా దర్శనమివ్వడం మిక్కిలి ఇష్టం. అందువల్ల ఒక చిన్నపిల్లవాణ్ణి ఎలా ముద్దుచేసి, బతిమాలి, వెంటపడి అన్నం తినిపిస్తామో అలాగే, అంతటి తత్పరతతోనే భగవంతుడికి నైవేద్యం పెట్టాలి. బయట కొన్న వంటకాల్ని నైవేద్యం పెట్టకూడదు. అవి వ్యాపారనిమిత్తం అనేక రకాలైన అశౌచాలకి గురై ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోను అవి పనికిరావు. నిలవ ఉన్నవీ, పులిసిపోయిన పదార్థాల్ని ఇంట్లో వండినా సరే నైవేద్యానికి పనికిరావు. అయితే సంతోషీమాత తప్ప మిగతా అందరు దేవతల విషయంలోను కొత్తపెరుగుకు మినహాయింపు ఉంది. గ్రామదేవతలకైతే చద్దెన్నం మహాప్రీతికరం. తమ సొంత యింట్లోను, తమ సొంత ఆఫీసులోను నైవేద్యాన్ని తాము (గృహిణి, గృహస్థుడు/ యజమానుడు, యజమానురాలు) స్వయంగా కానీ, తాము నియమించిన వేదబ్రాహ్మణుడు కానీ సమర్పించాలి. ఇతరులు పనికిరారు. నైవేద్యంలో బెల్లం ముక్క, నేతి అభిఘారమూ తప్పనిసరి. హారతి ఇచ్చాకనే నైవేద్యం సమర్పించాలి.

నైవేద్యం పెట్టేటప్పుడు ఆహార పదార్థాల చుట్టూ కుడిచేత్తో నీళ్ళు చిలకరించి సంబంధిత దేవతాస్తోత్రం చదవాలి. ఏ దేవుడికైనా, దేవతకైనా పనికొచ్చే సర్వదేవతోపయోగి

 శ్లోకం :


శ్లో|| బ్రహ్మార్పణమ్ బ్రహ్మహవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ |
బ్రహ్మైవ తేన గన్తవ్యమ్ బ్రహ్మకర్మసమాధినా ||
విష్ణుమూర్తికీ, ఆయన అవతారాలకూ అయితే ...
శ్లో|| పత్రమ్ పుష్పమ్ ఫలం తోయం యస్తే భక్త్యా ప్రయచ్ఛతి |
తద్భవాన్ భక్త్యుపహృతమ్ అశ్నాతి ప్రయతాత్మనః ||
శ్లో|| యత్కరోమి యదశ్నామి యజ్జుహోమి దదామి యత్ |
యత్ తపస్యామి గోవింద తత్కరోమి త్వదర్పణమ్ ||
శ్లో|| కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాఽఽత్మనా వా ప్రకృతేః స్వభావాత్ |
కరోమి యద్యత్ సకలమ్ పరస్మై
నారాయణేతి సమర్పయామి ||
ఏ కులస్థులైనా సరే, ఏ దేవీదేవతలకైనా నైవేద్యం పెట్టేటప్పుడు ...
ఓం సత్యమ్ చిత్తేన పరిషించామి | అమృతమస్తు | అమృతోపస్తరణమసి స్వాహా |
అని నైవేద్యం చుట్టూ నీటి బిందువుల్ని చిలకరించాలి. తరువాత--
ఓమ్ ప్రాణాయ స్వాహా ! ఓం వ్యానాయ సాహా | ఓమ్ ఉదానాయ స్వాహా | ఓం సమానాయ స్వాహా | ఓమ్ బ్రహ్మణే స్వాహా |
అని కుడిచేత్తో ఆహారపదార్థాల్ని దేవుడికి/ దేవతకు చూపించాలి.
మధ్యేమధ్యే పానీయం సమర్పయామి
అని నైవేద్యం మీద మళ్లీ నీటిబిందువుల్ని ప్రోక్షించాలి.
నమస్కరోమి అని సాష్టాంగం చేసి లేవాలి.

దేవుడికి దిష్టి తగలకుండా ఆ కాసేపు గది తలుపు మూసెయ్యాలి. లేకపోతే భోజనప్రియత్వం గలవారు ఆ ఆహారపదార్థాల వంక కుతూహలంగా, సాభిప్రాయంగా చూసినప్పుడు వాటిల్లో రంధ్రాలేర్పడడం, రంగుమారడం జరుగుతుంది. ఆ మార్పుల్ని యోగులు మాత్రమే తెలుసుకోగలరు. ఒకటి-రెండు నిమిషాల తరువాత లోపలికకి వెళ్ళి మళ్ళీ దేవుడికి నమస్కారం చేసుకొని ఆహార పదార్థాల్ని బయటికి తీసుకురావాలి.

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles