Friday 2 December 2016

విద్యార్థుల్లో ఎందుకీ ఒత్తిళ్లు

*భావోద్వేగం.. బలవుతోన్న బాల్యం*
*విద్యార్థుల్లో ఎందుకీ ఒత్తిళ్లు*
ఆత్మహత్యల వైపు ఆలోచనలు వద్దు
*విద్యాలయాల్లో కౌన్సెలింగ్‌ అవసరం*

అనంతపురం(వైద్యం), న్యూస్‌టుడే: అమ్మ తిట్టిందనో.. నాన్న అరిచారనో.. చదువలేమన్న మానసిక కుంగుపాటు.. ఒత్తిడిని తట్టుకోలేమన్న భయం.. కారణమేదైనా మరణమే పరిష్కారమన్న భావనతో విద్యార్థులు భావోద్వేగానికి లోనవుతున్నారు. మార్కులు తక్కువ వచ్చాయనో... స్నేహితులు తిట్టారని అవమానాన్ని భరించలేకనో... సహ విద్యార్థుల ఎదుట ఉపాధ్యాయులు కొట్టారనో.. అడిగింది తల్లిదండ్రులు కొని ఇవ్వలేదనో.. ఇలా క్షణికావేశంతో కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. బతుకుపై విరక్తి చెంది స్వయంగా ప్రాణాలు తీసుకునే దిశగా ఆలోచనలు సాగిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. కన్నవారికి కడుపుకోతను... అయినోళ్లకు శోకాన్ని మిగిల్చుతున్నారు. తాము ఈలోకాన్ని విడిచి వెళ్లిపోతే కన్న బిడ్డలపై ఎన్నో కలలు, ఆశలు పెంచుకుంటున్న తల్లిదండ్రుల పరిస్థితి ఏంటీ... అన్న కోణంలో ఓ ఐదు నిమిషాలు ఆత్మ పరిశీలన చేసుకుంటే చాలు...! సమస్యకు పరిష్కారం లభిస్తుంది. చావే సమస్యకు పరిష్కారం కాదన్న నగ్న సత్యం బోధపడుతుంది. ప్రతి సమస్య, కష్టానికి, ఇబ్బందికి సమాధానం తప్పక లభిస్తుంది. ఏ సమస్య అయినా సరే.. సహా విద్యార్థులు, స్నేహితులు, తల్లిదండ్రులతో పంచుకుంటే మీలో తలెత్తే ఒత్తిడి, కుంగుబాటు భయపడతాయి. ఇది మానసిక వైద్యులు చెబుతున్న సత్యం. దురదృష్టవశాత్తు ఇటీవల విద్యార్థులు రకరకాల ఒత్తిళ్లతో తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారు. ఇది ఓ సర్వే చెప్పిన నిష్టూర నిజం. విద్యార్థులు ఆలోచనలు, ప్రవర్తనను నిత్యం అటు తల్లిదండ్రులు, ఇటు ఉపాధ్యాయులు గమనిస్తూనే ఉండాలి. వారిలో మార్పులకు అనుగుణంగా తగిన కౌన్సెలింగ్‌ ఇప్పించాల్సిన అవసరాన్ని సకాలంలో గుర్తిస్తేనే ఫలితం ఉంటుందని మనస్తత్వ శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. విద్యార్థుల ఆలోచనల్లోనూ మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే తల్లిదండ్రుల కంటే ఈలోకంలో మనల్ని ప్రేమించేవారు ఇంకెవరుంటారన్న నిజాన్ని వారు గుర్తెరగాలి. కన్నవారికి కడుపుకోతను మిగిల్చినవారమవుతామని తెలుసుకోవాలి.
తల్లిదండ్రుల పాత్ర కీలకం

ఏ విషయాన్నైనా ఇతర పిల్లలతో పోల్చి మాట్లాడొద్దు. ఇది పిల్లల మానసిక కుంగుపాటుకు కారణం అవుతుంది. పిల్లలకు తక్కువ మార్కులు వచ్చినపుడు ఆచితూచి మాట్లాడాలి. తొందరపాటుగా వ్యవహరించడం మంచిదికాదు. పిల్లల్ని అమితంగా ముద్దు చేసే తల్లిదండ్రులు ఏదైనా విషయంలో తప్పు చేసినప్పుడు పరుషంగా మాట్లాడొద్దు. తాము కోరుకునే అంశాల్ని నెమ్మదిగా వివరించాలి. అర్థమయ్యే రీతిలో చెప్పాలి. ఖాళీగా ఉన్నప్పుడు సాధ్యమైనంత వరకు పిల్లలతో గడపాలి. వారి ఆలోచనలను పంచుకోవాలి.. గౌరవించాలి. ఇబ్బందులు, కష్టాలను సావదానంగా వినాలి. కుటుంబ కలహాలను పిల్లలపై రుద్దడం సరికాదు. ఏవైనా సమస్యలు ఉంటే పిల్లలు లేనప్పుడు చర్చించుకోవడం ఉత్తమం. ఇష్టపడే వస్తువుల్ని స్నేహతులు, సన్నిహితులకు ఇవ్వడం. అందరికీ ఫోన్లు చేయడం. దినచర్య రాసే అలవాటు లేకున్నా అకస్మాత్తుగా రాయడం ప్రారంభిస్తారు. ఈ తరహా ప్రవర్తన ఉంటే కౌన్సెలింగ్‌ ఇప్పించాలి. గంటలకొద్దీ ఒక విధంగా పడుకోవటం లేదా కూర్చోవటం. భోజనం మిగిలిన విషయాల పట్ల అనాసక్తి చూపడం. స్నేహితులతో కలవకుండా ఒంటరిగా తిరుగుతుండటం. చిన్న విషయాలకే ఎక్కువ అసహనాన్ని ప్రదర్శించటం. దీర్ఘంగా ఆలోచిస్తూ ఉండటం.. చేస్తుంటే కౌన్సిలింగ్‌ ఇప్పించాలి.

*ఉపాధ్యాయులు ఏం చేయాలంటే..*

తరగతి గదిలో దీర్ఘంగా ఆలోచించే విద్యార్థులను మాట్లాడించేలా చూడాలి. తనకు ఇష్టమైన పాఠ్యాంశాలను చదువుతూనే.. క్లిష్టంగా భావించే వాటిని అర్థమయ్యేలా చెప్పడానికి కృషి చేయాలి.

ఎప్పుడూ మాట్లాడే విద్యార్థి ఎప్పుడైనా ముభావంగా కనిపించం. ఎవరితోనూ మాట్లాడని పిల్లలు అందరితోనూ కలివిడిగా ఉండటం.. ఇలా ఏమైనా ప్రవర్తనలో తేడా ఉంటే గమనించాలి.

ఒరేయ్‌ దరిద్రుడా... నీ కంటే వీడు మేలు.. అన్న మాటాలు అసలు మాట్లాడొద్దు. నీవు ఏదీ చదవలేంటూ కించపరిచే వ్యాఖ్యలు అసలు చేయకూడదు. ్ద సున్నిత మనస్సు కలిగిన పిల్లల పట్ల నిత్యం అప్రమత్తంగా ఉండాలి.

ఉన్నఫళంగా విద్యార్థుల ప్రవర్తనలో మార్పు వస్తే.. తక్షణమే తల్లిదండ్రులకు కూడా తెలియజేయాలి. మార్కులు, ర్యాంకులే ప్రమాణికంగా చదువు చెప్పడం వల్ల ఒత్తిడి పెరుగుతుంది. ప్రతి రోజూ విధిగా తగిన సమయాల్లో క్రీడ, ఆటలు ఉండేలా చూడాలి. మానసిక ఉల్లాసం, ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుంది.

*ఒత్తిడి.. కుంగుబాటు ప్రమాదం*

ఒత్తిడి.. కుంగుబాటు. ఈ రెండూ ప్రమాదకరం. విద్యార్థులను అనేక రూపాల్లో ఈ రెండూ వేధిస్తూ ఉంటాయి. వాటి నుంచి ఉపశమనం కలగాలంటే చదువు ఒక్కటే కాదు.. ఆటలు, క్రీడలు చాలా కీలకం. సెలవు రోజుల్లో పిల్లలను దేవాలయాలు, ఉద్యానవనాలు, పర్యాటక ప్రాంతాలు, సినిమా.. ఇలా ఏదొక చోటికి తీసుకెళితే ఆలోచనల్లో మార్పు వస్తుంది. వారంలో ఒక గంట విధిగా మానసిక సమస్యలపై అవగాహన కౌన్సెలింగ్‌ ఉంటే చాలా మంచిది. వారిలో ఉన్న భయాలు, అపోహాలు తొలగిపోతాయి. పది, ఇంటర్‌ దశల్లో అనుత్తీర్ణులయినప్పుడు, డిగ్రీ, పీజీ దశల్లో ప్రేమ విఫలమైతే ఆత్మహత్యలు చోటు చేసుకుంటుంటాయి. అయితే దురదృష్టవశాత్తు ఇప్పుడు పాఠశాల విద్యను చదివే పిల్లల్లోనూ ఆత్మహత్యలు ఉండటం బాధాకరం. దీనికి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులదే పూర్తి బాధ్యత. విద్యార్థుల చుట్టూ స్నేహితులు, పరిసరాలు, ప్రవర్తన.. ఇలా ప్రతి దాన్ని నిత్యం గమనిస్తూ.. అంచనా వేస్తూ ఉండాలి. వారిలో ప్రవర్తన మార్పు చెందితే నేరుగా తిట్టడం.. కొట్టడం చేయకూడదు. సున్నితంగా, మంచిగా వారిలో మార్పు రావడానికి కృషి చేయాలి.

- ఎండ్లూరి ప్రభాకర్‌, మానసిక వైద్యనిపుణుడు, సర్వజన ఆస్పత్రి

నవంబరు 20న: శింగనమల మండలం ఇరువెందుల గ్రామానికి చెందిన జనార్దన్‌రెడ్డి అనంత నగరంలో ఓ ప్రైవేట్‌ రెసిడెన్షియల్‌ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. ఈ నెల 19న స్వగ్రామానికి వెళ్లొచ్చాడు. 20న పాఠశాలకు వెళ్లాడు. ఎక్కడ ఏం జరిగిందో తెలియదు. అదే రోజు రాత్రి

వసతి గృహం గదిలోకి వెళ్లాడు. లోపలే ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. క్షణికావేశంలో కన్నవారికి కడుపుకోతను మిగిల్చాడు.

నవంబరు 21న: చిలమత్తూరు మండలం మరువకొత్తపల్లికి చెందిన శివకుమార్‌ అక్కడి జడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. స్నేహితుడి చరవాణిని పోగొట్టాడన్న ఉద్దేశంతో తల్లి మందలించింది. దీనికి తీవ్ర మనస్తాపానికి గురైన ఆ విద్యార్థి ఇంట్లో ఎవరూ లేని సమయంలో వూరి వేసుకుని ఉసురుతీసుకొన్నాడు. తప్పు చేయడంతో తల్లి తిట్టింది. క్షణికావేశంలో ప్రాణాలను పోగొట్టుకొన్నాడు.

*నవంబరు 22న*

కణేకల్లు మండలం పూలచెర్ల గ్రామానికి చెందిన అనంతయ్య పెద్ద కూతురు వనిత కడపలో చదువుతోంది. ఇరవై రోజుల కిందట ఇంటికొచ్చింది. తాగడానికి నీళ్లు తెమ్మని తల్లి చెప్పింది. వెళ్లననటంతో తల్లి మందలించింది. దీంతో మనస్తాపానికి గురైన వనిత ఇంట్లో ఎవరూ లేని సమయంలో చున్నీతో ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles