Saturday 14 January 2017

వాలుకుర్చీ వేదాంతం

🌹🌹వాలుకుర్చీ వేదాంతం:🌹: 🌹
తన కలిమి, ఇంద్రభోగము
తన లేమియె సర్వలోక దారిద్యంబున్
తన చావు జగత్ప్రళయము,
తన వలచినయదియె రంభ, తథ్యము సుమతీ...
లోకంలో పడక కుర్చీ మేథావులు కొందరుంటారు నిండు కుండలాంటివాళ్ళు. తొణకరు, బెణకరు. రేపు ఆ కుండే ఖాళీ అయితే, తలకిందులైపోతారు, కుండకూడా అంతే! నిండుగా ఉన్నంత సేపూ లోకం అంతా సుభిక్షం అంటుంది. కుండఖాళీ ఐతే తల్లకిందులై, గగ్గోలు పెడుతుంది. ఘటవాయిద్యం లాంటిదే ఇదంతా! చాలా మంది జీవితాలలో కనిపించే నిష్ఠుర సత్యం ఇది.
తమకు కడుపునిండుగా ఉంటే “జనం సుఖంగా ఉంటున్నారని, పంటలు బాగా పండుతున్నాయనీ అంటాడు. తనకు ఆకలి మండిపోతుంటే లోకం గొడ్డు పోయిందని, ప్రభుత్వ పాలన బాగాలేదని అందోళన చేస్తాడు. లోక దారిద్ర్యాన్ని అంచనా వేయటానికి తన భావదారిద్ర్యాన్ని ఉపయోగించా లనుకోవటమే ఇక్కడ సూత్రం.
ఇలాంటి మేథావి వర్గాన్ని పడకకుర్చీ వేదాంతులు అంటారు. ఈజీఛైర్ ఫిలసాఫర్లన్నమాట! వీళ్ళు వీధి అరుగు మీద వాలుకుర్చీలో వాలి, కూర్చుని దారినపోయే దానయ్యలతో అమెరికాను బాగు చేయటం గురించి, రష్యాను దారిలో పెట్టటం గురించి చాలా ఐడియాలు ప్రవచిస్తుంటారు. టకార ప్రయోగాలతో సమాచారాన్ని ఊదర గొడ్తుం టారు, ఆయనట...ఈవిడట... అంటూ! అదిగో ద్వారక అంటే ఇవిగో ఆలమందలు అంటారు. అన్నీ వేదాల్లోనే ఉన్నాయిష లాంటి భావాలు వీళ్ళవలనే ప్రబలుతాయి. తర్కానికి నిలవని భావజాలాన్ని లోకం మీదకు ప్రసారం చేస్తుంటారు.
తమిళ సంగమ సాహిత్యంలో ఆకుల బట్టలు కట్టుకున్న ఒక స్త్రీ గురించి ఉంది కాబట్టి, తమిళ భాష ఆకులు కట్టుకునే రోజుల్నించి అంటే కనీసం ఏడేనిమిది వేల యేళ్ళ నుండీ వుందనే ప్రచారం ఇలాంటి వాలుకుర్చీ వేదాంతం లాంటిదే! “కనీసంలో కనీసంగా ఈ సంఖ్య చెప్తున్నాం. మా లెక్కప్రకారం కనీసం యాబైవేల యేళ్ళనుండీ తమిళం ఉంది” అన్నారు తమిళపీఠాధిపతి స్వయంగా! అప్పటికి ప్రపంచంలో ఏ భాషైనా ఉన్నదా? అనడిగాడు నా బోటి భాషాడభూతి. లేదు. అప్పటికీ భాషనేదే లేదు. తమిళం ఒక్కటే ఉంది. దానిలోంచే అన్ని భాషలూ పుట్టాయి అని ఆయన సూత్రీకరించాడు సదరు తమిళ భాషతల్పశాయి. ఇది తాంబూలాలు ఇచ్చేశాను తన్నుకు చావమనటం కన్నా ప్రమాదకర ధోరణి. ఇప్పుడీ విషయాన్ని నిరూపించటానికి కోట్ల రూపాయల ప్రాజెక్టులు నడుస్తున్నాయక్కడ. అక్కటా...!
సుమతీ శతకంలోని ఈ పద్యం ‘వాలుపడక సీను’ల తత్వాన్ని ఎండగడుతుంది. వీళ్ళు వీధి అరుగుదాటి లోకంలోకి రారు. వాస్తవాన్ని చూడరు. చూసినా పట్టించుకోరు. పట్టించుకున్నా నిజం చెప్పరు. ఒకవేళ చెప్పినా  అందులో అర్ధసత్యాలు, పావు నిజాలూ మాత్రమే ఉంటాయి.
“తనకు గొప్ప కలిమి ఉన్నప్పుడు, లోకం అంతా ఇంద్రభోగం అనుభవిస్తోందంటాడట. తనకు లేమి కలిగితే సర్వలోకం
లోనూ దారిద్యం తాండవిస్తోదంటాడు. తనకు చావు పరిస్థితి వస్తే, జగత్ప్రళయం వస్తోందంటాడు. అక్కడితో ఆగుతాడా...? తను వలచిందే రంభ అని అడ్డగోలుగా వాదిస్తాడు. ఇది తథ్యము సుమతీ... అంటాడు సుమతీ శతక కారుడు.
    వెనకటికి ఒక డాక్టరుగారు “నా ప్రాక్టీసులో ఇన్ని పుళ్ళు కోశాను, ఒక్కడికి కూడా నా కొచ్చినంత బాధ రాలేదు” అన్నాడట. తన బాధని లోకం బాధగా రుద్దడం, లోకం బాధ తన బాధకన్నా తక్కువేనని తూకాలు వేయటం విచిత్రం.
    న్యూరో ఫిలాసఫీ అనే వైద్యవేదాంత విభాగం ఒకటి ఉంది.  బాధపడే వ్యక్తిని చూసినప్పుడు మనం కూడా బాధ పడే తత్వాన్ని ఈ శాస్త్రంలో మిర్రర్ టచ్ సైనస్థీషియా అంటారు. అనస్థీషియా అంటే బాధ తెలీకూండా ఉండటం. సైనష్థీషియా అంటే బాధ తెలియటం. ఎదుటిమనిషికాలుకు దెబ్బతగిలినప్పుడు మనకాలు నొప్పి పెట్టకపోయినా మనసు మాత్రం అయ్యో అనుకుంటుంది.  ఇది అద్దంలో ప్రతిబింబాన్ని ముద్దాడటం లాంటిది. అందుకే మిర్రర్ టచ్ సైనస్థీషియా అన్నారు. ఇది మనసున ప్రతి ఒక్కరికీ వర్తించే అంశమే! ఇది నాడీ వేదాంతం... న్యూరో ఫిలాసఫీ!
వాలుకుర్చీ వేదాంతం ఇందుకు భిన్నమైంది. తనకు బాధ పుట్టినప్పుడు లోకం అంతా బాధలోనూ దిగుల్లోనూ కూరుకు పోయిందంటాడు. తనకు సుఖంగా ఉంటే లోకంలో కష్టాలే లేవంటాడు. తనకు ఇష్టమైనది అందరూ మెచ్చేదంటాడు. తనకు నచ్చని దాన్ని, ఎవ్వడూ ఇలాంటివి ఇష్టపడ డంటాడు. పొట్లకాయ లేదా కాకరకాయ అంటే ఇష్టత లేనివాడు “ఈ కాయలు తినే మనుషులు కూడా ఉంటారంటే ఆశ్చర్యం” అని ప్రకటిస్తాడు. “తావలచినదే రంభ” అనే ధోరణి వలన లోకానికి అపకారమే జరుగుతుంది.

sandhehalu - samadhanalu Author: sandhehalu - samadhanalu

Hello, I am Author, here i wanna share each and every hindu philosophys,sculptures,history,sanskrit documents,dharmasandhehalu,historys and stories in our veda`s and upanishad`s,etc... Kindly help me by Like,Subscribe,Share all my blogposts. Thanking You!!!

Previous
Next Post »

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles