Showing posts with label భాగవతం. Show all posts
Showing posts with label భాగవతం. Show all posts

Friday 13 January 2017

భాగవతం - 236వ భాగం


బ్రహ్మోత్పత్తి – స్వాయంభువమనువు

విదురుడు కురుసభలో వుండగా ఒకానొక సందర్భంలో ఆయన అవమానింప బడ్డాడు. అప్పుడు విదురుడు అక్కడనుండి బయలుదేరి ఉద్ధవుడి దగ్గరకు వెళ్ళిపోయాడు. వెళ్ళి ఉద్ధవుడిని ‘కృష్ణ భగవానుడు ఎక్కడ ఉన్నాడు?’ అని అడిగాడు. అపుడు ఉద్ధవుడు “కృష్ణ భగవానుడు నిర్యాణం చెందాడు. యాదవులు అందరూ వెళ్ళిపోయారు’ అని చెప్పాడు. ఈ సందర్భంలో పరీక్షిత్తు ‘ఉద్ధవుడు కూడా యాదవుడే కదా – అతను ఎందుకు ఉండిపోయాడు?’ అని శుకుని అడిగాడు. కృష్ణుడికి ఏ జ్ఞానం ఉన్నదో అది ఉద్ధవుడికి ఉంది. కృష్ణుడు తన తరువాత లోకమునకు చెప్పడం కోసం ఉద్ధవుడిని భూమిమీద ఉంచేశాడు. ఉద్ధవుడు శ్రీమన్నారాయణుని ఆదేశమును అనుసరించి బదరికాశ్రమమునకు వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతున్న ఉద్ధవుడిని విదురుడు కలుసుకుని ‘నీవు శ్రీమన్నారాయణుడి దగ్గర తెలుసుకున్న భాగవత జ్ఞానమును నాకు చెప్పవలసింది’ అని అడిగాడు. అపుడు ఉద్ధవుడు ‘అది నాదగ్గరే కాదు. జ్ఞానమును మైత్రేయుడికి కూడా చెప్పాడు. ఇపుడు మైత్రేయుడు హరిద్వారంలో ఉన్నాడు. అక్కడికి వెళ్ళి వినవలసింది’ అని సలహా చెప్పాడు. అపుడు విదురుడు గంగపడిన చోటయిన హరిద్వారం వెళ్ళి, భాగవత జ్ఞానమును విన్నాడు. శ్రీమహావిష్ణువు నాభికమలంలో నుండి చతుర్ముఖ బ్రహ్మగారు పుట్టారు. అప్పటికి సృష్టి లేదు. లోకములన్నీ నీటితో నిండిపోయి ఉన్నాయి. నీటితో నిండిపోయి వున్న లోకములందు తాను ఏమి సృష్టి చేయాలో ఆయనకేమీ అర్థం కాలేదు. ‘నేనన్న వాడని ఒకడిని వచ్చాను కదా – నన్ను కన్నవాడు ఒకడు ఉండాలి కదా’ అని చుట్టూ చూశాడు. చుట్టూ నీళ్ళు తప్ప ఏమీ లేవు. జలప్రళయం అయిపోయి వుంది. కంగారుపడ్డాడు ఏమిటి సృష్టి చేస్తాను, ఎలా సృష్టి చేస్తాను అని ఆలోచిస్తున్నాడు. అపుడు ఆయనకు పైనుంచి ‘తపతప’ అనే ఒక మాట వినపడింది. అపుడు ఆయన తపించాడు. ధ్యానమగ్నుడై ఈమాట ఎవరినుండి వెలువడిందో ఆయన దర్శనమును అపేక్షించాడు. అలా తపించగా తపించగా శ్రీమన్నారాయణ దర్శనం అయింది. ఆయన ‘నీవు ఇలా సృష్టి చెయ్యి’ అని బ్రహ్మగారికి వేదములను ఇచ్చి ఆదేశం ఇచ్చాడు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మ గారు సృష్టి చేయడం ప్రారంభం చేశాడు.

ఆయన అలా సృష్టి చేయడం ప్రారంభం చేయడంలో ఒక గమ్మత్తయిన ప్రక్రియ జరిగింది. బ్రహ్మము నుండి సృష్టి వెలువడింది. ఆయన మొట్టమొదట సనక, సనందన, సనత్కుమారులను సృష్టించాడు. ఆ నలుగురుని సృష్టించి మీరు సృష్టిని వృద్ధి చేయండి. బిడ్డలను కనండి అన్నాడు. అంటే వాళ్ళు అన్నారు ‘మేము ప్రవ్రుత్తి మార్గములో వెళ్ళము. ఆ మార్గము మాకు అక్కరలేదు. మేము సృష్టి చేయము. మేము శ్రీహరి పాదములను చేరిపోతాము’ అన్నారు. వారు ఎప్పుడూ అయిదేళ్ళ వయసుతో, చిన్నపిల్లల్లా బట్టలు విప్పుకుని, ఎప్పుడూ ధ్యానం చేస్తూ శ్రీహరి వైపు వెళ్ళిపోయారు. బ్రహ్మగారికి కోపం వచ్చింది. కోపంతో తన భ్రుకుటి ముడివేశాడు. అందులోంచి నీలలోహితుడనే పేరుగల రుద్రుడు పుట్టాడు. వాడు క్రిందపడి ఏడవడం మొదలుపెట్టాడు. అపుడు బ్రహ్మగారు వానిని ఏడవకు అన్నారు. అపుడు ఆ రుద్రుడు ‘నేను ఎక్కడ ఉండాలి, ఏమి చేయాలి?’ అని అడిగాడు.

ఇక్కడ మీరు ఒక విషయం గమనించాలి. ఇక్కడ సృష్టి సంకల్పంలోంచి ప్రారంభమయింది. ఇప్పుడు ఉన్న సృష్టి మిధున సృష్టి అనగా స్త్రీపురుష మైధునం చేతనే సృష్టి జరుగుతూ ఉంటుంది. కానీ అప్పుడు జరిగిన సృష్టి కేవలము ఈశ్వర సంకల్పము చేత మాత్రమే జరిగిన సృష్టి.

అపుడు చతుర్ముఖ బ్రహ్మగారు ‘నువ్వు పుడుతూనే ఎడ్చావు కాబట్టి నిన్ను రుద్రుడంటారు అని చెప్పి రుద్రుడికి ఎనిమిది రూపములను, ఎనమండుగురు భార్యలను ఇచ్చి, నీవు అలా ఉండి సృష్టి చెయ్యి’ అని చెప్పారు. అపుడు ఆయన కొన్ని గణములను సృష్టించాడు. ఆ గణములు అక్కడ వున్న వాళ్ళను తినివేయడం మొదలుపెట్టారు. బ్రహ్మగారు రుద్రుడిని పిలిచి ‘ఇక నీవేమీ సృష్టి చేయవద్దు. కేవలం తపస్సు చేసుకుంటూ ఉండవలసింది’ అని చెప్పారు. అంటే ఆయన తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు.

మళ్ళీ బ్రహ్మగారు ఆలోచిస్తూ కూర్చున్నారు. అలా ఆలోచిస్తుంటే ఆయన శరీరభాగముల నుండి రకరకాల మహర్షులు బయటకు వచ్చారు. బ్రహ్మగారి ఒడిలోంచి నారదమహర్షి బయటకు వచ్చారు. వీపులోంచి ‘అధర్మము’ వచ్చింది. అధర్మములోంచి ‘మృత్యువు’ వచ్చింది. ముందుభాగంలోంచి ‘ధర్మం’ వచ్చింది. అపుడు బ్రహ్మగారు ‘ఇలా నేను సంకల్ప వికల్పములు చేస్తే ఎంత సృష్టి చేస్తాను’ అనుకున్నారు. ఒక్కొక్కసారి సృష్టి చేసే వారియందు కూడా మోహము కలుగుతుంది. బ్రహ్మగారు ఒక స్త్రీని సృష్టించాడు. సృష్టించి ఆ స్త్రీయందు మోహమును పొందాడు. అపుడు ఋషులు ‘మీరు సృష్టించిన స్త్రీయందు మీకు మొహమేమిటి”’ అని ప్రశ్నించారు. ఆడు ఆయన ‘ఇది సృష్టికి ఉండే లక్షణము. కాబట్టి ఏ శరీరముతో అలా మోహమును పొందానో ఆ శరీరమును వదిలిపెట్టేస్తున్నాను’ అని శరీరమును వదిలిపెట్టేశాడు. ఆ శరీరం పొగమంచు అయింది. మనకి రోజూ కళ్ళకి అడ్డంగా వచ్చే పొగమంచు అదే! తరువాత బ్రహ్మగారు మైథున సృష్టి చెయ్యాలని అనుకుణి తన శరీరంలోంచే రెండింటిని సృష్టించాడు. ఒకటి స్త్రీ, ఇంకొకటి పురుషుడు. అలా సృష్టించి ‘వీళ్ళయందు వ్యామోహమును ఏర్పాటు చేస్తాను. అపుడు ధర్మబద్ధమై ప్రజాసృష్టి జరుగుతుంది’ అన్నాడు. అలా మొట్టమొదట సృష్టించిన వాళ్ళలో మొట్టమొదట పుట్టిన వాడు స్వాయంభువ మనువు. ఆయన భార్య పేరు శతరూప. వీళ్ళిద్దరూ పుట్టారు. అపుడు బ్రహ్మగారు అన్నారు ‘కొడుకు తండ్రిని సంతోషపెట్టాలి. నీవు సృష్టి చెయ్యి’ అన్నారు. అనగా స్వాయంభువ మనువు అయిదుగురు బిడ్డలను కన్నాడు. కానీ వచ్చి తండ్రికి తాను అయిదుగురు బిడ్డలను కనినట్లు చెప్పాడు. వాళ్ళు ఎవరు అని అడిగారు బ్రహ్మగారు. ఆయన తన బిడ్డల పేర్లు చెప్పాడు. ఒకాయన పేరు ప్రియవ్రతుడు, రెండవ కుమారుని పేరు ఉత్తాన పాదుడు. ఒక కుమార్తె పేరు అకూతి. మరొక కుమార్తె పేరు ప్రసూతి. మూడవ కుమార్తె పేరు దేవహూతి.

అయిదుగురు బిడ్డలను కన్నాను. ఇప్పుడు ఏమి చెయ్యను?” అని తండ్రిని అడిగాడు. అపుడు బ్రహ్మగారు ‘శ్రీహరిని సంకీర్తన చేస్తూ, యజ్ఞయాగాది క్రతువులను చేస్తూ సమస్త ప్రాణులను రక్షిస్తూ పరిపాలన చేయవలసినది అని చెప్పడు. అపుడు ఆయన ‘నాన్నగారూ, అలా పరిపాలించడానికి భూమి ఎక్కడ ఉన్నదండీ? అని అడిగాడు. మీరు సృష్టి తామర తంపరగా ఎలా పెంచాలా అని ఆలోచిస్తున్న సమయంలో ఈ భూమి ప్రళయంలో వచ్చిన సముద్ర జలములలో పడిపోయి రసాతలానికి వెళ్ళిపోయింది. పాతాళ లోకంలో ఉన్న ఆ భూమిని పైకి తీసుకువస్తే ప్రాణులన్నీ భూమి మీదకు చేరుతాయి. అప్పుడు ఇంకా సృష్టి జరిగి ఇంకా ప్రాణులు వచ్చి అప్పుడు దీనిని పరిపాలించడానికి ఆనుకూల్యం ఏర్పడుతుంది. ఇప్పుడు ఆ భూగోళమును పైకెత్తండి’ అన్నాడు. ఆ భూమిని ఎలా పైకెత్తడమా అని ఆలోచించాడు బ్రహ్మగారు. ఈయన సంకల్పం చేయగానే వెనుక నుండి చేయిస్తున్న వాడు ఒకాయన ఉన్నాడు. ఇన్నిగా వస్తున్నాడు. ఆయన ఇప్పుడు బ్రహ్మగారి ముక్కులోంచి ఊడి క్రిందపడ్డాడు. నాసికా రంధ్రములలోంచి చిన్న వరాహమూర్తి ఒకటి క్రింద పడింది.

ఆ వరాహము దంష్ట్రలతో పెద్ద కొండంత అయిపోవడం మొదలుపెట్టింది. అది ఇప్పుడు అడుగులు తీసి అడుగులు వేయడం మొదలు పెట్టింది. అక్కడ వున్న ఋషులు అందరూ దానికేసి ఆశ్చర్యంగా చూస్తున్నారు. వాళ్లకి అర్థం అయింది. స్వామి సంకల్పమును అనుసరించి భూగోళమును పైకి ఎత్తడానికి ఎవరు మొట్టమొదటి నుండి చివరి వరకు ఉంటున్నాడో అటువంటి ఈశ్వరుడు వచ్చాడు అనుకున్నారు. అనగా మొదటి అవతారము వచ్చినది.

ఇది యజ్ఞవరాహంగా వచ్చింది. వచ్చి అడుగులు తీసి అడుగులు వేస్తూ సముద్రంలోకి దూకింది. అది భూమికోసం మూపుపెట్టి వెతుకుతోంది. అలా వెతకడంలో దాని ముఖం నిండా నీళ్ళు అంటుకుపోయాయి. అపుడు అది తన ముఖమును పైకి తెచ్చి విదిలించింది. అపుడు ఋషులందరూ ఋగ్యజుస్సామవేదములతో స్తోత్రం చేస్తూ, ఆ నీళ్ళు మీద పడేటట్లు నిలబడ్డారు. ఈ కంటికి గోచరమవని వాడు రక్షించడం కోసమని ఇప్పుడు ఒక విచిత్రమయిన మూర్తిగా వచ్చి నీతితో తడిసిన దేహంలో ఉన్న నీటిని చిమ్ముతున్నాడు. దీనిని విన్నప్పుడు విదురుడు ఒక విచిత్రమయిన ప్రశ్న వేశాడు. దానికి జవాబుగా ‘యజ్ఞవరాహం వచ్చినపుడు ఈయన ఎంత గొప్ప మూర్తియో అంత గొప్ప రాక్షసుడు ఒకడు నీళ్ళలోంచి వచ్చాడు. వచ్చి యజ్ఞవరాహమూర్తి మీద కలియబడ్డాడు. అక్కడ వున్న వాళ్ళందరూ యజ్ఞవరాహమూర్తిని స్తోత్రం చేస్తున్నారు. ఆయన ఆ రాక్షసుడిని చంపి అవతల పారేశాడు’ అని చెప్పాఉద్. ‘ఆ వచ్చిన వాడెవడు? ఎందుకు వచ్చాడు? అందరూ నమస్కరిస్తుంటే వాడొక్కడు యుద్ధం చేయడం ఏమిటి? అందుకు సంబంధించిన కథను చెప్పవలసినది’ అని పరీక్షిత్తు అడిగాడు. అందుకు సమాధానంగా శుకుడు చెప్పడం ప్రారంభించాడు.

భాగవతం - 25 వ భాగం


శుకబ్రహ్మ రావడంలో ఒక గొప్పతనం ఉంది. ఒక సమస్య ఏర్పడడం గొప్పతనం కాదు. కలియుగ ప్రవేశం జరిగితే దానివల్ల ప్రభావితుడయినవాడు పరీక్షిన్మహారాజు గారు ఒక్కడే కాదు – కలియుగంలో ఉన్న మనం అందరూ కూడా కలిచేత బాధింపబడుతున్న వాళ్ళమే. కాబట్టి ఇప్పుడు కలి బాధనుండి తప్పుకోవడానికి మార్గం ఏదయినా ఉంటుందా – ఇది చెప్పేవాడు ఎవరయినా ఉండాలి. మనం అందరం కలి బాధలను పడుతున్నాము. కలి ప్రభావం మనమీద ప్రసరించకుండా ఉండడం కోసమని మనం చేయవలసిన ప్రయత్నమునయినా చెప్పగలిగిన సమర్థుడు ఒకడు రావాలి. అటువంటి సమర్థుడు ఇప్పుడు వచ్చాడు. ఆయనే శుకుడు.

ఇక్కడ మన ఒక విషయమును పరిశీలించాలి. ఎవరికయినా మృత్యువు ఆసన్నమయిపోయిందని చెప్పారనుకోండి – ‘అయ్యా మీరు ఇక రెండుమూడు రోజులలో వెళ్ళిపోతారు’ అని చెప్పారనుకోండి – అప్పుడు ఆ చనిపోబోయే ఆయన దగ్గరకు ఎవరయినా వెళ్ళి ‘అయ్యా, మీకు కొన్ని మంచి విషయములు చెపుదామని వచ్చామండి – మీకు భాగవతము చెపుదామని వచ్చామండి’ అని అన్నారనుకోండి – వాడు ఆ మంచి విషయమును వినడానికి అంగీకరించడు. ఇప్పుడు ఎందుకండీ అంటాడు. ‘చచ్చేవేళ సందిమంత్రం’ అని మనవాళ్ళు ఒక మోటు సామెత ఒకటి చెపుతూ ఉంటారు. అపుడు సామాన్యమయిన వ్యక్తి చచ్చే వేల ఎవరు రామాయణం గురించి, భాగవతం గురించి విందామని అనుకుంటాడు? ఎవడికయినా ఎలా ఉంటుంది అంటే – ఆ ఉన్న రెండురోజులు భార్యాబిడ్డలను చూసుకోవాలని అనిపిస్తుంది. కానీ ఇక్కడ పరీక్షిన్మహారాజు గారు ఒక గొప్ప విషయం చేశాడు. శుకమహర్షి వస్తే ఈయనను ఎవ్వరూ వేయని ప్రశ్న ఒకటి వేశాడు. పరీక్షిన్మహారాజు గారు అన్నాడు – ‘ఏడు రోజులలో నాకు మరణము ఖాయమన్న విషయము తెలిసిపోయినది. నేను పాముచేత కరవబడతానని శృంగి శపించాడు. శృంగి నన్ను శపించాడని నేను ఎంతమాత్రమూ ఖేదపడడం లేదు. కానీ నేను పరమధార్మికులయిన పాండవుల వంశములో జన్మించిన వాడనయి, తపస్సు చేసుకుంటున్న బ్రాహ్మీ మూర్తియై వున్న ఒక మహర్షి మేడలో మృత సర్పమును వేశాను. నేను చేయరాని పనిని చేశాను అని బాధపడుతున్నాను. శృంగి నన్ను ఎలా శపించాడో అలాగే ఈ శరీరమును తీసుకువెళ్ళి ఆ పాముకి అప్పచేప్పేస్తాను. నేను నా మరణాన్ని అంగీకరిస్తున్నాను. నాకు భవిష్యత్తులో మళ్ళా జన్మము వచ్చినప్పుడు నా మనస్సు ఎప్పుడూ శ్రీమహావిష్ణువునే స్మరిస్తూ ఉండాలి. ఎక్కడయినా స్వామి వారి ఉత్సవమూర్తి కనపడ్డా, స్వామి దేవాలయం కనపడ్డా, గభాలున శిరస్సువంచి నమస్కరించగలిగిన సంస్కారబలం నాకు కావాలి. ఆ స్వామి గురించి నాలుగు మాటలు చెప్పేవాడు దొరికితే చాలు పరుగెత్తుకుంటూ వెళ్ళి వాని మాటలు వినే జిజ్ఞాస నాకు కలుగు గాక! నిరంతరమూ ఈశ్వరుని పాదసేవనము చేయగలిగిన కర్మేంద్రియములు నాకు కావాలి. నేను దానిని అర్థిస్తున్నాను. ఇది కలిగేటట్లుగా మీరందరూ నన్ను అనుగ్రహించ వలసినది. నాకు ఆశీర్వచనం చేయవలసింది’ అని ప్రార్థించాడు. ఉత్తర జన్మలో ఉత్కృష్టమయిన జన్మ కావాలని ఆయన అడగలేదు. ఆయన అడిగింది – ఏ జన్మలో ఉన్నా, ఏ శరీరములో ఉన్నా కావలసినవి ఏమిటో వాటిని అడిగాడు పరీక్షిత్తు. ‘హరిచింతారతియున్’ ‘హరి ప్రణుతి’ ‘భాషాకర్ణనాసక్తియున్’ ‘హరిపాదాంబుజసేవయుం’ ఈ నాలుగూ నాకు కావాలి అని అడిగాడు. శుకబ్రహ్మ వచ్చి కూర్చుని ఉంటే శుకబ్రహ్మకు పాదప్రక్షాళనం చేశాడు. ఆచమనీయం ఇచ్చాడు. ఆయనకు సాష్టాంగ నమస్కారం చేసి ఒకమాట చెప్పాడు. ‘అయ్యా, నాకునాకు ఒక్క కోరిక ఉంది. నేను మళ్ళా పుట్టవలసిన అవసరం లేని మోక్షమును పొందడానికి కల్పవృక్షంలా మీరు వచ్చారు. మీరు ఒకచోట ఉండేవారు కాదు. అటువంటిది మీరు అనుకోకుండా వచ్చి నన్ను అనుగ్రహించారు కనుక, నాకు అటువంటి విషయము ఏది ఉన్నదో దానిని నాకు తెలియజేయవలసినది’ అని ప్రార్థించాడు.

భాగవతం - ద్వితీయస్కంధము – 25

భాగవతంలో శుకుడు రావడమే ఒక పవిత్ర ఘట్టం. అటువంటి శుకబ్రహ్మ వచ్చి పరీక్షిత్తు చెప్పిన మాటలను విన్నాడు. తనగురించి తానూ ఏమీ చెప్పుకోలేదు. కానీ ఒక్కమాట చెప్పాడు. “పరీక్షిన్మహారాజా! నేనొక విషయం చెపుతాను. జాగ్రత్తగా విను. పూర్వం ఖట్వాంగుడు అనే ఒకరాజు ఉండేవాడు. అతడు దేవతలకు సాయం చేయడం కోసమని యుద్ధం చేయడం కోసమని భూమిని విడిచిపెట్టి రథమును ఎక్కి స్వర్గలోకమునకు వెళ్ళి రాక్షసులతో యుద్ధం చేశాడు. చాలా దీర్ఘకాలము పోరు సాగింది. రాక్షసులు ఓడిపోయారు. తదుపరి దేవతలు అందరూ ఖట్వాంగుడిని అభినందించారు. ‘నీవు మాకోసమని పైలోకమునకు వచ్చి యుద్ధం చేశావు. నీకేమి వరం కావాలో కోరుకో’ అన్నారు. అపుడు ఆయన ‘నాకేమీ వరం అక్కర్లేదు. కానీ నా ఆయుర్దాయం ఎంత మిగిలిందో చెపుతారా’ అని అడిగాడు. అపుడు దేవతలు వాని ఆయుర్దాయం లేక్కచూసి ఇంకొక ఘడియ మాత్రమే ఉన్నాడని చెప్పారు. తాను తరించిపోవడానికి ఆ ఒక్క ఘడియ ఆయుర్దాయం చాలునని ఖట్వాంగుడు భావించాడు. వెంటనే తన రథం ఎక్కి గబగబా భూమండలమునకు వచ్చి అంతఃపురంలోకి వెళ్ళి ఈమాట చెప్పేసి, ధ్యానమగ్నుడై ఈశ్వరుడిని ధ్యానం చేస్తూ కూర్చుని శరీరమును విడిచి పెట్టేసి మోక్షమును పొందాడు. ఒక్క ఘడియ కాలం మాత్రమే ఆయుర్దాయం కలిగిన ఖట్వాంగుడే మోక్షమును పొందగలిగాడు. నీకు ఇంకా ఏడురోజుల సమయం ఉంది. నీకు తప్పక మోక్షం లభిస్తుంది’ అని చెప్పాడు శుకుడు.

ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి. ఇలా మాట్లాడిన వాడు గురువు. మరణించే వారందరికీ పరీక్షిత్తు ప్రతినిధి. నేను నేననుకున్న ఈ శరీరమే రాకుండా కట్టెదుట అగ్నిహోత్రములో కాలి దోసెడు బూడిద అయిపోతోంది ఒక్క అరగంటలో ఏది నామరూపములు? వాడు పెట్టుకుంటే ఒక ఫోటో మిగిలిపోతుందంతే! పెట్టుకోక పోతే ఏ గొడవా లేదు. కాబట్టి ఇంతటి ఆభిజాత్యం కూడా పోయిందంతే! ఈ అహంకారమును గుర్తించని కారణము చేత మరల హీనోపాధిలోకి వెళ్ళిపోతున్నావు. అందుకని నీవు ఈశ్వరాభిముఖుడవు కావలసింది. నీకు సంబంధించన ఈ భౌతిక సంబంధములు కాని, వ్యక్తులు కాని, ఆస్తులు కాని, సంపద కాని, ఏవీ నిన్ను రక్షించవు. నీవు ఈశ్వరుడి పాదములను పట్టుకో. అవి మాత్రమే నిన్ను రక్షిస్తాయి. వివేకము తెలుసుకో అని చెప్పాడు. ఇక్కడ శుకుడు విరాడ్రూప వర్ణనమునంతా చేశాడు. చేసి హరిలేని పదార్థము లేదు. ఋషులు, సముద్రములు, భూమి, పంచామహాభూతములు ఇవన్నీ కూడా ఈశ్వరుని అంగాంగములై ఉన్నాయి. కాబట్టి ఎక్కడ చూసిన ఉన్నది ఈశ్వరుడు ఒక్కడే. కానీ ఈశ్వరుడు కనపడడం లేదు. ఎందుకు? అదే మాయ. అది నామ రూపములయండు కలిగిన తాదాత్మ్యం తదధిష్టానమయిన బ్రహ్మమునందు కలుగదు. అలా కలగాలంటే మాయ తొలగిపోవాలి. ప్రపంచంలో ఉన్నది మాయ అని తెలిస్తే అది తొలగిపోతుంది. ఇది మాయ అని గురుముఖంగా తెలియగానే మాయ తొలగిపోతుంది. అప్పటివరకు తొలగదు. దానికి ఈశ్వర కృప తోడయితే తొలగుతుంది. మాయ తొలగినపుడు లోపల వున్న ఆత్మ భాసిస్తుంది. కానీ మాయ తొలగడం అనేది అంత తేలికయిన విషయం కాదు.

ఈశ్వరుని కోసం నీవు ఎక్కడా తిరగనక్కరలేదు. విశ్వము హరి. హరి విశ్వము. అజ్ఞానము చేత లోకములో ఈశ్వరుడు, లోకము ఇంకా ఇంకా అలా కనపడుతున్నాయి. కానీ జ్ఞాన నేత్రము చేత చూస్తె ఉన్నది ఒక్కటే. నీవు కానీ సక్రమముగా వినదలుచుకుంటే హరిమయము కాని పదార్థము ఈ ప్రపంచమునందు లేదు. ఇది తెలుసుకొని సమస్తము ఈశ్వరమయం జగత్ అని అంగీకరించి, అంతటా బ్రహ్మమును చూసి ఉన్నది బ్రహ్మమే అని నీవు అంగీకరించగలిగితే నీకు ఉత్తర క్షణమే మోక్షము’ అని బోధచేసి భక్తి నిలబడడానికి శుకుడు ఒక మాట చెప్పాడు. ‘నేను భక్తిగా ఉంటాను అంటే కుదరదు. నీకు ఈశ్వరునియందు పూనిక కలగాలి. ఇంట్లో కూర్చుని భగవంతుని మీద భక్తి రావాలని అనుకుంటే రాదు. ఈశ్వరునికి ముందు నీవు నమస్కారం చేయడం మొదలుపెడితే ఆయన నీకొక దారి చూపిస్తాడు. భగవంతుని కథలు వినదమనే స్థితికి నిన్ను తీసుకువెడతాడు. కానీ మనిషి కొన్ని కోట్ల కోట్ల జన్మల వరకు అసలు భాగవత కథవైపు వెళ్ళడు. కానీ వెళ్ళాడు అంటే అతని జీవితంలో గొప్ప మార్పు ప్రారంభమయిందన్న మాట. భగవంతుని కథలను వినడం నీవు ప్రారంభిస్తే భక్తి కలుగుతుంది. ఆ భక్తితో అంతటా నిండియుండి చూస్తున్న వాడు, చేయిస్తున్న వాడు సర్వేశ్వరుడనే భావన నీకు కలిగిన నాడు, నీకు తెలియకుండా భక్తిలో ఒక విచిత్రం ఏర్పడుతుంది. భాగవతం మనస్సుకు ఆలంబనం ఇస్తుంది. మనస్సును మారుస్తుంది. ఈశ్వరుని వైపు తిప్పుతుంది. దీనిని అందరూ పొందలేరు. ఈ అదృష్టం పొందాలి అంటే ఈశ్వరానుగ్రహం కూడా ఉండాలి. ఎవరిని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడో వారు మాత్రమే భాగవతమును వినగలరు తప్ప అందరూ భాగవతమును వినలేరు. అందుచేత ‘నీవు భగవత్ కథా శ్రవణముతో ప్రారంభము చెయ్యి. ఈ సమస్త జగత్తును సృష్టించిన వాడు ఆయనే’ అని చెప్పాడు.

భాగవతం - 23 వ భాగం




కలి అన్నాడు “నేను ఇంకా స్థిరముగా ఊన్చుకోలేక పోతున్నాను. ఇది నా తప్పు కాదు. నేను రావాలి. అందుకే ఈశ్వరుడు వెళ్ళిపోయాడు. నేను వచ్చాను. గట్టిగా ఊన్చుకొని నిలబడదామనుకుంటే నేను ఎక్కడికి వెడితే అక్కడ నీవు ధనుర్బాణములు పట్టుకుని కనపడుతున్నావు. మరి ఎలా? ఇలా అయితే నేను ఉండడం కష్టం కదా! కలియుగంలో కలిని అయిన నేను ప్రవేశించాలి కదా! అందుకని నువ్వు నాకొక అవకాశం ఇవ్వు. నన్ను ఫలానా చోట ఉండమని చెప్పు. నేను అక్కడ ఉంటాను. అప్పుడు ఇక ఇబ్బంది ఉండదు. అలాకాక నేను ఎక్కడికి వెడితే నీవు అక్కడ కనిపించినట్లయితే నీకూ, నాకూ సంఘర్షణ వస్తుంది. నువ్వు నన్ను చంపుతానని అంటూ ఉంటావు. యుగం వచ్చేసింది. నేను రావాలి. కాబట్టి నేను ఎక్కడ ఉందనో నీవే చెప్పవలసింది” అన్నాడు.

అపుడు పరీక్షిత్తు “నీకు నాలుగు స్థానములు ఇస్తాను. నువ్వు అక్కడే ఉండు” అన్నాడు. పరీక్షిత్తు చెప్పిన మొట్టమొదటి స్థానం జూదశాల. “జూదశాల యందు నీవు ఉండవచ్చు” అన్నాడు. రెండవది పానశాల. ‘ఎక్కడెక్కడ మత్తు పదార్థములను త్రాగుతారో అక్కడ నీవు ఉండవచ్చు’ అన్నాడు. మూడవది ‘స్వేచ్ఛా విహరిణులై, ధర్మమునకు కట్టుబడని ఆచార భ్రష్టులయిన స్త్రీలవద్ద నీవు ఉండవచ్చు.’ నాల్గవది జీవహింస జరిగే ప్రదేశము. ‘జీవహింస జరిగే ప్రదేశముల యందు నీవు ఉండవచ్చు. ఈ నాలుగు ప్రదేశములను నీకు ఇచ్చాను’ అన్నాడు. ఇలా కలికి ఈ నాలుగు స్థానములను ఇచ్చుట ద్వారా పరీక్షిత్తుకు కలిసి వచ్చినది ఏమిటి? అసలు కలిని రావద్దు అని చెప్పాలి కాని, అలా నాలుగు స్థానములు కలికి ఇవ్వడం ద్వారా కలి వెళ్ళి జూడశాలలో పేకముక్కలు ఇస్తాడా, లేకపోతే మత్తు పదార్థములను అమ్మేచోటికి వెళ్ళి దుకాణం పెట్టుకుంటాడా, లేకపోతే జీవహింస తాను చేస్తాడా – మిమ్మల్ని కలి ఎలా పాడుచేస్తాడు? ఇది మీరు విశ్లేషణ చేయాలి. జూదశాలయందు ఏమి జరుగుతుంది? అక్కడ అసత్యము ప్రబలుతుంది. లోకమునందు పోకడ మీరు గమనించే ఉంటారు. గుడికి వెళ్ళేవాడు ‘ఏమండీ- నేను ఒక్కసారి శివాలయమునకు వెళ్ళి ప్రదక్షిణ చేసి వచ్చేస్తానండి అంటాడు. సినిమాకి వెళ్ళేవాడు నేను సినిమాకి వెడుతున్నాను అని చెప్తాడు. కానీ తాను పేకాడుకోవడానికి వెడుతున్నానని ఎవడూ చెప్పడు. మర్యాద పోతుందని వాడికి తెలుసు. తన స్నేహితుడి ఇంటికి వెళ్ళివస్తానని అబద్ధం చెప్తాడు. లేకపోతే క్లబ్ ను ఒకదానిని పెట్టుకుని అక్కడికి వెడుతున్నానని చెప్పుకుంటారు. అలా చెప్పుకుందుకు సిగ్గుపడరు. మనం సాధారణంగా ఏమని అనుకుంటామంటే వీరందరూ లోపల కూర్చుని ఏదో దేవకార్యం నిర్వహిస్తున్నారని అనుకుంటాము. ఏమీ ఉండదు అక్కడ ఆడుకుంటూ ఉంటారు. అక్కడ చాలా నిశ్శబ్దంగా ఐశ్వర్యం వెళ్ళిపోతుంది. అది కలిస్థానం. అందుకని అక్కడ అసత్యం ప్రారంభమవుతుంది.

సత్యమును ఆశ్రయించి లక్ష్మి ఉంటుంది. అసత్యం పలకగానే లక్ష్మి వెళ్ళిపోవడం మొదలయిపోతుంది. జూదశాలలో అసత్యమే చెప్పాలి. కాబట్టి ఏం చేస్తాడు? ప్రారంభం అసత్యం. తీరా వెళ్ళిన తర్వాత మూడుగంటలు కూర్చుని ఇంటికి వస్తాడు. పాపం భార్య అలా కూర్చుని ఉంటుంది. ‘ఏమండీ ఇంతసేపు ఎక్కడికి వెళ్లారండీ’ అంటుంది. అపుడు ఆయన ‘స్వామీజీ ఉపన్యాసమునకు వెళ్లాను. నేను వెళ్ళకపోతే ఆయన చెప్పలేనని అంటున్నాడు. అందుకని వెళ్లాను’ అంటాడు. కాబట్టి అక్కడొక అసత్యం. కానీ క్రమంగా తెలుస్తుంది. భార్య ఇంట్లో ఏడుస్తూ ఉంటుంది. ‘మీరు పేకాటలో డబ్బు పోగొట్టుకుంటున్నారు’ అంటుంది. ‘ఏమీ కాదు డబ్బు మా నాన్న గారికి పంపించాను’ అంటాడు. బుకాయిస్తాడు. దబాయిస్తాడు. జూదశాల నుంచి కలి అసత్యరూపంలో వస్తున్నాడు. కాబట్టి భ్రష్టత్వం వచ్చేసింది. రెండవది పానశాల. తాగగానే యుకాయుక్త విచక్షణ పోతుంది. మదము ప్రవేశిస్తుంది. అతివాగుడు మొదలవుతుంది. తాగగానే శుకపిక బకరవములు ప్రారంభమయిపోతాయి. ఒక వెర్రివాగుడు మొదలుపెట్టేస్తాడు. సేవించకూడనిది సేవించడం వల్ల నీ అంత నీవు రాక్షసుడవు అయిపోతున్నావు. ఈశ్వరుడు ఇచ్చిన దైవత్వమును నాశనం చేసుకుంటున్నావు. అపుడు ఈశ్వరుని దయ ప్రసరించదు. ఈశ్వరుని ఆగ్రహం ప్రకటితమౌతుంది. మదోన్మత్తుడవు అవుతావు. ఆ మదము నిన్ను భ్రష్టుడిని చేసేస్తుంది. కలి మదరూపంలో వస్తాడు. అందుకని పానశాలయందు ఉండడానికి పరీక్షిత్తు కలికి అవకాశం ఇచ్చాడు. మూడవది స్వేచ్ఛా విహారిణి అయిన స్త్రీ. ఆమె వలన సమాజం భ్రష్టు పడుతోంది. మనిషి విషయ సంగాలోలుడు అయిపోతున్నాడు.

నాల్గవది హింస. నిష్కారణముగా ఒక ప్రాణి బాధపడితే తాను సంతోషించుటను హింస అంటారు. ప్రాణిహింస అంటే కేవలం ప్రాణులను చంపివేయడమని కాదు. అస్తమానూ చంపి వేయనక్కరలేదు. కొంతమంది చీమలు వెడుతుంటే వాటిని తొక్కేస్తారు. కొంతమంది నిష్కారణంగా చెట్ల ఆకులను తున్చేస్తారు. నీవు ఆకులను సృష్టించలేదు. అటువంటప్పుడు ఆ ఆకులను తుంచివేసే హక్కు నీకు లేదు. అది నిష్కారణ హింస. అన్నిటికంటే భయంకరమయిన హింస నోటిమాట.కడుపుల్ రంపపుకోత కోయునదియే గాయాలు కాకుండినన్’ అన్నారు గయోపాఖ్యానంలో. ఒక మనిషిని పడుకోబెట్టి మతుమందు ఇవ్వకుండా ఒక రంపము పట్టుకువచ్చి అటు ఒకరు, ఇటు ఒకరు నిలబడి దూలమును కోసినట్లు కోస్తుంటే, ఆ కడుపు కోయబడుతున్న వాడు ఎంత బాధపడతాడో, అవతలవారు తాను అంటున్న మాటలకు అంత బాధపడుతున్నాడన్న ఇంగితజ్ఞానం లేకుండా, ఈశ్వరుడు నోరు ఇచ్చాడని వాక్కునందు అదుపు ఉండాలి. అవతలివారు బాధపడకుండా మధురమధురంగా మాట్లాడడం నేర్చుకోవాలి మనిషి. ప్రయత్నపూర్వకంగా అభ్యసించకపోతే మాటయందు కాఠిన్యము అలవాటయిపోతుంది. అవతలివారి యందు నిష్కారణమయిన కోపం పెరిగిపోతుంది. అవతలివాడు బాధపడుతుంటే వీడు సంతోషపడతాడు. అవతలివాడి బాధ వీడి సంతోషమునకు హేతువయిన నాడు అది కలిపురుషుని ప్రవేశమును సూచిస్తుంది.

‘కాబట్టి ఈ నాలుగు స్థానములు నీకు ఇస్తున్నాను’ అన్నాడు పరీక్షితు కాలితో. తాను పరిపాలనలో వుండగా ఈ నాలుగు స్థానములకు తన ప్రజలు ఎవ్వరూ వెళ్ళరని పరీక్షిత్తు నమ్మకం. ఈ నాలుగుచోట్లకు బాగా వెళ్ళాలని కోరుకుంటే ఆయన పరీక్షిత్తు కాదు. అటువంటి వాడు కలి ప్రతినిధి.

మీరు నాలుగింటిలో ఒకదానికి పట్టుకున్నారంటే మిగిలిన మూడింటివైపు మిమ్మల్ని ఎలా లాగివేయాలో కలికి తెలుసు. భాగవతమును వినడం వలన మీ జీవితం ఎక్కడ పాడయిపోతున్నదో మీరు తెలుసుకోగలుగుతారు.కలిపురుషుడు చాలా తెలివితేటలుగా ప్రజలను మభ్యపెట్టగలదు. కలి పరీక్షిట్టుతో ‘అయ్యా, మీరు నాకు నాలుగు స్థానములు ఇచ్చారు. కానీ వీటిలో నేను ఊన్చుకోవడానికి తగిన స్థానం లేదు. కనుక ఇంకొక్క స్థానమును ఇప్పించండి’ అన్నాడు. అపుడు గభాలున పరీక్షిత్తు ‘నేను నీకు బంగారమునందు స్థానం ఇచ్చాను’ అన్నాడు. ‘చాలు మహాప్రభూ!’ అని కలి వెళ్ళిపోయాడు. ఆ రోజుల్లో బహుశః ఒక లక్షణం ఉండేది. నిస్సంగులయిన వారికి ఆత్మజ్ఞాన ప్రబోధము చేసేవారికి బంగారమునందు లోభము ఉండదు. వారు బంగారమును కోరరు. వారికి దానిమీద పెద్ద ఆసక్తి ఉండదు. అందుకని కలికి అక్కడ ఇచ్చినా ప్రమాదమేమీ ఉండదని పరీక్షిత్తు భావించి ఉండవచ్చు. కానీ పరీక్షిత్తు మాట తప్పనితనమే ఆయనకు ప్రతిబంధకము అయిపోయింది.

పరీక్షిత్తు ఒంటినిండా బంగారమే. అది చాలు కలికి పరీక్షిత్తులో ప్రవేశించి అతనిని నాశనం చేయడానికి. ఇంటికి వెళ్ళిన తరువాత పరీక్షిట్టుకి వేటకి వెళ్ళాలనే కోరిక కలిగింది. వేటకోసమని బయలుదేరాడు. అనేక మృగములను వేటాడాడు. కలి అంశలలో బంగారమునుండి తానిచ్చిన వేరొక స్థానములోనికి పరీక్షిత్తు వచ్చేశాడు. ఎలా? ఒకదానిద్వారా కలి ప్రవేశిస్తే చాలు, మిగిలిన అవలక్షణములన్నీ వచ్చేసి ఆ వ్యక్తి చివరకు నాశనం అయిపోతాడు. పరీక్షిత్తు ఒంటిమీద బంగారం ఉంది. అందుకని కలి పరీక్షిత్తులోనికి ప్రవేశింపగలిగాడు. తరువాత పరీక్షిత్తుకు జీవహింస చేయాలన్న కోరిక పుట్టింది. సాధారణంగా వేటకి ప్రభువు ఎప్పుడు వెడతాడంటే – జానపదులు వచ్చి, అయ్యా, క్రూర మృగముల సంఖ్యా పెరిగి పోయిందండి’ అని వేడుకుంటే, ఆ క్రూర మృగములు ఊరిమీదకి రావడానికి భయపడే రీతిలో రాజు పెద్ద పరివారంతో దండుగా వెళ్ళి కొన్ని క్రూర మృగాలను వేటాడతాడు. అలా వెళ్ళాలి. అంతేగానీ జంతువులను సరదాగా చంపడానికి వేటకు వెళ్ళకూడదు.కానీ ఇప్పుడు పరీక్షిత్తుకు జంతువులను చంపుదామనే ఆలోచన పుట్టింది. అందుకని వేటకు వెళ్ళాడు. తద్వారా ఇంకొక స్థానంలోకి వెళ్ళాడు. అతనిలో నిష్కారణ క్రౌర్యం ప్రవేశించింది.

శ్రీమద్భాగవతం పద్యాలు




క్షంతకుఁ గాళియోరగ విశాల ఫణోపరివర్తనక్రియా
రంతకు నుల్లసన్మగధరాజ చతుర్విధఘోర వాహినీ
హంతకు నింద్రనందననియంతకు, సర్వచరాచరావళీ
మంతకు, నిర్జితేంద్రియసమంచిత భక్తజనానుగంతకున్.

భావము:
క్షమాగుణశీలికి; కాళియుని విశాలమైన పడగలపై నాట్యమాడటం నేర్చినవాడికి; పొంగి దాడిచేసిన భయంకరమైన జరాసంధుని చతురంగ సైన్యాలను హతమార్చినవాడికి; పార్థుని రథాన్ని నడిపినవాడికి; సమస్త చరాచర ప్రపంచం స్మరిస్తుండే వాడికి; జితేంద్రియులైన భక్తుల వెంటనుండువాడకి.

శ్రీమద్భాగవతం పద్యాలు




న్యాయికి, భూసురేంద్రమృతనందనదాయికి, రుక్మిణీమన
స్థ్సాయికి, భూతసమ్మదవిధాయికి, సాధుజనానురాగ సం
ధాయికిఁ బీతవస్త్రపరిధాయికిఁ బద్మభవాండభాండ ని
ర్మాయికి, గోపికానివహ మందిరయాయికి, శేషశాయికిన్.

భావము:
న్యాయాన్ని మెచ్చువాడికి, చచ్చిపోయిన బ్రాహ్మణ బాలుణ్ణి తెచ్చి యిచ్చినవాడికి, రుక్మిణీదేవి మనస్సుకు బాగా నచ్చినవాడికి, సకల జగత్తుకీ సంతోషాన్ని సమకూర్చేవాడికి, సజ్జనుల ఆదరాభిమానాలను తీర్చిదిద్దేవాడికి, పట్టు పీతాంబరాన్ని కట్టుకునేవాడికి, బ్రహ్మాండ భాండాలను సృజించేవాడికి, గోపికల గృహాలన్నిటికి వెళ్ళువాడికి, ఆదిశేషునిపై శయనించేవాడికి.

శ్రీమద్భాగవతం - 100 వ భాగం




ఏకాదశ స్కంధము – బ్రహ్మాది దేవతలు శ్రీకృష్ణుని వైకుంఠమునకు పిలువవచ్చుట:

కొన్ని సంవత్సరముల తర్వాత ఒకనాడు బ్రహ్మాది దేవతలు కృష్ణ పరమాత్మ మందిరమునకు విచ్చేసి ఆయన దర్శనం చేసుకున్న తర్వాత కృష్ణుడు ‘ఈవేళ యింతమంది దేవతలు వచ్చారు. ఏమిటి విశేషం” అని అడిగాడు. అపుడు వాళ్ళు “ఈశ్వరా! రాక్షస సంహారం చెయ్యడం కోసమని మీరు వైకుంఠంనుండి బయలుదేరి యిక్కడకు వచ్చి కృష్ణుడు అనబడే పేరుతో కొంతకాలం అవతారం స్వీకరించి అందరికీ గొప్ప సులభుడవు అయ్యావు. గోపకులంలో పుట్టి గోవులు, గోపాల బాలురు, గోపకాంతలు అందరూ నీ ప్రేమ అనుభవించేటట్లుగా ప్రవర్తించావు. నీవు వచ్చి నూట యిరువది అయిదు సంవత్సరములు పూర్తి అయిపొయింది. కాబట్టి ఇంక నీవు ఈ అవతారమును విడిచిపెట్టి తిరిగి వైకుంఠధామమును చేరి నీ మూల స్థానమునందు ప్రవేశించవలసినది’ అని అడిగారు. అప్పుడు భగవానుడు ‘ఓహో! అయితే యింక నేను ఈ అవతారమును చాలించవలసిన సమయం ఆసన్నమయినది. కాబట్టి మేమి అవతార పరిసమాప్తి చేస్తాను. తొందరలోనే బయలుదేరి మీ దగ్గరకు వచ్చేస్తాను’ అని చెప్పి ఒకసారి మనసులో సంకల్పం చేశారు. ‘తాను వెళ్ళిపోయిన తరువాత యాదవులకు నాయకత్వం ఉండదు.
కాబట్టి ఈ యాదవుల కులం అంతా కూడా తనతోపాటే నశించిపోవాలి. మొత్తం కులనాషణం జరగాలి’ అని తలంచారు. తాను నాయకత్వమునందు ఉండగా దేవతలే వచ్చి నిలబడినా యాదవులను ఎవరూ చెణకలేరు. మనకి కృష్ణ పరమాత్మ తన అవతార పరిసమాప్తిలో కూడా ఒక రహస్యమును ఆవిష్కరిస్తారు. భగవంతుణ్ణి నమ్ముకున్న పరమ భాగవతోత్తములతోటి పరిహాసం ఎంత ప్రమాదమును తీసుకువస్తుందో చూపిస్తారు. అటువంటి ప్రమాదంతో కూడిన పనిని యాదవులచేత చేయించారు.

విశ్వామిత్ర వశిష్ఠ నారదాది మహర్షులు శ్రీకృష్ణుని సందర్శనమునకు వచ్చుట:

ఒకరోజున అసితుడు, విశ్వామిత్రుడు, దుర్వాసుడు, భ్రుగువు, అంగీరసుడు, కశ్యపుడు, వామదేవుడు, వాలఖిల్యుడు, అత్రి, వశిష్ఠుడు వంటి మహర్షులు అందరూ కృష్ణ పరమాత్మ దర్శనమునకు వచ్చారు. వారు ఒక్కొక్కరు మహాపురుషులు. వారి పేరు విన్నంత మాత్రం చేత పాపరాశి అంతా ధ్వంసం అయిపోతుంది. వారందరూ కృష్ణ భగవానుడిని చూసి ఒకమాట అన్నారు. “నిన్ను సేవించని రోజు జీవితంలో ఏది ఉన్నదో అది నిరర్ధక మయిన రోజు. కొందరు ఈశ్వరుడు తప్ప మిగిలిన అన్నిటివైపు తిరుగుతారు. అలా తిరగడం వలన మనుష్య జన్మ నిరర్థకం అయిపోతుంది. ఆ తరువాత మరల ఎక్కడికి వెళ్ళిపోతాడో తెలియదు. వీళ్ళు పొందిన మనుష్య జన్మ గొప్పతనం వీళ్ళకి తెలియక ఈ శరీరమును నిలబెట్టుకోవడమే గొప్ప అనుకోని, కేవలం దీనిని పోషించుకొని దీనితో అనుభవించిన సుఖమును సుఖమనుకొని గడిపివేస్తున్నారు.కానీ ఈ శరీరమును అరణ్యంలోకి వెళ్లి దాచుకున్నా యిది ఉండదు. వెళ్ళిపోతుంది. అలాంటి శరీరమునందు మగ్నులై వెళ్ళిపోతున్నారు. అయితే ఈ కాలమునందు ఇలాంటి ఏమీ తెలియని అజ్ఞానమునకు హద్దులు లేని గోపాల బాలురతో కలిసి నీవి తిరిగి, కౌగలించుకొని, ఆడి పాడి యింతమందిని తరింపజేశావు. కృష్ణా, నీ లీలలు రాబోవుతరంలో విన్న వారిని, చదివిన వారిని, చెప్పిన వారిని, గోవింద నామమును పలికిన వారిని

Monday 9 January 2017

భాగవతం ఉత్తములకు సద్బ్రాహ్మణులకు శ్రేయోదాయకమైనది.

బ్రహ్మదేవుడికైన పరమశివునికైన భాగవతమును తెలిసి పలుకుట చిత్రమైనట్టి శ్రీమద్భాగవతం కల్పవృక్షంతో సాటిరాగలిగి ప్రకాశించేది. ఏమాత్రం సందేహం లేదు. దీనిని రెండు రకాల అన్వయార్థాలు గల పదప్రయోగాలతో ఇలా వివరించారు. కల్పవృక్షం కొమ్మలతో మనోజ్ఞ మైంది అయితే భాగవతం స్కంధాలనే 12 భాగాలతో లలిత మనోహర మైనది. కల్పవృక్షం నల్లగా ఉండే వేళ్ళు కలది అయితే భాగవతానికి మూలం భగవాను డైన శ్రీకృష్ణుడుగా కలది. కల్పవృక్షం చిలుకల పలుకలతో సతతం కూడి మనోహరంగా ఉంటుంది, అలాగే భాగవతం శుకమహర్షి మధుర వాగ్ధారలతో మనోజ్ఞంగా ఉంటుంది. కల్పవృక్షం అందమైన పూల తీగలచే అలంకరింప బడినది, మరి భాగవతం మనోహర మైన వాక్కులుతో అలరారేది. కల్పవృక్షం మంచి రంగురంగుల పూలతో శోభిల్లు తుంటుంది, అదేవిధంగా భాగవతం అక్షర సార్థక మై సజ్జనుల మనసులు అలరించేది. కల్పవృక్షం సుందరంగా ఉజ్వలంగా ప్రకాశిస్తు గుండ్రంగా ఉంటుంది, అదే మరి భాగవతమో సుందరము ఉజ్వలము అయిన చక్కటి పద్య వృత్తాలు గలది. కల్పవృక్షం ఎంత గొప్ప కామితార్థాల నైనా అందిస్తుంది, అయితే భాగవతం కైవల్యాది కామిత ప్రయోజనాలు సర్వం సమకూర్చేది. కల్పవృక్షం విశాలమైన చుట్టుకొలత గల మాను కలిగినది, అలాగే భాగవతం స్వచ్చమైన వ్యాస కృత వ్యాసాలతో నిండినది. కల్పవృక్షం స్వర్గంలో విలసిల్లు తుంది, మరి భాగవతమో భూలోకంలో విరాజిల్లుతోంది. కల్పవృక్షం శుక పికాది పక్షులకు సైతం శ్రేయస్కర మైనది, అదే భాగవతం అయితే ఉత్తములకు సద్బ్రాహ్మణులకు శ్రేయోదాయక మైనది.

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles