Showing posts with label మార్గశీర్షం. Show all posts
Showing posts with label మార్గశీర్షం. Show all posts

Saturday 31 December 2016

17వ పాశురము


అమ్బరమే తణ్ణీరే! శోఱే! అఱమ్ శెయ్యుమ్
ఎమ్బెరుమాన్! నన్దగోపాలా! ఎళిందిరాయ్
కొంబనార్కెల్లామ్ కొళున్దే! కులవిళక్కే
ఎమ్బెరు మాట్టి యశోదాయ్! అఱివుఱాయ్
అమ్బర మూడఱుత్తు ఓంగి యులగళన్ద
ఉమ్బర్ కోమానే ఉఱంజ్గాదు ఎళిందరాయ్
శెమ్ పొఱ్కళలడిచ్చెల్వా; బలదేవా
ఉమ్బియమ్ నీయుమ్ ఉఱంగేలో రెమ్బావాయ్

భావం : ద్వారాపాలకులు గోపాంగనలను లోనికి అనుమతించగా వారు మొదట అన్న, వస్త్ర, తీర్ధాదులను ధర్మబుద్ధితో దానము చేసే నందగోపులను 'స్వామి! మేలుకొను' మని ప్రార్ధించారు. తరువాత 'ప్రబ్బలి తీగవంటి స్త్రీల కందరకును, తీగవలె ముఖ్యమైనదానా! గొల్లకులమునకు మంగళదీపము వంటిదానా! మాకును స్వామినివైన ఓ యశోదమ్మా! లేమ్మా!' అని వేడుకొనిరి. 'ఆకాశమంత ఎత్తుకెదిగి సమస్త లోకాలను కొలిచి దేవతలకే రాజైన ఓ కృష్ణా! ఇక నిద్ర చాలునయ్యా! మేలుకో!' అని ప్రార్ధించిరి. ఆయన వేళకుండుట చూచి, బలరాముని లేపక తప్పు చేసితిమని ఎరిగి 'మేలిమి బంగరు కడియములతో శోభించు పాదయుగళిని గల ఓ బాలరామా! నీ తమ్ముడు శ్రీకృష్ణుడును, నీవును యింకను నిదురించుట తగదు. కావున శీఘ్రమే లేచి రండు!' అని అందరినీ క్రమము తప్పక మేల్కొలుపుచున్నారు. వారి కృపను వేడుచున్నారు.

ద్వారపాలకుని వేడి, అతడు గడియ తీసి గోపికలను లోనికి పంపగా అచట యింకను నిద్రిస్తున్న శ్రీనందగోపులను, శ్రీ యశోదమ్మను, శ్రీ బలరామునీ శ్రీకృష్ణునీ చూచారు - వారినందరను ఒక్కొక్కరిగా మేలుకొముపుటయే యీ (పాశురంలో) వర్ణించబడింది. తమకు అన్న వస్త్రాదులను దానం చేసే నందగోపుని మేల్కొల్పి తమకు అన్నధారక వస్త్రాదులన్నీ శ్రీకృష్ణుడే కావున వానిని అనుగ్రహించమని ప్రార్ధిస్తున్నారు. ఇట నందగోపుడే సదాచార్యుడు. వానినాశ్రయించగా ఆచార్యుడు మంత్రోపదేశం చేస్తాడు. ఆ మంత్రమే యశోద. కనుక యశోదమ్మను మేల్కొలిపి - అనగా మంత్రాన్ననుష్టించి స్వామి దర్శనాన్ని అభిలషించి శ్రీకృష్ణుని లేపారు. కాని జరిగిన పొరపాటున గ్రహించి ప్రక్కనున్న పెద్దవాడైన బలరాముని మేల్కొలిపారు. బలరాముడు ఆదిశేషుని అవతారమేకదా! వారిని ప్రార్ధిస్తున్నారీ పాశురంలో.🙏👏

Friday 30 December 2016

తిరుప్పావై పదహారవ రోజు పాశురము


 -----------------------------------------------
  నాయగనాయ్ నిన్ఱనన్దగోపనుడైయ
    కోయిల్ కాప్పానే! కొడిత్తోన్ఱుమ్ తోరణ
    వాశల్ కాప్పానే! మణిక్కదవమ్ తాళ్ తిఱవాయ్,
    ఆయర్ శిఱుమియరో ముక్కు; అఱైపఱై
    మాయన్ మణివణ్ణన్ నెన్నలే వాయ్ నేర్ న్దాన్;
    తూయోమాయ్ వన్దోమ్, తుయలెళ పాడువాన్,
    వాయాల్ మున్న మున్నమ్ మాత్తాదే, అమ్మా! నీ,
    నేశ నిలైక్కదవమ్ నీక్కేలో రెమ్బావాయ్.

 భావం :- మాకందరకును ప్రభుడైన నందగోపుని యొక్క తిరుమాళిగను రక్షించువాడా! మమ్ము లోనికి పోనిమ్ము. మేము వ్రేపల్లెలో నుండు గొల్లపిల్లలము. స్వామిని దర్శింపవచ్చాము. పరిశుద్ధులమయి వచ్చాము. మణులతో కూడిన గడియను తెరువుము. మేము స్వామికి శరణాగతి చేసినవారము. గొల్లకులమయిన పుట్టిన అజ్ఞానులమైననూ స్వామి యందత్యదిక ప్రేమానురాగములు కలవారము. స్వామికి సుప్రభాతము పాడి మేలుకొలుప వచ్చినాము. గొల్లవంశంలో పుట్టిన మాకు ఆశ్చర్య గుణ చేష్ఠితుడును. ఇంద్రనీల మణివర్ణముగల శరీరము కలవాడును అగు శ్రీకృష్ణుడు మాకు 'పఱై' అను ధ్వనించెడు వాద్యము నిత్తునని నిన్ననే వాగ్దానము చేసినాడు. ఇప్పుడనన్య ప్రయోజనులమై స్వామి నిద్రలేచునట్లుగ సుప్రభాతమును పాడగా వచ్చాము. స్వామీ! నీ నోటితో వద్దని చెప్పకుము. మమ్ములను అడ్డుకొనక ధృడముగా బంధించిన తలుపు గడియను వెంటనే తెరిచి లోనికి పోనీయమని కావలి వానిని వేడుకొంటున్నారు.

    అవతారిక :-


    ధనుర్మాస వ్రతంలోని రెండవ దశ పూర్తియై యీ 16వ మాలికతో మూడవ దశ ప్రారంభమౌతుంది. నిద్రిస్తున్న గోపికలనందరను మేల్కొలిపి, అందరను వ్రతగోష్ఠిలోనికి ఆహ్వానించి, వారందరితో కూడి నందగోపుని భవనానికి పోయి, అచట రాజభవనాన్ని రక్షిస్తున్న కావలివానిని లేపుచున్నారు. పెద్దలు చేయని పనిని చేయమని' కదా ప్రతిజ్ఞ. దానినాచరించుతూ ద్వారపాలకుని లోనికి పోనిమ్మని వేడుకున్నారు. భాగవతుల పురస్కరించుకొని కార్యములను చేయనిచో అనగా క్రమమును తప్పినచో, శూర్పణఖవలె పరాభవము నొందవలసిందేకదా! అనగా పురుషకారమును పురస్కరించుకొనకుండ పెరుమాళ్లను ఆశ్రయింపరాదని తెలియవలెను కదా! భగవంతుని చేరటానికి ముందు ఆచార్యు నాశ్రయించవలెను కదా! నిరహంకారులై ఆచార్యునాశ్రయించినవారికి పరమాత్మ తానే స్వయంగా జ్ఞానాన్ని కలిగిస్తాడు. కనుక గోపికలు ముందు ద్వారపాలకుని వేడుకొన్నారు. అటుపై నందగోపుని ఆశ్రయించి అతనిద్వారా శ్రీకృష్ణపరమాత్మను పొందే క్రమాన్ని పాటిస్తున్నారు.

    దేవాలయానికి వెళ్ళి స్వామిని తిన్నగా దర్శించరాదని పెద్దల సూక్తి, మొదట క్షేత్రపాలకుని దర్శించాలి. పిదప ద్వారపాలకులను ఆ తర్వాత అమ్మవారినీ సేవించి అటు తర్వాతనే స్వామి దర్శనం చేసుకోవాలనే నియమం వుంది. మనస్సునదుపులో వుంచుకొని ఆత్మస్వరూపుడైన ఆ పరమాత్మను ఉపాసించాలని ఆండాళ్ తల్లి మనకు చెప్తున్నది (పాశురంలో)        

        (ఖరహరప్రియ - ఏకతాళము)

ప..    మా ప్రభుడౌ నందుని తిరు మాళగ రక్షించువాడ!
    సుప్రకాశ ధ్వజతోరణ ద్వారము గాచేటివాడ!
    ఈ ప్రభాత సమయమ్మున నీ ద్వారము తెరువుమా!
    సుప్రభాత మాలపింప నిటకు వచ్చినామయా!

చ..     గొల్ల పిల్లలను మాకు నల్లని కృష్ణయ్య నిన్న
    అల్లన మ్రోగేటి వాద్య ముల్ల మలర నిత్తుననెను.
    చెల్లని మాటల నోటను మెల్లగ జెప్పగబోకుమ!
    నల్లనయ్య కృష్ణయ్యను మెల్లగ దర్శింపరాగ
    ఈ ప్రభాత సమయమ్మున నీ ద్వారము తెరువుమా!
    సుప్రభాత మాలపింప నిటకు వచ్చినామయా!

Thursday 29 December 2016

తిరుప్పావై పదిహేనవ పాశురము


ఎల్లే యిలంగిళియే ! యిన్నమురంగుడియో?
శిల్లెన్రళై యేన్మిన్? నజ్ఞ్గైమీర్, పోదరుగిన్రేన్
వల్లై ఉన్ కట్టురైగళ్ పణ్డేయున్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీజ్ఞ్గళే, నానేదా నాయుడుగ
ఒల్లైనీ పోదాయ్, ఉనక్కెన్న వేఱుడైయై ?
ఎల్లారుమ్ ఫోన్దారో? ఫోన్దార్, ఫోన్దెణ్ణిక్కొళ్
వల్లానై కొన్రానై మాత్తారై మాత్తళిక్క
వల్లానై మాయనై ప్పాడేలో రెమ్బావాయ్. !

భావం:

ఈ పాశురంలో ఉన్న గోపికకు , బయట ఉన్న గోపికలకు సంవాదము నిబంధింపబడినది.
బయట గోపికలు : ఓ లేత చిలుక వంటి కంఠమాధుర్యము కలదానా ! ఇంకను నిద్రించుచున్నావా ! అయ్యో ఏమి ఇది ?

లోపల గోపిక     : పూర్ణలగు గోపికలారా ! చీకాకు కలుగునట్లు జిల్లుమని పిలువకుడు. నేను ఇప్పుడే వచ్చుచున్నాను.

 బయట గోపికలు : నీవు చాలా నేర్పుగల దానవు. నీ మాటలలోని నైపుణ్యమును కాఠిన్యమును మేము ఇంతకు ముందే తెలుసుకున్నాము.

లోపల గోపిక     : మీరే నేర్పుగలవారలు, పోనిండు, నేనే   కఠినురాలను.

బయట గోపికలు : నీకు ఈ ప్రత్యేకత ఏమి ?అలా ఏకాంతముగా ఉండేదవేల ? వేగముగా బయటకు రమ్ము.

లోపల గోపిక     :  అందరు గోపికలు వచ్చిరా ?

బయట గోపికలు : వచ్చిరి, నీవు వచ్చి లెక్కించుకొనుము.

లోపల గోపిక     : సరే ! నేను వచ్చి ఏమి చేయవలెను ?

బయట గోపికలు : బలిష్టమగు కువలయాపీడనము అను ఏనుగును చంపిన వాడును శత్రువుల దర్పమును అణచినవాడును, మాయావి అయిన శ్రీకృష్ణుని కీర్తిని గానము చేయుటకు రమ్ము.

అవతారిక:-

ఇంతవరకు భగవత్ప్రాప్తికి చేయవలసిన సాధనాక్రమము వివరింపబడినది. ఇట్టి సాధన చేయుటచే ఏర్పడవలసిన ప్రధాన లక్షణము అహంకారము తొలుగుట. అది పూర్ణముగా తొలగిననాడుగాని ఆచార్య సమాశ్రయణముచే మంత్రము లభించి భగవదనుభవము కలుగనేరదు. ఇట్టి పరిపూర్ణస్థితి యందు ఉన్న గోపిక ఈనాడు మేలుకొలుపబడుచున్నది.
మొదటి సగము ఒక తిరుప్పావు -- రెండవ సగము వేరొక తిరుప్పావు. మొదటిది భాగవత సమాశ్రయణ వ్రతము, భగవత్భక్తులను ఆశ్రయించుటచే ఆత్మగుణములు పరిపూర్ణముగా ఆవిర్భవించి భగవంతునికి ప్రియమగునత్తి ఆకారము లభించును. ఆ ఆత్మగుణ పరిపూర్తి అనేది ఎట్టిదో ఈ పాశురములో నిరూపించబడినది.

తిరుప్పావై పద్నాల్గోవరోజు పాశురము


ఉజ్గళ్ పుళైక్కడై త్తోట్టత్తు వావియుళ్
    శెజ్గళు నీర్ వాయ్ నెగిళ్ న్దు అమ్బల్ వాయ్ కూమ్బినకాణ్
    శెజ్గల్ పొడిక్కూఱై వెణ్బల్ తవత్తవర్
    తజ్గళ్ తిరుక్కోయిల్ శజ్గిడువాన్ పోగిన్ఱార్
    ఎజ్గళై మున్నమ్ ఎళుప్పువాన్ వాయ్ పేశుమ్
    నజ్గాయ్! ఎళున్దిరాయ్ నాణాదాయ్ నావుడైయాయ్!
    శజ్గొడు శక్కర మేన్దుమ్ తడక్కైయన్
    పజ్గయక్కణ్తానై ప్పాడేలో రెమ్బావాయ్.

భావం:- ఏమె సఖీ! ఇదేమి? ముందుగ మమ్ములను లేపుదునంటివికదా! ఇంతవరకును పండుకొనే వున్నావేమి? లే! లెమ్ము! తెల్లవారిపోయినది. చూడు. మీ పెరటిలోని ఎర్రకలువలు విచ్చుకున్నవి. నీలోత్పలాలు ముకుళించినవి. కాషాయంబరులైన మునులు. యోగులు తెల్లని పలువరుసలు కలిగిన వారందరూ దేవాలయాలలో భగవదారాధన నిమిత్తమై కోవెల తలుపులు తీయటానికి 'కుంచెకోలను' తాళపు చెవులను తీసికొని వెళ్ళుచున్నారు. ఇవన్నీ ప్రాతః కాలమగు సూచనలేకదా! నీవు చేసిన వాగ్దానమును మరచితివా? నీకేమి? నీవు పూర్ణురాలవుకదా! సరే! ఇకనైన లేచిరమ్ము. వాగ్దానమును మరచిన సిగ్గులేని దానా? లేవవమ్మా అనగా 'నన్నేల నిందింతురు? నేనేమి చేయవలె?; ననగా శ్రీ శంఖచక్రములచే విరాజిల్లుచున్న విశాల సుందర భుజములు గలవానిని, పంక జాక్షుని ఆ శ్రీకృష్ణుని గుణగణములను మధురమైన స్వరమున కీర్తించవలెను. మేమును నీతో కలిసి పాడెదము. ఇట్లు గోష్ఠిగా సంకీర్తనము చేసిన మన వ్రతము ఫలించగలదు. కావున వెంటనే మేలుకొనుమమ్మా' అని గోదాదేవి యీ (పాశురంలో) తొమ్మిదవ గోపికను లేపిచున్నది.  
అవతారిక :-

ఎవరికిష్టమైన రీతిగా వారు శ్రీరాముని, శ్రీకృష్ణుని గుణగణాలను కీర్తించారు గోపికలు. తన నేత్ర సౌందర్యానికే అబ్బురపడి శ్రీకృష్ణుడే తన వద్దకు రాగలడని తలచిన సౌందర్యవతియైన గోపికను మేల్కొలిపారు క్రిందటి (పాశురంలో) ఇప్పుడు ఊరినంతటిని ఒకే త్రాటిపై నడిపించగలిగే సమర్ధత కలిగిన నాయకురాలైన ఒక గోపాంగనను ఆండాల్ తల్లి (యీ పాశురంలో) లేపుతున్నది. తానే వచ్చి అందరను మేల్కొల్పుతానని బీరాలు పల్కి, ఇంకను నిద్రబోవుచున్నదీ గోపిక. తన పెరట్లోని దిగుడుబావిలోని కలువలూ, తామరలనూ చూచుకొని మురిసిపోతున్నదీమె. ఈ మధురానందంలో మునిగి తాను చేసిన బాసలను మరిచిపోయినది. ఈమె భగవదనుభవానంద సాగరంలో మునిగి ఇతర విషయాలను మరిచి, ఆ ఆనందానుభూతిలోనే నిమగ్నయైనత్తిట్టి యిట్టి గోపికను (యీ పాశురంలో) మేల్కొలుపుతున్నది మన ఆండాళమ్మగారు.
  ( లలితరాగము - ఏకతాళము)
ప..    ముందుంగ లేపుదు నంటివి ముచ్చటలెన్నో చెప్పితి
    వెందుబోయె నోటిమాట! సిగ్గు నీకు లేకపోయె!

1 చ..    పెరటి దిగుడు బావిలోని ఎర్రని కలువలు నవ్వెను!
    పరికించవె సఖి! ఆ నీలోత్పలములు ముకుళించెను!
    తిరు కోవెల 'కుచ్చికోల' తెరువగ నదె తపోధనులు
    వర కాషాయాంబరులౌ శుభ్రదంతు లేగ గనవె!

2 చ..    శంఖ చక్రములు గల్గిన శ్రీహస్తుని హరిని
    పంకేరుహ నేత్రుని - శ్రీ కృష్ణుని సర్వేశుని
    పంకజలోచనీ! పాడుమో మంజుల భాషిణీ'
    ఇంకనైన లేవవె! నీ నిద్దుర చాలించవె!

Tuesday 27 December 2016

తిరుప్పావై 10వరోజు పాశురం


 నోత్తు చ్చువర్ క్కమ్ పుగుగిన్ఱ అమ్మనాయ్!
    మాత్తముమ్ తారారో వాశల్ తిఱవాదార్
    నాత్తత్తుళాయ్ ముడి నారాయణన్; - నమ్మాల్
    పోత్తప్పఱై తరుమ్ పుణ్ణియనాల్! పణ్డోరునాళ్
    కూత్తత్తిన్ వాయ్ వీళ్ న్ద కుమ్బకరణనుమ్
    తోత్తు మునక్కే పెరున్దుయిల్ తాన్ తన్దానో?
    ఆత్త అనన్దలుడైయాయ్! అరుజ్గలమే!
    తేత్తమాయ్ వన్దు తిఱ వేలో రెమ్బావాయ్.
భావం: నోము నోచి శ్రీకృష్ణ సంశ్లేష సుఖానుభవమును పొందుచున్న ఓయమ్మా! తలుపును తెరువుము, తలుపును తెరువకపోయినను మానెగాని, నోటినైనను తెఱచి పలుకవచ్చునుకదా తల్లీ! (జ్ఞానుల దర్శనము కంటె వారి శ్రీ సూక్తులను వినటమే చాల ముఖ్యమని చెప్పుచున్నది ఆండాళ్ తల్లి). పరిమళాలను వెదజల్లే తులసి మాలలను కిరీటముగా ధరించిన శ్రీ నారాయణుడు మనచే స్తోత్రము చేయబడినవాడై సంతసించి మనకు వ్రతోపక రణాలను (పఱై) ఇచ్చునుకద! పూర్వమొకనాడు ధర్మస్వరూపుడైన పరమాత్మ రామావతారుడై అవతరించి కుంభకర్ణుణ్ణి సంహరించాడు. ఆ కుంభకర్ణుడు తన పెనునిద్రను నీకేమైనా కానుకగా యిచ్చెనాయేమి? ఓ పెద్ద నిద్ర కలదానా! లేచిరమ్ము. నీవు మాకు శిరోభూషణమైనదానివి కద! తొట్రుపడక లేచివచ్చి మా గోష్ఠిలో చేరి మా వ్రతాన్ని పూర్తి చేయాలి. కనుక నీ యోగ నిద్రను వీడి లేచి రావమ్మా! అని ఐదవ గోపికను మేల్కొలుపుచున్నారు.  
అవతారిక :-

వేదములను అధ్యయనం చేయటానికి సమర్ధుడైన ఒక వేదాచార్యుడే లభించాలి. అట్లే శ్రీకృష్ణ సంశ్లేషమును పొందాలనుకుంటే దానికి సమర్ధులైన ఒక నాయకుడో, నాయకురాలో లభించి ఆ మార్గాన నడిపించవలెకదా! ఆ వూరి యంతటికిని కృష్ణ సంశ్లేషమున సమర్ధురాలైన ఒక గోప కన్యక, యీ గోపకన్యలందరును కృష్ణ సంశ్లేషమును పొందగోరి పడుచున్న శ్రమనంతయు శ్రీ కృష్ణుడే పడునట్లు చేయ సమర్ధురాలైనది, శ్రీకృష్ణునికి పొరిగింటనున్నదియై, నిరంతరము కృష్ణానుభవమునకు నోచుకొన్నదియై వున్నది. అట్టి ఆ గోపికను (యీ పదవ మాలికలో) లేపుచున్నారు.
(బిలహరి రాగము - రూపక తాళము)
ప..    నోము నోచి సుఖములను పొందగ దలచిన ఓయమ్మా!
    ఏమి తలుపుతీయవు? ప్రత్యుత్తరమీయ వేలనో యమ్మా!

అ..ప..    ఏమి తలుపు తీయవు? ప్రత్యుత్తర మీయ వేలనో యమ్మా!
    ఏమి తలుపుతీయవు? ప్రత్యుత్తర మీయ వేలనో యమ్మా!

చ..    పరిమళించు తులసి మాలల కిరీటధారుడు
    నారాయణుడే మనచే కీర్తింపబడువాడు
    పురుషార్థము నిచ్చునట్టి శ్రీహరి ధర్మాత్ముడు
    పురుషోత్తము గొలువ తెలివిగొని తలుపులు తీయవె!

చ..    శ్రీరాముని కాలమందు మృత్యు నోట బడె నొకడు
    ఘోర నిద్ర కామించెడి వీర కుంభకర్ణుడు
    ఆ రాక్షసుడోడి నీకు దీర్ఘనిద్ర నిచ్చెనో - మా
    శిరోభూషణమ్మ! తెలివి చెంది తలుపు తీయవె!
    నోమునోచి సుఖములను పొందదలచిన ఓయమ్మా!
    ఏమి తలుపుతీయవు? ప్రత్యుత్తరమీయవేలనో యమ్మా!

తిరుప్పావై 11వ పాశురం


  తూమణి మాడత్తు చ్చుత్తుమ్ విళక్కెరియ
    తూపమ్ కమళ త్తుయిలణై మేల్ కణ్ వళరుమ్
    మామాన్ మగళే! మణిక్కదవమ్ తాళ్ తిఱవాయ్
    మామీర్! అవళై యెళుప్పీరో! ఉన్ మగళ్ దాన్
    ఊమైయో? అన్ఱిచ్చెవిడో? ఆనన్దలో
    ఏమప్పెరున్దుయిల్ మన్దిరప్పట్టాళో?
    "మామాయన్, మాదవన్; వైగున్దన్" ఎన్ఱెన్ఱు
    నామమ్ పలవుమ్ నవి న్ఱేలో రెమ్బావాయ్!

భావం: నిర్దోషమలైన మాణిక్యములతో నిర్మించిన భవనంలో చుట్టునూ దీపాలు వెలుగుతుండగా, అగరు ధూపములను పరిమళాలను వెదజల్లుచుండగా, అతిమెత్తనైన హంసతూలికా తల్పముపై పరుండి నిద్రిస్తున్న ఓ మేనమామ కూతురా! మణిమయ ప్రభలతో ప్రకాశించుచున్న నీ భవనపు గడియను తీయవమ్మా! ఏమమ్మా! మేనత్తా! నీవైనా ఆమెను లేపుమమ్మా! ఏమి? నీ పుత్రిక మూగదా? చెవిటిదా? లేక బద్దకస్తురాలా? లేక ఆమె లేవకుండగ ఎవరినైన కావలి వుంచినారా? లేక యింత మైమరచి నిద్రించుటకేమైన మంత్రించి వుంచినారా? ఆమెకేమైనది నిద్ర లేచుటలేదు? 'ఓ ఆశ్చర్య గుణచేష్టితుడా! ఓ శ్రియః పతీ! ఓ పరమపదవాసీ!' అని అనేకమైన తిరునామాలను అనుసంధిస్తున్ననూ ఆమెకు వినబడుటలేదేమి? ఇంకను లేవదేమి? అని సంపదలతో తులతూగుతున్న ఒక కన్యను లేపుచున్నారు.

అవతారిక :-

 
'తూరుపుతెలవారె! ఓ జవ్వనీ లేవవే!' అంటూ పాడి 8వ (పాశురం) మాలికలో భగవదనుభవాన్ని పొందటానికి కుతూహలపడుతున్న ఒక గోపికను లేపి తన వ్రతంలో భాగస్వామిని చేసింది గోదాతల్లి. ఇప్పటివరకు శ్రవణం (వినటం) మననం (విన్నదానిని మాటిమాటికి స్మరించటం) వీటియొక్క విశిష్ఠతను తెలిపి ముగ్గురు గోపకన్యలను గోదా మేల్కొలిపి తన వ్రతంలో చేర్చుకొంది. ఇక (9మొదలు 12 మాలికలలో (పాశురాలలో) ధ్యానం యొక్క విశిష్ఠతను తెలుపబోతోంది. ఎల్లప్పుడూ శ్రవణము, మననమూ చేసే వారియొక్క మనస్సు పవిత్రమౌతుంది. నిర్మలమౌతుంది. మాలిన్యం తొలగితేనేకద జ్ఞానం చోటు చేసుకొనేది. అప్పుడా జ్ఞానమే ఆ జీవికి కవచమైపోతుంది. నిస్వార్ధమైన వ్రాత నిష్ఠ కలిగినవారికే తన్ను లభించే హక్కు కలదన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. మరిక మనకు స్వాతంత్ర్యం ఎందుకు? పరమాత్మ తానే స్వయంగా మన వద్దకు వచ్చి మన అభీష్టాలను తీరుస్తాడు. కావున మనం ఎచటికినీ పోక వున్నచోటునే భగవదనుభవ ఆనందాన్ని అనుభవిస్తూ వుంటే చాలుననుకొని అతి సుందరమైన మణిమయ భవనంలో నిద్రిస్తూన్న నాల్గవ గోపికను (యీ మాలికలో) లేపుచున్నారు. 'ఓ మామకూతురా! మరదలా లేలెమ్ము!' అంటున్నారు.
(కాంభోజి రాగము - ఆదితాళము)
1. ప..    ఓ మామకూతుర! మరదలా!

అ..ప..    ఏమిది? మణిమయ ద్వారము తెరువవు?
    ఓ మామ కూతుర! మరదలా!

చ..    పావన మణిమయ భావనమందున
    దివ్వెల వెలుగులు ధూపములమరగ
    దివ్యమౌ తల్పమున దిటవుగ శయనించి
    అవ్యక్తమైన నిద్దురపోదువటవే!

2 చ.    మూగద? చెవిటిద? మిగుల నలసినద?
    ఆగడప కావలి నందుంచబడినద ?
    ఆ గాఢ నిద్రకు మంత్రించబడినద?
    వేగమె లేపవె! నీ కూతునత్తరో!

3 చ.     లీలామానుష మాధువుడీతడు
    కేళీలోలుడు వైకుంఠవాసుడు
    చెలియలగూడి తిరునామ కీర్తనము
    ఇలవెలియగ పలుమారు పాడితిమి
    ఓ మామకూతుర! మరదలా!

తిరుప్పావై 12 వ రోజు

లక్ష్మణుడి కర్మ విదానం
 ఆండాళ్ తిరువడిగలేశరణం      

పాశురము
కనైత్త్-ఇళంకత్తెరుమై కన్ఱుక్కిరంగి
నినైత్తు ములై వరియే నిన్ఱు పాల్ శోర
ననైత్త్-ఇల్లం శేఱాక్కుం నచ్చెల్వన్ తంగాయ్
పనిత్తలై వీర నిన్ వాశల్ కడై పత్తి
శినత్తినాల్ తెన్ ఇలంగై క్కోమానై చ్చెత్త
మనత్తుక్కినియానై ప్పాడవుం నీ వాయ్ తిఱవాయ్
ఇనిత్తాన్ ఎరుందిరాయ్ ఈదెన్న పేర్ ఉఱక్కమ్
అనైత్తిల్లత్తారుం అఱింద్-ఏలోర్ ఎంబావాయ్

భగవద్గీత రెండో ఆధ్యాయంలో మనకు భగవంతునికి మద్యవర్తిగా ఉండే దివ్య జ్ఞానం కల మహనీయుడు ఎట్లా ఉంటాడో, అతని జ్ఞాన దశని నాలుగు స్థితులుగా వర్ణించబడి ఉంది. ఒక్కో స్థితిని వివరిస్తూ నాలుగవ స్థితి కి చేరిన వ్యక్తిని స్థితప్రజ్ఞుడు  అని చెబుతుంది. ఒక పరిపక్వమైన దశ ను చూపిస్తూ అది ఎట్లా ఉంటుంది అంటే, వాడి చుట్టూ ఎన్నోరకాల వస్తువులూ, ఆకర్శణలు ఉంటాయి, కానీ అవి ఏవీ కూడా వాడిలోపల ఉన్న ఏకాగ్రతను పాడు చేయలేవు.

"ఆత్మన్యేవ ఆత్మనాతుష్ట: స్తిత ప్రజ్ఞ: తదోచ్యతే  |
  ప్రజా:తి యదా కామాన్ సర్వాన్ మనో గతాన్  || "

వాడికి ఎలాంటి కోరికలు ఉండవు, మనస్సులో కూడా. ఆన్ని వస్తువులను చూస్తూనే ఉంటాడు, కాని నాకు ఆనందాన్ని కల్గించేవి అని ఎప్పుడూ అనుకోడు.  మరి ఆ స్థితి ఎలా వస్తుంది అంటే దానికి క్రింద ఉండే స్థితిని వివరించాడు.

"దుఖెఃషు అనుద్విజ్ఞమనాః సుఖేఃషు విగతస్పృహ:
వీత రాగ భయ క్రోద: స్తితదీ: ముణిరుచ్యతే  "

ఈ దశలో చుట్టూ ఉండే వస్తువుల గురించి తెలుసు కాని మనస్సు వాటియందు ఉంచకుండా సాధన చేస్తాడు.  ఇది రెండో స్థితి. కొంత కాలం ఇలా సాధన చేసినట్లయితే మనస్సు స్థిరం అవుతుంది. లోపలుండే పరమాత్మ విషయకమే ఆనందం. ఇవాలటి గోప బాలిక అలాంటి స్థితి కల్గిన వంశానికి చెందినది అంటుంది ఆండాళ్.

"ఇళంకత్తెరుమై" లేత దూడలు కల్గిన గేదెల "కనైత్త్" అరుపు వినిపిస్తోంది, ఎందుకంటే వాటిని పట్టించుకోనే నాథుడే లేడు. వాళ్ళంతా శ్రీకృష్ణ సేవలో నిమజ్ఞమై ఉన్నారు. "కన్ఱుక్కిరంగి" దూడ విషయంలో జాలి తలచి తనంతట తానే "నినైత్తు" దూడ వచ్చిందని భావించి, "ములై వరియే" పొదుగుల గుండ "నిన్ఱు పాల్ శోర" ఏక ధారలుగా పాలు ఇస్తున్నాయి. "ననైత్త్-ఇల్లమ్" ఇల్లంతా తడిసి పోయి ,  "శేఱాక్కుమ్" అంతా బురద అయ్యింది.

ఈ గోప బాలిక సోదరుడికి శ్రీకృష్ణుడంటే అమితమైన ప్రేమ, అందుకే తన నిత్య కర్మలను వదిలి కృష్ణుడి వెంటే ఉండేవాడు. లోకంలో కర్మలు రెండు రకాలుగా ఉంటాయి, ఒకటి లక్ష్మణుడి  కర్మ, రెండోది భరతుని కర్మ. లక్ష్మణుడు రాముణ్ణి విడిచి ఉండనని రాముడు వద్దన్నా ఆయన వెంట వచ్చాడు, తను రాముని సేవలో మరచి నిత్య కర్మలను పెద్దగా చేసేవాడు కాదు. అదే భరతుడు రాముని ఆజ్ఞతో నంది గ్రామమంలో ఉంటూనే రాజ్య పాలన చేసాడు, నిత్య కర్మలను పాటించేవాడు. ఇక్కడ మనం గమనించాల్సింది భరతుడు నిత్య కర్మానుష్టానం  చేసింది రామునికోసమే, లక్ష్మణుడు నిత్య కర్మలను మానింది రాముడి కోసమే.  నిన్నటి గోప బాలిక ఇంట్లో వారు నిత్య కర్మలు చేసినా అవి శ్రీకృష్ణుడి కోసమే, ఈ రోజు గోపబాలిక ఇంట్లో వారు నిత్య కర్మలు వదిలినా అవీ శ్రీకృష్ణుడి కోసమే.

"నచ్చెల్వన్ తంగాయ్" ఏం సంపదలు కల్గిన వాడి చెల్లెలా!. ఆండాళ్ లోపలున్న గోప బాలికను గొప్ప జ్ఞానిగా భావిస్తోంది, జ్ఞానులైన మహనీయులు వారు తామంతట తాము భగవత్ జ్ఞానాన్ని అనుభవిస్తూ మనపై జాలితో మనకు ఉపదేశిస్తూ ఉంటే మన దేహం తడిసి, లోపల మనలోని హృదయం ద్రవించేట్టుచేసి మనం  కూడా భగవంతుణ్ణి అనుభవించేట్టు చేస్తుంది.  "పనిత్తలై వీర" మంచుతో పైన తడుస్తున్నాం,  ఏం స్థితి వచ్చిందమ్మా మాకు!! మూడు ప్రవాహాలుగా మేం క్కొట్టుకు పోతున్నాం. క్రిందేమో పాల ప్రవాహం, పైనేమో మంచు, మరి మధ్యలో మాహృదయాలలో శ్రీకృష్ణుడి కళ్యాణగుణాల ప్రవాహంతో తడిసిపోతున్నాం. ఎక్కడ ఆధారం లేకుండా పోతుంది, మరి "నిన్ వాశల్ కడై పత్తి" అమ్మా నీ గుమ్మపు పై కప్పుని పట్టుకొని వ్రేలాడుతున్నాం .

అయితే లోపలున్న గోప బాలికకు కృష్ణుడు ఆడపిల్లలను ఏడిపిస్తాడని కోపం ఉన్నట్లుంది, అందుకే ఒక స్త్రీని ఏడిపించినందుకు "శినత్తినాల్" కోపంతో  "తెన్ ఇలంగై క్కోమానై" అందమైన లంకానగరానికి రాజైన రావణాసురుణ్ణి "చ్చెత్తమ్" సంహరించి, "మనత్తుక్కినియానై" అందరి హృదయాలు దోచుకున్న మనోభిరాముని నామం "ప్పాడవుమ్" పాడుతున్నా  "నీ వాయ్ తిఱవాయ్" నీవు నోరు తెరవవా!  "ఇనిత్తాన్ ఎరుందిరాయ్" ఇక నైనా నోరు తెరిచి లేవమ్మా. "ఈదెన్న పేర్ ఉఱక్కమ్" ఇది ఎలాంటి నిద్రమ్మా, "అనైత్తిల్లత్తారుం అఱింద్" లోకమంతా తెలిసి పోయింది లేవమ్మా నీ గొప్పతనం అంటూ ఆక్షేపిస్తూ గోప బాలికను లేపింది ఆండాళ్ తల్లి. ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ్

తిరుప్పావై పదమూడవరోజు పాశురము


 పుళ్ళిన్ వాయ్ కీణ్డానైప్పొల్లా వరక్కనై,
    క్కిళ్ళిక్కళైన్దానై క్కీర్తిమై పాడిప్పోయ్,
    ప్పిళ్ళైగ ళెల్లారుమ్ పావైక్క ళమ్బుక్కార్,
    వెళ్ళియెళు న్దువియాళముఱజ్గిత్తు,
    పుళ్ళుమ్ శిలుమ్బివ గాణ్ పోదరి క్కణ్ణినాయ్,
    కుళ్ళక్కుళిరక్కుడైన్దు నీరాడాదే,
    పళ్ళిక్కిడత్తియో పావాయ్ నీనన్నాళాల్,
    కళ్ళమ్ తవిర్ న్ధు కలన్దేలో రేమ్బావాయ్.

భావం : కంసునిచే పంపబడిన బకాసురుని నోటిని చీల్చిన శ్రీకృష్ణుని యొక్కయు, దుష్టుడైన రావణుని పది తలలను గిల్లి పారవైచిన శ్రీరాముని యొక్కయు కల్యాణ గుణ సంకీర్తనం చేస్తూ శ్రీకృష్ణుని సంశ్లేషముననుభవింపగోరు గోపికలందరును సంకేతస్థలమునకెప్పుడో చేరిపోయిరి. నీవింకను లేవకున్నావు. తెల్లవారినదని సూచించుచు శుక్రుడుదయించెను బృహస్పతి అస్తమించెను. ఇవిగో! పక్షులన్నియు తమ ఆహారాన్వేషణ నిమిత్తం అరచుకొంటూ ఆకాశంలోకి ఎగిరిపోతున్నాయి' అని గోపికలు చెప్పగా నిద్రిస్తున్న గోపిక తన కనులు తెరి చూచింది, ఆమె నేత్ర సౌందర్యానికి ముగ్ధులై వికసించిన తామరపూవులందు వ్రాలిన తుమ్మెద వంటి కన్నులు గలదానా! ఇకనైనను లేచి రావమ్మా! నీ నేత్ర సౌందర్యానికి ముగ్ధుడై శ్రీకృష్ణస్వామి తానే నీవద్దకు వచ్చునని భ్రమించకు. శ్రీ కృష్ణ విరహతాపమును దీర్చుకొనుటకు యీ చల్లని నీటిలో అందరితో కలిసి స్నానమాడగా రావమ్మా! ఇంకను పరుండరాదు. మనము నోచే యీ వ్రతమునకు ఇది శుభ సమయము, మంచి కాలము. ఓ సుందరీ! నీ కపటమును వీడి మా గోష్ఠిలో కలిసి మహిమాన్వితమగు యీ వ్రతము సాంగోపాంగముగ పూర్తి చేయుటకు సహకరించుము. అన్నింటను శుభములే కలుగును' అని గోదాదేవాదులు ఎనిమిదవ గోపికను మేల్కొలుపుతున్నారు.
 అవతారిక :-

ఈ వ్రతంలో చేరటానికై ఏడుగురు గోపికలను మేల్కొలిపారు. ఇక ఎనిమిదవ గోపికను (యీ మాలికలో) మేల్కొలుపుతున్నారు. ఈమె నేత్ర సౌందర్య సౌభాగ్యం కల్గినది. తన నేత్ర సౌందర్యాన్ననుభవించటానికై శ్రీ కృష్ణుడే తన వద్దకు వస్తాడన్న పూర్తి విశ్వాసంతో వుండి ఉదాసీన వైఖరిననుసరిస్తున్న గోపిక. ఆ భావంతో నిద్రిస్తున్న యీమెను గోపికలందరూ గోదాదేవితో కలిసి మేల్కొలుపుతున్నారు. క్రిందటి (మాలికలో) ఎవరికిష్టమైన రీతిని శ్రీకృష్ణుని చేష్టలను, శ్రీరాముని గుణగణాలను కీర్తించారు. కాని ఊరివారు వ్రేపల్లెలో కృష్ణ కీర్తనమేగాని శ్రీరామ సంకీర్తనం కూడదన్నారు. శ్రీరాముడు గొప్పవాడైనప్పటికిని యిక్కడ మాత్రం కృష్ణ సంకీర్తనమే జరగాలన్నారు. శ్రీకృష్ణుడు మనకు ఆరాధ్య దైవం అన్నారు. పెద్దలు క్షీరసాగరంలో శయనించివున్న శ్రీమన్నారాయణుడు అవసరార్ధము అనేక అవతారాలనెత్తి లోకాలను రక్షించాడని, శ్రీరామకృష్ణులకు భేదము ఏమాత్రం లేదని చెప్పారు. నామ రూపాలు వేరైనా తత్త్వం ఒక్కటేనని వారు నిరూపణ చేశారు కూడా. అప్పుడు గోపికలందరూ తమ అజ్ఞానాన్ని తొలగించుకొని శ్రీరామకృష్ణుల నామ సంకీర్తనం చేశారు. నిద్రిస్తున్న గోపికలను మేల్కొలిపారు.
(చారకేశి రాగము - ఆదితాళము)
ప..    లేవే! ఓ చిన్నదాన! లేవే! చాలింక నిదుర!
    లేవే! తామరసాక్షి! లే! మా కాశ్చర్యమాయె!

అ..ప..    లేవే! పడకను వీడవె! రావె! తీర్థమాడగ
    వేవేగ లేచిరావె! సమయము మించి పోవునె!

చ..     నోటిని జీలిచి బకాసురు జంపిన  
    పటు బలశాలి శ్రీకృష్ణుని కీర్తిని
    నోట బాడుచు నోము నోచేటి కన్యలు - ఆ
    చోటు చేరిరె! వేగ నిద్దుర లేవనె!

చ..    శుక్రుండుదయ మందె నస్తమించెను గురుడు
    పక్షుల కలవరము లవిగో వినబడవొ నీకు?
    శ్రీకృష్ణుని తలచు కపటమ్ము వీడి యిపుడు
    ఆ కృష్ణ విరహ తాపము దీర నీరాడ
    లేవే! ఓ చిన్నదాన! లేవే! చాలింక నిదుర!

Friday 23 December 2016

తిరుప్పావై ఎనిమిదవ రోజు పాశురం


🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺



    కీళ్ వానమ్ వెళ్ళెన్ఱు ఎరుమై శిఱు వీడు 
    మేయ్ వాన్ పరన్దనకాణ్! మిక్కుళ్ళపిళ్ళైగళుమ్
    పోవాన్ పొగిన్ఱారై ప్పోగామల్ కాత్తున్నై
    కూవువాన్ వన్దు నిన్ఱోమ్; కోదుకల ముడైయ
    పావాయ్! ఎళున్దిరాయ్, పాడిప్పఱై కొణ్డు 
    మావాయ్ పిళన్దానై మల్లరై మాట్టియ 
    దేవాది దేవనైచ్చెన్ఱు నామ్ శేవిత్తాల్ 
    ఆవా వెన్ఱారాయ్ న్దు అరుళేలో రెమ్బావాయ్.


భావం: తూర్పు దిక్కంతయు ఆకాశము తెల్లివారింది. గేదెలు మంచుమేత మేయటానికై విడువబడినాయి. అవి మేతకై స్వేచ్ఛగా తిరుగాడుతున్నాయి. తోటి గోపికలందరూ శ్రీకృష్ణుడు చేరక ముందుగనే అతని వద్దకు చేరవలెనని, అట్లు చేసిన అతడు చాల సంతోషించునని తలుస్తున్నారు. అందరును కలిసి గోష్ఠిగ పోవుటే మంచిదని యెంచి వారినందరినీ అచట నిలిపి నీ కొరకు వచ్చితిమి. నీకును అతనిని చేరుటకు కుతూహలముగనే వున్నదికదా! మరింక ఆలస్యమెందుకు? లెమ్ము! ఆశ్వాసురరూపుడైన కేశిని, చాణూర ముష్టికాదులను చీల్చి చెండాడిన శ్రీకృష్ణుని సన్నిధికి పోయి, మన నోమునకు కావలసిన 'పఱై' అనే సాధనమును పొందుదము. అతని రాకకు ముందే మనమటకు పోయిన అతడు 'అయ్యో! మీరు నాకంటే ముందుగనే వచ్చితిరే!' యని నొచ్చుకొని మన అభీష్టములను వెంటనే నెరవేర్చును.
   
    అవతారిక:

క్రిందటి పాశురంలో భారద్వాజ పక్షులు చేసే కలకల ధ్వనిని విని అందులోని ధ్వనిని గ్రహించమంటున్నది. ఈమె సాయించిన మొత్తం తిరుప్పావై అంతా ధ్వని కావ్యమే. పైకి సాధారణ భాషగా కనబడినా అందులోని అంతరార్ధం బహు విస్తృతమైనది. వేదోపనిషత్సారమైన యీ గ్రంథ ఆంతర్యాన్ని ప్రతివారు యెరిగి తీరవలసినదే అన్నదే ఆండాళ్ తల్లి చెప్పినది. ఈ ఎనిమిదవ పాశురంలో శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహ విశేషాన్ని సంపాదించిన ఒక పరిపూర్ణురాలైన గోపిక తెల్లవారిపోయిననూ ఇంకా లేవలేదని గమనించి ఆమెను లేచిన వారందరితో కలిసి గోదాదేవి మేల్కొలుపుతున్నది. ఇది ఎనిమిదవ పాశురము.    

            (మలయమారుత రాగము - ఆదితాళము)

ప.    తూరుపు తెలవారె! ఓ జవ్వనీ లేవవె!
    తీరుగ మహిషములు మేతకై! తరలె!
    తూరుపు తెలవారె! ఓ జవ్వనీ లేవవె!

అ..ప.    పరమార్ధమని యెంచి శ్రీకృష్ణునే చేరు
    తరుణుల నిలిపి యిటు నీకై వచ్చితి మమ్మ  
    తూరుపు తెలవారె! ఓ జవ్వనీ లేవవె!

చ..    కేశినోటిని జీల్చి మల్లుర మదమణచిన
    కేశవుడౌ సర్వేశుని జేరి
    ఆశల 'పఱ'గొని కృష్ణు స్తుతింయింప-లో
    కేశుడౌ తాను కాపాడడే మనల
    తూరుపు తెలవారె! ఓ జవ్వనీ లేవవె!
    తీరుగ మహిషములు మేతకై తరలె!

Thursday 22 December 2016

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం

అయ్యప్పస్వామి పూజ మరియు దీక్ష విధానం
దీక్ష 41 రోజులే ఎందుకుచేయాలి. క్రిందచదవండి.
🌺🌺🌺🌺🌺🌺🌺🌺
Ayyapa

గణపతి ప్రార్ధన


శుక్లాం బరధరం విష్ణుం శశి వర్ణం చతుర్భుజం
ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే !
అగజానన పద్మార్కం గజానన మహర్నిశం
అనేక దంతం భక్తానాం ఏకదంత ముపాస్మయే !!

అయ్యప్ప స్వామి వారి ప్రార్ధన

అఖిల భువన దీపం భక్త చిత్తాజ్జ సూర్యం
సుర గణ ముని సేవ్యం తత్త్వ మస్యాది లక్ష్యం !
హరి హర సుత మీశం తారక బ్రహ్మ రూపం

శబరి గిరి నివాసం భావయే భూత నాదమ్ !!

|| అరిషడ్వర్గాల అంతానికే అయ్యప్పస్వామి దీక్ష ||
మానవ జన్మకి పరమార్థం మోక్షాన్ని పొందడమే - అందువలన ఆధ్యాత్మిక సాధనలో అనుక్షణం అడ్డు తగిలే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్యర్యాలనే అరిషడ్వర్గాలని అధిగమించడం కోసమే అయ్యప్ప దీక్షను వహించాల్సి వుంది.

"జీవానాం నరజన్మ దుర్లభం" - సకల చరాచర జీవరాశులన్నిటికన్నా మానవుడే శ్రేష్టుడు గనుక, ఋషి అంతటి వాడవ్వల్సిన మనిషి మసై, బూడిదై పోకూడదని, ఈ జన్మలోనే ముక్తిని పొంది "మానవుడు తన జన్మను చరితార్థం చేసుకోవాలనే" ఉద్దేశంతో 41 రోజులు దీక్షను ఆచరించి, ఆ దీక్షలో పొందిన ఆధ్యాత్మిక ఆనంద, అనుభవాలను మానవుడు తన జీవితకాలమంతా పొంది తద్వారా మోక్షాన్ని పొంది తరించాలన్నదే భగవంతుని ఆంతర్యం.

ఈ దీక్షా కాలంలో కఠిన బ్రహ్మచర్యాన్ని, శీతలోదకస్నానం(చన్నీటి స్నానం), భూతలశయనం, ఏకభుక్తం, స్వయంపాకం వంటి పలు నియమాలు పాటిస్తారు. ఇంద్రియ నిగ్రహం కోసం 41 రోజులు దీక్ష తీసుకుని స్వామి వారి దర్శనానికి వెళ్ళడంలో మనిషిని శారీరకంగా, మానసికంగా, దృఢంగా, క్రమశిక్షణలో ఉండేందుకు ఈ అయ్యప్ప దీక్ష ఎంతో ఉపకరిస్తుంది. శరీరంలో ఉన్న సమస్త కల్మషాలను దూరం చేసి శరీరాన్ని తేలిక పరిచే ఆరోగ్య నిధానం అయ్యప్ప దీక్షా విధానం.

భక్తులు కార్తీక మాసం నుండి దాదాపు మార్గశిర పుష్య మాసాల వరకు నియమనిష్ఠలను ఆచరిస్తూ ఉంటారు. ఐహికమైన సౌఖ్యాలను పరిత్యజించడం, మద్య మాంస ధూమపానాది వ్యసనాలకు దూరంగా ఉండడం, స్వామి చింతనలో, స్వామి భక్తులతో సమయం గడపడం, సాత్విక జీవనం అవలంబించడం ఈ దీక్షలో ముఖ్య లక్షణాలు. వీరి దినచర్య తెల్లవారు జామున లేచి చన్నీటి స్నానం చేయడంతో మొదలవుతుంది. నల్లని వస్త్రాలు, తులసి మాల, నుదుట విబూది గంధం బొట్టు ధరిస్తారు. దినచర్యలో అధిక భాగం పూజ, భజనాది కార్యక్రమాలలో గడుపుతారు. కటిక నేల మీద పడుకుంటారు. అందరినీ "స్వామి" అని సంబోధిస్తారు. దుర్భాషణలకు దూరంగా ఉంటారు. ఇలా ఒక మండలం పాటు నియమాలను ఆచరిస్తారు.

కుల మత భేదాలకు అతీతంగా, జాతి, భాషల వ్యత్యాసం లేకుండా శాంతిప్రియులై, నియమ నిబంధనలతో కూడిన జీవన విధానముతో, నిరంతరం భగవంతుని ధ్యానిస్తూ, సేవలు చేయుచూ జీవన శైలిని సుగమనము చేసుకోవటమే అయ్యప్ప దీక్షలోని ప్రాశస్త్యం. మానవుని మానసిక ప్రవృత్తులను, ఇంద్రియ వికారములను, భవధారలను, భగవంతుని వైపునకు మరల్చి నిత్యానందమును అతి సహజముగా సిద్ధింపజేయుటే అయ్యప్ప దీక్షలోని విశిష్టత.

తిరుప్పావై ఏడవరోజు పాశురం


 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

    కీశు కీశెన్ఱెజ్గు మానైచ్చాత్త జ్గలన్దు
    పేశిన పేచ్చరవమ్ కేట్టిలైయా పేయ్ ప్పెణ్ణే!
    కాశుమ్ పిఱప్పుమ్ కలగలప్పక్కై పేర్తు
    వాశ నరుజ్గళ లాయ్ చ్చియర్; మత్తినాల్
    ఓశైప్పడుత్త త్తయిరరవమ్ కేట్టిలైయో
    నాయకప్పెణ్పిళ్లాయ్! నారాయణన్ మూర్తి
    కేశవనైప్పాడవుమ్ నీకేట్టే కిడత్తియో
    తేశముడై యాయ్! తిఱ వేలోరెమ్బవాయ్.

భావం: ఓయీ! పిచ్చిపిల్లా! భరద్వాజ పక్షులన్నీ కీచుకీచుమంటూ చేస్తున్న కలకలములు వినపడలేదా? అదిగో! సువాసనలు వెదజల్లుతున్న కురులుగల ఆ గోప కాంతులు తాము ధరించిన ఆ భరణాలన్నీ ధ్వనించేట్టుగా చేతుల త్రిప్పుచూ కవ్వాలతో పెరుగు చిలుకుతున్నారు. ఆ ధ్వనులేవీ వినబడలేదా? నీవు మాకు నాయకురాలివికద! భాగవద్విషయానుభవము నెరిగినదానవు.

సాక్షాత్తూ శ్రీమన్నారాయణుడే ఇపుడు శ్రీకృష్ణునిగా మన భాగ్యంకొద్దీ అవతరించాడు. మనకొరకే 'కేశి' మొదలైన రాక్షసులను చంపి మన కష్టాలను గట్టెక్కించాడు. మనమంతా అతనికి కృతజ్ఞులమై అతని గుణగానం చేస్తున్నాము. ఐనా... వానిని వింటూనే యింకనూ పడుకొనే వుంటివే? మేము పాడే యీ పాటల ఆనందముతో నీవు మెరిసిపోతున్నావులే! ఇకనైననూ లేచి రామ్మాతల్లీ! వ్రతం ఆచరించటానికి ఇంకనూ అలస్యందేనికి? అని 'ఒక గోపకన్యను లేపుతోంది ఆండాళ్ తల్లి.
    అవతారిక :
   
వ్రతాలూ, నియమాలూ అనే జ్ఞానం లేని పక్షులే తెల్లవారుఝామున మేల్కొని మాటాడుకొంటూ ఆకాశంలోనికి ఎగిరిపోతున్నాయి. అంటే మనకు అజ్ఞానులవలె గోచరిస్తున్న పక్షులు బ్రహ్మజ్ఞానులకు సంకేతాలు. వీరే బ్రహ్మీ ముహూర్తంలో మేల్కొని బ్రహ్మ పదార్ధాన్ని గురించి మాత్రమే ఆలోచించేవారు. అంటే భగవంతుని ఆరాధించే సమయమాసన్నమైనదని, భగవన్నామ చింతనే మనకు పరమాహారమని ధ్వని రూపంగా చెప్పబడింది. అంటే పక్షులే తెల్లవారుఝామున మేల్కొంటున్నాయంటే మరి మానవమాత్రులం ఎప్పుడు మనం మేల్కాంచాలో తెలుసనుకోవలెననే సంకేతం ఇందులోని ధ్వని. ఈనాటి పాశురంలో గోదాతల్లి భరద్వాజ పక్షుల ద్వారా అవి చేసే మధుర ధ్వనులద్వారా ప్రొద్దు పొడుస్తున్నదని సూచిస్తూ...భరద్వాజాదులు చేసే ఉపదేశాలను గుర్తెరిగి అజ్ఞానాన్ని రూపుమాపుకోమంటున్నది. భగవంతుని యందాసక్తి కలగాలంటే శాస్త్ర విషయాలు తెలుసుకోవలసిందేగదా! వీటినెరిగి భగవంతుని యందు ప్రీతి కలగటానికి నిత్యకృత్యాలేవి ఆటంకాలు కావనీ, మేలుకొని తలుపుతీసి మాతో వ్రతాన్ని చేయటానికి రమ్మని పిలుస్తోంది యీ పాశురంలో
   
        (చక్రవాక రాగము - ఆదితాళము)

ప.     తేజోముఖీ! తలుపు తీయుమా!
    ఈ జాము నిడురేల! ఇక మేలుకొనవేల?

అ..ప..    ఆ జంటలౌ పక్షి కలకలము వినలేద?
    ఏ జంకు లేని నీవెటు నిదురవోతువో?

1 చ.    పరిమళించు కుంతలాల పడుచులు - ఆ
    భరణములు రవళింప చేతులని సాచి
    పెరుగు కవ్వమున చిలికెడు ధ్వనులను వెర్రిదాన! నీవేమి వినలేద?
    వినలేద?

2 చ.    నాయిక! శ్రీమన్నారాయణుడే
    ఈయిల కేశవుడై ప్రభవించగ  
    మాయిలవేల్పుగ స్తుతియించు చున్నాము
    లే! యిక! వినుచు మొద్దునిద్దురపోదువె?

Tuesday 20 December 2016

తిరుప్పావై ఆరవరోజు పాశురం


    పుళ్ళుమ్ శిలుమ్బినకాణ్ పుళ్ళరైయన్ కోయిలిల్
    వైళ్లైవిళిశజ్గన్ పేరరవమ్ కేట్టిలైయో
    పిళ్ళాయ్! ఎళున్దిరాయ్ పేయ్ ములైనఞ్జణ్డు
    కళ్లచ్చగడమ్ కలక్కళియక్కాలోచ్చి
    వెళ్లత్తరవిల్ తుయి లమర్ న్దవిత్తినై
    ఉళ్ళత్తు క్కొణ్డు మునివర్ గళుమ్ యోగిగళుమ్ 
    మెళ్ళ వెళున్దు అరియెన్ఱ పేరరవమ్
    ఉళ్ళమ్ పుగున్దు కుళిర్ న్దేలో రెమ్బావాయ్

భావం: అందరికంటె ముందుగనే మేల్కొన్నవారు, ఇంకను నిద్రిస్తున్న ఒక గోపికను లేవకుండటాన్ని గమనించి 'తెల్లవారిందమ్మా! ఇక లేచిరావె!' అని లేపుచున్నారు. వేకువనే మేల్కోన్న పక్షులు ఒకరినొకరు పిలుచుకొంటూ 'మేతకు పోదాం రండర్రా!' అంటూ  కూస్తూ పోతున్నాయి. అరె! పక్షిరాజు గరుత్మంతునికి రాజైన ఆ శ్రీమన్నారాయణుని కోవెలలో మ్రోగిన శంఖధ్వనిని నీవు విన లేదా? ఓసీ! పిచ్చిపిల్లా! (భగవద్విషయము నెరుగనిదానా!) లేచి రావమ్మా! ఇదిగో పూతనస్తనముల యందున్న విషాన్ని ఆరగించినవాడు, తనను చంపటానికి వచ్చిన శకటాసురుని కీళ్ళూడునట్లు తన కాళ్లతో తన్నినవాడు యైన ఈ శ్రీకృష్ణుడే ఆ పాల సముద్రంలో ఆదిశేషునిపై హాయిగా యోగనిద్రలో శయనించిన శ్రీమన్నారాయణడు. ఆ శ్రీమన్నారాయణుడినే యోగులు, బుషులు తమ హృదయాలలో నిల్పుకొన్నారు. అతనికి శ్రమ కలుగకుండునట్లుగ మెల్లగ 'హరీ! హరీ!  అని అతనిని స్మరిస్తూ చేసిన ధ్వని పెద్దగా ధ్వనించి మా హృదయాలను చేరి చల్లబరిచింది. వణికించింది. మేమంతా మేల్కొన్నాము. మరి నీవుమాత్రము కదలక అట్లే పరుంటివేమమ్మా! ఇదీ నీకు వినబడలేదా! రమ్ము! రమ్ము! మాతో గూడి వ్రతము చేయుము.


    అవతారిక :


ధనుర్మాస వ్రతంలో చేయవలసినది, పొందవలసినది, దానికి తగు యోగ్యత మొదలైనవాటిని గురించి మొదటి ఐదు పాశురాలలోను వివరించింది గోదా తల్లి. అందరినీ ఉత్సాహంగా వ్రతంలో పాల్గోనజేసింది. ఈ మొదటి ఐదు పాశురాలను వ్రతానికి మొదటి దశగా (అభిముఖ్య దశ) చెపుతారు. ఇక 6  నుంచి 15 వరకు రెండవ దశ, అనగా ఆశ్రయణదశగా వర్ణిస్తారు. భగవంతుని సంశ్లేషము, సాక్షాత్కరము కావాలంటే జ్ఞానం కావాలి. ఆ  జ్ఞానాన్ని పొందటానికి ఆచార్య కృప కావాలి. ఆచార్య కృపకావలెనంటే వారిని సమాశ్రయించాలి. భాగవదనుభవజ్ఞులైన సదాచార్య సమాశ్రయణమే భవగద్ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. కావున యీ పది పాశురాలలో గోదా తల్లి భగవదనుభవాన్ని పొందిన పదిమంది గోపికలను మాతో కలిసిరండని, మీఅనుభావాన్ని  మాకూ పంచండనీ, ఆ భగవదానందాన్ని మీరొక్కరే అనుభవించరాదనీ, అందరికీ పంచవలెనని గోపికారూవులు, సదాచార్యులైన ఆళ్వారు రూపాలను మేలుకొలుపుతోంది గోదాతల్లి. వ్రతంలో అనుభవం లేని ఒక గోపి కనులేపుతోందీ పాశురంలో.

        (అఠాణారాగము - ఆదితాళము)


ప.    చూడవె! సఖియరో! ఓ చిన్నదాన!
    పడక వీడవె! పక్షులెగిరే కనవే!
    చూడవే! సఖియరొ!

అ.ప.    గడి వెడలిన గుడి శంఖ నాదములు
    వడి బిలువగ వినలేదే! లేవవె! చూడవె! సఖియరొ!
1 చ.    స్తన విషమును, పూతన, శకటాదుల
    ప్రాణమ్ముల నవలీల హరించిన
    పన్నగ శయసుని జగన్నాధుని
    మనసున నిలిపి ధ్యానింపరాగదే!
    చూడవె! సఖియరో

2. చ.    మునులు యోగులును మెల్లనె లేచి
    ధ్యానమగ్నులై 'హరి హరి' యన - నది
    ఘనరవమై మా మనసులను జేరి
    తనువు పులకింప నిదుర లేపినది
    చూడవె! సఖియరో!

Monday 19 December 2016

05 వ రోజు తిరుప్పావై

తిరుప్పావై ప్రవచనం‎ > ‎

05 వ రోజు - భగవంతుని ఐదో స్థానం - అర్చా స్వరూపం

ఆండాళ్ తిరువడిగలే శరణం



పాశురము

మాయనై మన్ను వడమదురై మైందనై

తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై

ఆయర్ కులత్తినిల్ తోంఱుం అణి విళక్కై

తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై

తూయోమాయ్ వందు నాం తూమలర్ తూవి త్తొళుదు

వాయినాల్ పాడి మనత్తినాల్ శిందిక్క

పోయ పిళైయుం పుగుదురువాన్ నిన్ఱనవుం

తీయనిల్ తూశాగుం శేప్పేలోర్ ఎమ్బావాయ్

చాలా అందమైనది- అందాలకు మూలకందం అనాలంటే సంస్కృతంలో దాన్ని కృష్-ణ అంటారు. కృష్ అంటే చాలా, ణ అంటే అనందం.  ఆనందింపచేయుతత్వము ఐతే రామ-రమయతి అని అంటారు.  కృష్ణ అనగానే ఒక మనిషి అనుకోకూడదు, అది ఒక తత్వం అని జ్ఞాపకం పెట్టుకోవాలి. అర్జునుడూ అలాగే అనుకున్నాడు, కృష్ణుడి విశ్వరూపం చూసాకే అర్థం అయ్యింది ఆయనంటే ఏమిటో.  అంతటావ్యాపించిన ఈ తత్వం మనకోసం మనం ఏర్పర్చిన రూపాన్ని, మనం పెట్టిన పేరుని తనదిగా చేసుకోగలదు. ఆ ఏదురుగుండా కనిపించేదాన్ని మనం విశ్వసించగలిగితే చాలు. ఇదే కృష్ణుడు ఇదే తత్వం అని గుర్తించు, అప్పుడు మనకు ఓయ్ అని పలుకుతుంది. అది గుర్తించక పోతే మనం ఎక్కడికి వెళ్ళినా వృదాయే.  ఈ గుర్తింపు కలిగితే చాలు, మనం ఉన్నచోటే చాలు. అందుకే "నివృత్తరాగస్య గృహం తపోవనం" నీ లోపల అహంకారం తగ్గితే బాహిరమైన వస్తువుల తత్వం తెలిస్తే అప్పుడు గృహమే ఒక తపోవనం అవుతుంది. నీ జీవితమే ఒక తపస్సు అవుతుంది. ఇలా ఇంటిలో చూడటానికి వీలయ్యేట్టుగా ఒక రూపం పెట్టుకో, ఆ రూపం నీ దృష్టిని ఆకర్షించేట్టుగా ఉండాలి, నీకు భయం కల్గించనట్లుగా ఉండాలి.  ఇలా మనం తయారుచేసి దానికి ఒక రూపం పేరు ఇచ్చి ఒక విశ్వాసంతో ఆ పేరుని పలకడం నేర్చుకుంటేచాలు. ఆ విష్వాసం చాలు, పూజకు నిభందనలు ఏమి లేవు.  అచంచలమైన విశ్వాసంతో నిశ్కల్మషమైన ప్రేమతో మనం ఏమి పలికినా అవి మంత్రాలే అవుతాయి. ఆయనా ప్రేమతోనే స్వీకరిస్తాడు. ఏమి చేసినా అది ఆరాధనే అవుతుంది. నీ ఇంట్లో విగ్రహంలోనే విశ్వాన్నంతటా నడిపే తత్వం ఉందని గమనించు చాలు. దీన్ని విశ్వసిస్తే చాలు.  ఆధునిక అణువిజ్ఞానం కూడా ఇంత చిన్న అణువులో ఎంతో శక్తి ఉందని చెబుతుంది. అదేదో జ్ఞానం లేనిది కాదు అంతటా వ్యాపించి ఉంది- దాన్నే మనం నారాయణ అని పేరు పెట్టుకున్నాం. దాని గుణాలను మనం శాస్త్రంల ద్వార గుర్తించగల్గుతున్నాం.  అంతటా ఉండే ఆ తత్వం ఈ విగ్రహంలోనూ ఉంది, సందేహం అవసరం లేదు అని మన ఆండాళ్ తల్లి తెలియజేస్తుంది ఈరోజు పాటలో.  రెండో ఆధ్యాయంలో పరమాత్మ ఇదే చెప్పాడు- "సమ్షయాత్మా వినష్యతి". ఏ రంగమైనా ముందుకు పోవడానికి సరి అయిన నిర్ణయం తీసుకో, అడుగు ముందుకు వెయ్యి, సంషయం అవసరం లేదు. దాన్నే అండాళ్ తల్లి అందమైన పాటలో గోపికల కథగా అందించింది.




ఆండాళ్ తల్లి వ్రతం చేద్దామని బయలుదేరింది. చుట్టూ గోపీ జనం అంతా చేరారు.మొదటి రోజు మనమంతా ధనుర్మాస వ్రతం చేస్తున్నమని తెలియజేసింది. రెండో రోజు వ్రతానికి కావల్సిన నియమాలేమిటో తెలియ జేసింది. మూడో రోజు వ్రతం ఆచరిస్తే కలిగే లోక క్షేమం గురించి వివరించింది. నాలుగో రోజు ఇలాంటి మంచి మనస్సుతో చేస్తె మనకు దేవతలతో సహా లోకంలోని వారంతా తోర్పడుతారు అని తెలియజేసింది.  ఇకవారంతా శ్రీకృష్ణుడికోసం బయలుదేరుతుండగా కొందరికి సందేహం వచ్చింది. ఇది లోకం మొత్తం క్షేమం కోసం చేసే వ్రతం కదా, ఏమైనా ఆటంకాలు వస్తాయేమో అని సంషయం వ్యక్తం చేసింది ఒక గోపిక. నీకా సంషయం ఎందుకు వచ్చిందని ఆండాళ్ తల్లి అడిగింది, ఆ గోపిక చాలా పురాణాలు చదివినట్లు ఉంది- అందుకు ఆమె, రామాయణంలో శ్రీరాముడి పట్టాభిషేకం అని దశరతుడు ఏర్పాటు చేయగా అదే సమయానికి వనవాసం ప్రాప్తించింది కదా! మరి మంచి పనులకు అడ్డులు కూడా అలాగే ఉంటాయికదా అని సంషయాన్ని తెలిపింది. అంతలో మరో గోపిక లేచి తన సంషయాన్ని తెలియజేసింది. ఈ గోపిక కావ్యాలు చదివినట్లు ఉంది, ఒక కావ్యంలోని వర్ణణ గురించి చెపుతూ- ఒక తుమ్మెద ఒక పద్మం పై వాలిందట, మధువును పానం చేసేసరికి మత్తుతో నిద్ర పోయిందట. సాయంకాలం కాగానే పద్మం ముకుళించుకుపోయిందట, లేచి చూడగానే బయటకు వెల్లడానికి మార్గంలేదని తెలిసి ఉదయం కాగానే పద్మం వికసిస్తుంది ఒక నేను వెళ్ళిపోవచ్చనే ఆశతో రాత్రంతా ఎదురుచూసిందట. అంతలోనే ఒక మదపు టేనుగు స్నానం కోసం ఈ పద్మాన్ని లాగి గట్టుపైకి విసిరికొట్టింది. తుమ్మెద అలాగే ప్రాణం కోల్పోయిందట. ఆశలెన్నో పెట్టుకుంటాం కాని నెరవేరుతాయా అని సంషయాన్ని తెలిపింది. మరొక గోపిక కాస్త వేదాంతం చదివినట్లు ఉంది- ఆమె లేచి మనం చేసిన కర్మలు మన శరీరం పైనే రాసి ఉంటాయి అంటారు కదా! వాటిని మనం అనుభవించక తప్పదు కదా! మరి మనం ఎట్లాంటి కర్మలు చేసామో ఏమిటో మనం విజయం సాదిస్తామో లెదో అని సంషయాన్ని తెలియ జేసింది.


ఇలాంటి సంషయాలన్నిటికి సమాదానం ఇస్తుంది ఆండాళ్ తల్లి ఈరోజు పాటలో. మనం చేసే కర్మలచే పుణ్య-పాపాలు భగవంతుడు నిర్ణయిస్తాడు. మనం చేసే చిన్ని విషయం కూడా ఆయనకు తెలియకుండా ఉండదు- అందుకే ఆయననను సర్వజ్ఞుడు-సర్వవేత్త అంటారు. ఆయా కర్మలకు తగిన ఫలాన్నిచ్చే శక్తి కూడా కలిగి ఉంటాడు. అందుకే మన పెద్దలు మన సంకల్పంలో కాని, మాటలలో కాని, చేతలలో కాని చెడు రానివ్వోద్దన్నారు.  ఇలాంటి ఒక సంస్కారం ఏర్పరిచారు మన ఋషులు. మనం అనుభవించేవన్నీ మనం ఒకప్పుడు చేసినవే.  ఇప్పుడు వచ్చిన త్రేనుపుతో మనం నిన్న తిన్న తిండిని గుర్తించగలం కదా. ఇక మనం ఏమిచేయాలో ఎలా ఉండాలో ఒక శాస్త్రాన్ని ఇచ్చాడు.  భగవంతుడికి మనపై కల్గిన ప్రేమనే పుణ్యం అంటారు, మనపై కల్గిన కోపమే పాపము అంటారు. వీటన్నిటినుండి బయటపడే ఒక సులభమైన మార్గాన్ని ఆండాళ్ తల్లి చెబుతుంది.  మనం చేసుకునే కర్మలు మూడు రకాలుగా ఉంటాయి, అవి సంచితములు-ఆగామి-ప్రారబ్దం అని అంటారు.  ఇదివరకు మనం చేసుకున్నవాటిని సంచితములని, ఇప్పుడీ శరీరంగా అనుభవిస్తున్నవాటిని ప్రారబ్దం అని, ఇప్పుడు చేస్తున్నవి భవిష్యత్తిలో అనుభవించేవి కనుక వాటిని ఆగామి అని అంటారు.  మనం కావాలని అనుకుంటే సంచితాలను-ఆగామిని తీసివేయవచ్చు కాని ప్రారబ్దం మాత్రం ఉంటుంది.  భగవంతునికి శరణాగతి చేస్తే ప్రాచీన కర్మలను తుడిచివేస్తాడు, ఇకపై మనం చేసే కర్మలు మంచిగా ఉండటం చే ఆగామి దూరం అవుతుంది. మరి ఈ కర్మలన్నీ ఎక్కడో ఒక దగ్గర అనుభవించాలి కదా, మరి అవి ఎక్కడికి పోతాయని ఒక గోపిక అడిగింది. ఇది మనం అందరం తెలుసుకోవాలి. భగవంతుడు మన పై ఉండే పాపాలను మనల్ని ద్వేషించే వారికి పుణ్యాలను మనల్ని ప్రేమించే వారికి పంచి మనల్ని స్వీకరిస్తాడు.  ఇక ప్రారబ్దం కుడా నిర్వీర్యం కావాలంటే - మనం భగవంతునికి చెందిన వాడను- నేను చేసేది  వాడి సేవ - వాడికోసం చేస్తునాను ఇలాంటి భావన చాలు. మనకు అందిన నామంతో ఆయన పేరు పలుకు చాలు ప్రారబ్దం కూడా అంటదు. దీన్నే ఉజ్జీవించి బ్రతకటం అంటారు. ఆయన నామాన్ని పాడుదాం రండి అని ఆండాళ్ తల్లి చెబుతుంది.



"మాయనై మన్ను వడమదురై మైందనై" - చిత్ర విచిత్ర మైన ఆశ్చర్యకరమైన కళ్యాణ గుణములు శక్తి విశేషములు కల్గి ఉన్నవాడు.  అలాంటి వాడు మధురానగరానికి దిగివచ్చాడు. "తూయ పెరునీర్ యమునైత్తుఱైవనై" మరి పెరగటమేమో యమునానది ఆవల ఉన్న గోకులంలో.  పుట్టగానే మరి రాత్రికి రాత్రి యమునానది దాటడం, ఇది ఒక రహస్యం. దీన్ని ఆండాళ్ పదిహెనవ పాటలో చెబుతుంది. యమునానది సూర్యుని పుత్రిక, యముడి సోదరి. మరి శ్రీకృష్ణుడికి దారి ఎందుకు ఇచ్చింది. మరి కృష్ణుడు ఆ యమునా నది ఒడ్డుననే తిరిగేవాడు. నీటికోసమై వచ్చే గోపికల కోసం వేచి ఉండేవాడు. "ఆయర్ కులత్తినిల్ తోన్ఱుం అణి విళక్కై" గోకులమ్లో మరి వెలిగించనక్కరలేని మణిదీపం వెలుతురువలె పెరుగుతున్నాడు పరమాత్మ. "తాయై క్కుడల్ విళక్కం శెయ్ద దామోదరనై" మరి ఎలా ఉంటాడు ఆయన అంటే, తల్లి రోటికి కట్టివేస్తే ఏమి చేతకాని వాడిలా పడి ఉంటాడు- అందుకే ఆయనను దామోదరుడు అంటారు.  దామ- ఉదరుడు అయ్యాడు, మన దగ్గర కూడా అలాగే ఉంటాడు విగ్రహ రూపంలో.



అక్కడ తల్లి ప్రేమతో లోంగబడి ఉన్నాడు, మన జ్ఞానంతో మన దగ్గర  ఆయన విగ్రహంలో లొంగి ఉన్నాడు. ఆధ్యాత్మిక పిపాస కల్గిన వ్యక్తికి భగవతత్వాన్ని ఎక్కడ సేవించాలంటే విగ్రహమే ఒక మంచి మార్గం.  ఆండాళ్ తల్లి శ్రీవెల్లిపుత్తూరులో జన్మించి అక్కడి వటపత్రశాయిని కోలిచింది, శ్రీరంగనాథున్ని చేరింది, సుందరబాహు స్వామికి మొక్కుబడి చేసింది, వేంకటాచలపతిని ఆరాధించింది. అంతా విగ్రహరూపంలో ఉన్నవారినే కోలిచింది, భగవంతునికోసం ఎక్కడికని పరుగులు పెట్టలా! విగ్రహ రూపాన్నే పరిపూర్ణంగా నమ్మింది. మనకూ ఆ విశ్వాసపూర్ణత కలగాలి. తాను ఆర్జించినది మనమూ పొందాలని తిరుప్పావైని మనకు అందించింది. "తూయోమాయ్ వందు " దీనికి మనం పరిశుద్దం కావాలి. అది ఎలా అంటే భగవంతుని తత్వాన్ని గుర్తిస్తే మానసిక పరిశుద్ది ఏర్పడుతుంది. "నాం తూమలర్ తూవి త్తొళుదు"పరిశుద్దమైన హృదయం అనే పుష్పాన్ని ఆయనపై విసిరితే చాలు. చేతులు ఒక్కసారి జోడిస్తే చాలు. ఇలా చేతులు జోడించటాన్ని అంజలి అంటారు. అన్-జలయతి అంటే ఆయనను జలంలా కరిగేట్టు చేస్తుంది. "వాయినాల్ పాడి" నోరు ఉంది కనక ఆయన నామాన్ని పాడుదాం చాలు. "మనత్తినాల్ శిదిక్క" మనస్సు ఉంది కనక ఆయన గుణములని స్మరించుదాం. "పోయ పిళైయుం " మనం గతంలోచేసిన సంచితములైన పాపాలన్నీ పోతాయి "పుగుదురువాన్ రిన్ఱనవుమ్" ఇక రాబోయే ఆగామి "తీయనిల్ తూశగుం " మనకు అంటకుండా ఉంటుంది "శేప్ప్" ఆయన నామాల్ని చెప్పు.  ఈపాటలో ఆండాళ్  మాయానై, మన్నువడ మదురై,  దామోదర అని ఇలా కొన్ని నామాల్ని తెలిపింది.


ఆగమములు చెప్పినదేమిటి

పూర్ణమిదం పూర్ణ మద: పూర్ణాత్ పూర్ణముదచ్యతే|
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా వశిష్యతే ||

ఇది శుక్లయజుర్వేద శాంతి మంత్రం. అదేం తెలుపుతుందో తెలుసుకుందాం. పూర్ణం అనగానే ముందుగా మనకు దేనితో నిండి ఉన్నదని ప్రశ్న వస్తుంది.  పూర్ణం అనగా అన్నీ నిండుగా కలదని అర్థం. అంటే స్వరూపం, గుణం, దయ ఇత్యాదులు అన్నీ నిండుగా కలది అనవచ్చు. మరి ఏమిటా  పూర్ణం, ఎక్కడ లభిస్తుంది? ఈ మత్రం దానికి సమాధానం ఇస్తుంది. "పూర్ణమిదమ్"- ఇదం అంటే చాలాదగ్గరగా ఉంటుంది, నీ లోపలోనే. దీన్నే మనం అంతర్యామి స్వరూపం అంటాం. కాని మనకు తెలియట్లేదు కదా!. "పూర్ణ మద:"- అద: అంటే అంతటా వ్యాపించి ఉంది. అదీ పూర్ణమే. లాభం లేదు గుర్తించటం కష్టం. మరి ఏం చేస్తుంది ఈ పూర్ణం. "పూర్ణాత్ పూర్ణముదచ్యతే"- ఆ పూర్ణమే  ఒక చోటకు చేరి ఉంటుంది- అదీ పూర్ణమే. సృష్టి,స్తితి,లయ కార్యాలు చేయటానికి వ్యూహ స్తానంలో ఉంటుంది.  అదీ పూర్ణ రూపమే, కానీ మనం చూడలేం కదా. "పూర్ణస్య పూర్ణమాదాయ"ఆయా అవసరాలను బట్టి ఆపూర్ణం లోనుంచి మరో పూర్ణం మన వద్దకు దిగి వస్తుంది- అదీ పూర్ణమే. వీటినే అవతరాలు అంటారు. ఇవి కాలానుగుణం బట్టి వచ్చేవికదా మనం ఇప్పుడు చూడలేం కదా, ఎలాగా?  "పూర్ణమేవా వశిష్యతే"- ఆయా అవతారాలలో వచ్చినప్పుడు ఆయా గూణాలను బట్టి మనం ఏర్పాటుచేసుకొన్న విగ్రహం కూడా ఒక పూర్ణమే. అందుకే మనం ఆరాధించే విగ్రహం ఒక సంపూర్ణమైనదే అని ఒక విశ్వాసం ఏర్పడాలి.


ఈ స్వరూపాలన్నన్నింటినీ ఆండాళ్ తల్లి ఒక్కోక్క పాటగా మనకు అందించింది. అందుకే తిరుప్పావైని వేదాల సారం అంటారు.




శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్  స్వామివారి ప్రవచనం  

Sunday 18 December 2016

తిరుప్పావై నాల్గవరోజు పాశురం


4.పాశురము :


*    ఆళి మళైక్కణ్ణాః ఒన్ఱు నీ కైకర వేల్
    ఆళి యుళ్ పుక్కు మగన్ధు కొడార్ త్తేఱి
    ఊళి ముదల్వనరువమ్ పోల్ - మెయ్ కఱుత్తు
    పాళి య న్దోళుడై ప్పఱ్పనాబన్ కైయిల్
    ఆళి పోల్ మిన్ని వలమ్బురి పోల్ నిన్ఱ దిర్ న్దు
    తాళాదే శార్ ఙ్గం ముదైత్త శరమళై పోల్
    వాళ వులగినిల్ పెయ్ దిడాయ్ - నాజ్గళుమ్
    మార్ గళి నీరాడ్ మాగిళ్ న్దేలో రెమ్బావాయ్.

భావము: ఓ పర్జన్య దైవమా! వర్షమును కురిపించుటలో లోభత్వమును జూపకుము. నీవు సముద్రములోని నీటి నంతను కడుపు నిండుగ త్రాగుము, అటుపిదప నీవు పైకెగసి, సృష్టికంతకును కారణభూతుడైన ఆ శ్రీమన్నారాయణుని శరీరపు రంగు వలె నీ శరీరమునకును ఆ నలుపురంగు నద్దుకొనుము. స్వామి కుడి చేతియందున్న సుదర్శన చక్రము వలె మెరయుము. ఎడమ చేతిలోని పాంచజన్య శంఖమువలె గంభీరముగా గర్జించుము. స్వామి సారంగమను ధనుస్సు నుండి వెడలే అవిరళ శరాలుగ వర్షధారలను కురిపించుము. మేమందరము యీ వర్ష ధారలలో స్నానమాడెదము. లోకము సుఖించునట్లు వర్షించుము మా వ్రతమును నిరాటంకముగ జేసికొనుటకై యిక ఏ మాత్రమూ ఆలసింపక వెంటనే వర్షింపుము స్వామీ!


    అవతారిక


సర్వవ్యాపాకుడైన త్రివిక్రముని వ్యాపకత్వాన్ని యెరిగి ఆ పురుషోత్తముని కొలిచిన కలిగే ఫలితాలను గురించి 3వ పాశురంలో గోదాదేవి వెల్లడించింది. అట్టి పరమాత్ముని యేమరక భక్తితో పూజించే శక్తియుక్తులు కావలెనన్న ముందు శారీరక శుద్ధి, ఆపై అంతర్ శుద్ధి అవసరం కద! అందుకే బాహ్య శుద్ధి కొరకు గోదాదేవి వర్షదేవుడైన వర్జన్యుణ్ణి ప్రార్థంచి వ్రతాంగమైన స్నానానికై వర్షించమని కోరుతున్నదీ పాశురంలో.

    (ఉదయరవిచంద్రిక రాగము -ఆదితాళము)


ప.    వెనుదీయబోకుమా! వర్జన్యమా!
    కనికరముంచుమ! వర్షాధిదైవతమ!

అ. ప.    పానము చేయుమ! సాగర జలముల
    ఘనమౌ గర్జన చేయగరమ్మా!

1 చ.    ఆకాశమున కెగసి లోకకారణుని
    పోకడి తిరుమేని నలుపు నలదుకొనుమ

2 చ.    విశాల సుందర భుజ పద్మనాభుని  
    అసదృశమగు చక్రమువలె మెరసి
    ఆశనిపాత శంఖముగ గర్జించి
    ఆ శార్జపు శరములుగ వర్షింపుమా

3 చ.    ఆశల, లోకము సుఖముల నొందగ
    మాస మార్గళిని మాకై వర్షింపుమా
వెనుదీయబోకుమా! పర్జన్యమా!

03 వ రోజు - పాశురం

03 వ రోజు - భగవంతుని మూడో స్థానం - విభవం(అవతారములు)

 ఆండాళ్ తిరువడిగలే శరణం   

andal godadevi

పాశురము

ఓంగి ఉలగళంద ఉత్తమన్ పేర్ పాడి

నాంగళ్ నం పావైక్కు చ్చాత్తి నీర్ ఆడినాల్

తీంగిన్ఱి నాడేల్లాం తింగళ్ ముమ్మారి పెయ్దు

ఓంగు పెఱుం జెన్నెలూడు కయల్ ఉగళ

పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప

తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి

వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్

నీంగాద శెల్వం నిఱైందేలోర్ ఎమ్బావాయ్


విభవం(అవతారములు)

ఈ రోజు ఆండాళ్ తల్లి అవతారముగా వచ్చిన వామనమూర్తిని కొలిచింది. పాల్కడలిలోకి దిగివచ్చిన నారాయణ తత్వం మనకోసం ఒక సారి చేప లాగా, ఒకసారి తాబేలు లాగా, ఒక సారి వరాహమ్లాగ, మరోకసారి ఇటు మనిషి కాని అటు మృగము కాని వాడిలా, ఒక సారి మనిషిలా ఇలా ఎన్నో రకాలుగా ఆయా అవసరాలను బట్టి ఒక రూపం స్వీకరించి మనవద్దకు వస్తాడు.

 "ఓంగి" పెరిగెను "ఉలగళంద" కొలిచెను "ఉత్తమన్ పేర్ పాడి" పరమాత్మ నామాన్నే పాడుదాం. నామమే చాలా గొప్పది, భగవంతుడు ముద్ద బంగారం అయితే ఆయన నామం ఆభరణం లాంటిది. అయన నామం కు ఒంగి ఉంటాడు. ఎవరి నామాన్ని పాడితే ప్రాచీన పాప రాశి అంతా కొట్టుకు పోతుందో, మంచి నడవడిక ఏర్పడుతుందో, నాలుక ఉన్నందుకు సార్తకత ఏర్పడుతుందో ఆయన నామాన్ని పాడుదాం. సౌదర్యం, సౌశీల్యం, సౌలభ్యం అన్ని గుణాలు కల్గిన వామన మూర్తిని అమ్మ ఊహించింది.

ఒక్కసారిగా పెరిగి ఆయన లోకాలను కొలిచాడు, ఆపెరగటం కూడా భలి చక్రవర్తి ఒకపాదాన్ని కడిగిన నీరు, బ్రహ్మలోకంలో బ్రహ్మ కడిగిన రెండో పాదం నీరు ఒకే సారి భూమిని చేరాయట. మరీ ఇంత త్వరగా ఎలా పెరగాడు! ఆయన పెరగలేదు ఆయన అంతటా వ్యాపించి ఉంటాడుకదా ఒక్కసారిగా ఆయన వ్యాప్తిని చూపించాడు.   పెరగటం తరగటం మనం చేసేవి మన కర్మల వల్ల, మన సంస్కారాల వల్ల. మరి జన్మ కర్మలు లేనివాడు ఆయన, ఇది మన కోసం చేస్తాడు. ఇవన్నీ ఆయన ప్రేమ కోసం చేస్తాడు.  మూడో కాలు భలి తలపై పెట్టాడు, బలి అహం కాస్తా దాసోహంగా మారింది. రసాతలం భలికి ఇచ్చినాడు.

మొదటి రోజు ఆండాళ్ తల్లి మనకు నారాయణ తత్వం గురించి చెప్పింది, రెండో రోజు ఆ తత్వం మనల్ని రక్షించేందుకు ఆయన పాల్కడలిలో ఎలా ఉంటాడో చెప్పింది, ఈరోజు ఆయన మనల్ని ఉద్దరించేందుకు ఎలా అవతారంగా వచ్చాడో తెలుపుతుంది.

వ్రత ఫలితములు


ఈరోజు చాలా ప్రధానమైన రోజు, ఆండాళ్ తల్లి ఈవ్రతం చేస్తే వచ్చే ఫలితం గురించి చెప్పినరోజు.  పెద్దలు మనల్ని అశిర్వదించాలంటే ఈ పాటను పాడి మనల్ని ఆశీర్వదిస్తారు. మనషికి మంచి భవనాలు ఉంటే సుఖమా! లేక  యంత్రాలు,వాహనాలు  ఉంటే సుఖమా! లేక  సమాజంలోని వ్యక్తులందరికి అవసరమయ్యే కనీస అవసరాలు ఉంటే  సుఖమా! మనిషికి ఉండటానికి నీడ అవసరం -అది ప్రశాంతం గా ఉండాలి, తినడానికి ఆహారం అవసరం అది పుష్టిగా ఉండాలి, త్రాగటానికి జలం అవసరం- అది ఆరోగ్యకరంగా ఉండాలి. ఈ కనీస అవసరాలు అందించే వ్యవస్త కావాలి. ఈతి బాధలు ఉండకూడదు, దోంగలూ ఉండకూడదు, రోగాలు ఉండకూడదు.

మనం చేసే కార్యాలు ఎలా ఉండాలంటే దృష్ట-అదృష్ట రెండూ ప్రయోజనాలను కల్గించేలా ఉండాలి. మనం చేసే చిన్న చిన్న యజ్ఞాలకే స్వర్గాది ఫలాలు వస్తాయి అంటారే అది అదృష్ట ఫలం, దృష్ట ఫలం గా ఇక్కడ ఉన్నప్పుడు అనుభవించే డబ్బు, మంచి సంతానం, భవనాలు, దీర్ఘ ఆయిస్సు, మంచి ఆరోగ్యం ఇవన్నీ లభిస్తాయి అంటారు.  మరి మనం చేసే ధనుర్మాస వ్రతం దేవాది దేవుడు సాక్షాత్తు శ్రీకృష్ణ పరమత్మకోసం చేసేది కావటంచే మనకు లభించేది తిరిగి మనం ఈ కర్మకూపంలోకి చేరక్కరలేకుండా తరించే వీలయ్యే ఉత్తమ స్థానం మనకు తప్పక లభిస్తుంది. ఒక్కసారి ధనుర్మాస వ్రతం చేస్తే మనకు ఆయన దగ్గర స్థానం లభించక మానదు.  అక్కడికి వెల్లేముందు మనకు లభించే ఫలితాలు ఈరోజు ఆండాళ్ తల్లి వివరిస్తుంది.

ఈ వ్రత గొప్పతనం అలాంటిది, ఈ వ్రత ఫలితం ఇచ్చే శ్రీకృష్ణుడి గొప్పతనం అలాంటిది,ఈ వ్రతంలో మనం వాడే మంత్రం ప్రభావం అలాంటిది,  ఈ వ్రతం ఆచరించిన గోపికల గొప్పతనం అలాంటిది, ఆ వ్రతాన్ని మనకు పాడి ఇచ్చిన ఆండళ్ అమ్మ తల్లి వైభవం అట్లాంటిది. మనకు కావల్సింది కేవలం పరిపూర్ణమైన విశ్వాసం ఒకటి ఏర్పడాలి. సకల దేవతలు శ్రీకృష్ణపరమాత్మ రూపంలో ఒదిగి ఉంటారు కదా! ఆయన అనుగ్రహిస్తే అందరూ అనుగ్రహించినట్లే కదా! ఆయనను తెలిపే నారాయణ మంత్రం ఒక్కటి అనుష్టిస్తే మిగతా మంత్రాలన్నీ అనుష్టిస్తే వచ్చే ఫలం లభించదా!.

ఇక్కడ మనం మహాభారతంలో ఒక సన్నివేషం గుర్తుచేసుకుందాం, అజ్ఞాతవసంలో పాండవుల గుట్టు రట్టు చేయటానికి ధుర్యోధనుడు తన గూడాచారులను పంపాడు, వారికి ఎక్కడ కనబడలేదు. ఇంత పరాక్రమమైన వాల్లు దాగి ఉండటం చాల వింతయే కదా! దానికి భీష్మ పితామహుడు వారితో పాండవులను వెతకటం అట్లాకాదయా, వారు ఒక్కొక్కరూ నారాయణ మహామత్రం ఉపాసన చేసిన మహనీయులు కనక వారు ఉన్నదగ్గర వానలు బాగా కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి, రోగాలు ఉండవు, దొంగల భాద ఉండదు, ఇప్పుడు వెతకండి అని రహస్యాన్ని చెప్పాడు. అప్పుడు వారికి విరాట్ నగరం సిరిసంపదలతో కనబడింది, అందుకే ఉత్తరగోగ్రహణం చేసారు. తరువాత కథ మనకు తెలుసు, ఇక్కడ మనకు కథ కాదు ప్రధానం. మనం నారాయణ మహామంత్ర గొప్పతనం గమనించాలి.

"నాంగళ్" ఏం కోరిక లేని  "నం పావైక్కు" లోకం మొత్తం సుఖించాలని ఆచరించేది  "చ్చాత్తి నీర్ ఆడినాల్"  వ్రతం అని వంక పెట్టుకొని స్నానం చేసినా చాలు, వ్రతం చేసినట్లే. మన కోరేది శ్రీకృష్ణ పాద సేవయే కదా! మరి లోకం మొత్తం ఎలా ఫలితం వస్తుంది, ఎలా అంటే శ్రీకృష్ణుడు మూలం కదా, వేరుకు నీరు పోస్తే చెట్టు ఎలా వికసిస్తుందో అలాగే.

"తీంగిన్ఱి నాడేల్లామ్" బాధలు వుండవు " తింగళ్ ముమ్మారి పెయ్దు" నెలకు మూడు సార్లు వర్షాలు కురుస్తాయి-పంటలు బాగాపండుతాయి. "ఓంగు పెఱుం జెన్నెల్" కలువ తామరలు ఏపుగా పెరిగుతాయి  "ఊడు కయల్ ఉగళ"  ఆ నీటిలో భలమైన చేపలు తిరుగుతింటాయి. "పూంగువళై ప్పోదిల్ పోఱిపండు కణ్-పడుప్ప"  అందమైన పుష్పాలు పూస్తాయి, వాటిలో తుమ్మెదలు తేనెను ఆస్వాదించి మత్తుతో నిద్రపోతున్నాయి. "తేంగాదే పుక్కిరుందు శీర్ త్త ములై పత్తి వాంగ క్కుడం నిఱైక్కుం పళ్ళల్ పెరుం పశుక్కళ్"   పశువులు ఇచ్చేపాలు పాత్రను దాటి పొంగేంత చక్కని పాడి ఉంటుంది. "నీంగాద శెల్వం నిఱైంద్" కావల్సిన ధనం, సంపదలు చేకూరుతాయు.

 శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్  స్వామివారి ప్రవచనం

Friday 16 December 2016

తిరుప్పావై ప్రవచనం 02 వ రోజు

తిరుప్పావై ప్రవచనం


02 వ రోజు - భగవంతుని రెండో స్థానం వ్యూహం(పాల్కడలి)
 ఆండాళ్ తిరువడిగలే శరణం

వ్రతనియమాలు
పాశురము

వైయత్తు వాళ్ వీర్గాళ్! నాముం నం పావైక్కు
శెయ్యుం కిరిశైగళ్ కేళీరో పాఱ్కడలుళ్
పైయత్తుయిన్ఱ పరమనడి పాడి
నెయ్యుణ్ణోం పాలుణ్ణోం నాట్కాలే నీరాడి
మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్
శెయ్యాదన శెయ్యోం తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్
ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి
ఉయ్యుమాఱెణ్ణి ఉగందేలోర్ ఎమ్బావాయ్
మనిషి బాగుపడటానికి ఎన్నో మార్గాలు,  శాస్త్రాలలో  ఆవి కర్మయోగమని, జ్ఞానయోగమని, భక్తి యోగమని ఇలా ఎన్నో చెప్పబడి ఉన్నాయి. భగవంతుడే ఒక మార్గమని తీసుకుంటే వారు మర్గశీర్షంలో పయనిస్తున్నారు అని అంటారు. అలాంటి మార్గంలో లక్ష్యం చేరటంలో ఇబ్బందులు ఉండవు. తల్లి అండలో ఉన్న శిశువు మాదిరిగా మనల్ని తరింపచేస్తాడు పరమాత్మ, కాని అలా జరగటానికి మన అంగీకారం కావాలి. మనలోని జ్ఞానం ద్వారా మనం నీవాడను నేను అని ఆయనకు చెప్పాలి.  మరి అలాంటి మార్గంలో  పయనించటానికి మనం ఎలా ఉండాలో మన ఆండాళ్ తల్లి తెలియజేసింది ఈ ధనుర్మాస వ్రతంలో.  ఏమి చేయాలో ఏమి అవసరం లేదో చెబుతోంది ఈ పాటలో.

భగవంతుణ్ణి భగవన్మయుడని, పరమాత్మ అని, గోవింద అని ఇలా ఎన్నో పేర్లతో చెబుతారు. మనకు కనిపించే వివిద రూపాల్లో ఉంటాడు కాబట్టి భగవన్మయుడని అంటారు. "అణు:" అతి చిన్నరూపం నుండి "బృహత్:" అతి పెద్ద స్వరూపంగా ఉంటాడు కాబట్టి పరమాత్మనే అని అంటారు. "శబ్ద సహ" అతి సామన్యుడు పిలిస్తే అందుతాడు, "శబ్దాతిగ" చతుర్ముఖ బ్రహ్మకూడా కీర్తించ చేతకానివాడు, అందుకే ఆయనను గోవింద అని అంటారు.  మరి జగత్తు మొత్తం పరమాత్మ శరీరం కదా! మరి ఇక్కడ తగినవి- తగనివి అంటూ ఉంటాయా!!

ప్రకృతి స్వభావాన్ని బట్టి, ఆయా గుణాలను బట్టి సత్వం,రజస్సు మరియూ తమస్సు అనే గుణాలు ఉంటాయని గమనించాలి. సత్వం  జ్ఞానాన్ని, రజస్సు కోపాన్ని, తమస్సు అజ్ఞానాన్ని,బద్దకాన్ని ఇస్తాయి. మరి శరీరం ఈ పంచబూతాలతో తయారైనదే కదా, కాబట్టి ప్రకృతిలో ఉండే ఈ గుణాలు మనలో కూడా ఉంటాయి. కాని ఏదో ఒక గుణం పైన ఉండి నడిపిస్తుంది. సత్వం పెరిగితే మంచిది. ఇలా చెప్పటానికి మన చేతిలోని చూపుడు వేలును మనతో  పోలుస్తారు, బ్రోటన వేలును పరమాత్మతో పోలుస్తారు. ఇక తమస్సు,రజస్సు, సత్వ గుణాలను మిగతామూడు వెల్లతోపోల్చుతారు. ఈ మూడు గుణాలతో కలిసి ఉన్న చూపుడు వేలుని బ్రోటనవేలి తో కలిపే దాన్ని జ్ఞాన ముద్ర అంటారు. చిటికెన వేలు సత్వం కొద్దిగానే ఉంటుంది, రజస్సు-తమస్సు ఎక్కువగా ఉంటాయి. మరి బాగు పడటానికి సత్వం కావాలి, కొన్ని నియమాల్ని పాటించాలి.  నియమాలు మరి ప్రకృతిలోని గుణాలకోసమే కాక, మనల్ని ఆదర్షంగా తీసుకొనేవారు బాగు పడటానికి కూడా మనం పాటించాల్సి వస్తుంది. ఈ కృత్యా- అకృత్య వియోచనాలను మన ఆండాళ్ తల్లి ఈ పాటలో తెలియజేస్తుంది.

"వైయత్తు వాళ్ వీర్గాళ్!"  ఈ భుమి మీద ఉండి సుఖించాలని కోరిక ఉంటే చాలు రండి అని చెబుతుంది. ఈ భూమి తామస గుణమిచ్చేది, ఇక్కడ ఉండగా సాత్వికగుణం కలగటం కుంపెటలో తామరపువ్వు పూసినట్లు అంటారు. చివరికి పరమాత్మకు కూడా తామస గుణ ప్రభావం తప్పలేదు అని సీతాదేవి హనుమంతునితో చెప్పుతుంది ఈ విషయం రామాయణంలో. రావణ వధ అనంతరం సీతను తీసుకుపోవటానికి వచ్చిన హనుమ సీతాదేవితో, నివ్వు ఆజ్ఞ యివ్వు నిన్ను పీడించే ఈ రాక్షసమూకను ఒక్కసారి పని పడతాని అంటాడు, దానికి సీత ఇది వారి తప్పు కాదయా, వారు రావణుని అండలో ఉన్నారు, ఈ భూమిమీద ఉండగా తప్పు చేయడం సహజమేకదా, చివరికి చూసిరమ్మని చెబితే కాల్చివెల్లలేదా నీవు. దానికి హనుమ మరి నేనంటే ఏమో, కాని శ్రీరామ చందృడు కూడా తప్పు చేసినాడా అమ్మ అని అడిగాడు. సూర్పణక వచ్చినప్పుడు ఆమెతో రాముడి ప్రవర్తన మరి తప్పేగా, నేను ఏక పత్నివ్రతుడను అనిమాత్రం చెప్పక, తన తమ్ముడికేసి ఎందుకు చూపించాడు. ఇవ్వన్నీ కదా ఇన్ని అపచారాలకు దారి తీసింది అని హనుమంతుడితో చెప్పుతుంది.

"నాముం నం పావైక్కు" ఒకరిని కష్టపెట్టే వ్రతం కాదు, లోకుల వ్రతాలు వారి వారి సుఖాలకోసం చేస్తే ఈ వ్రతం లోకం అందరికోసం చేసేది. "శెయ్యుం కిరిశైగళ్ కేళీరో" మరి ఏం చేద్దాం ఈ వ్రతంలో వినండి, " పాఱ్కడలుళ్ పైయత్తుయిన్ఱ పరమనడి పాడి"  పాల కడలిలోని సుకుమారం గా పవళించి ఉన్న వైకుఠనాథుని పాదాలను పాడదాం. ఆయనను మించినవారు ఇంకెవరూలేరు కాబట్టి "పరమన్" అని అంటారు.   ఎందుకంటే  మనల్ని కాపాడటానికి తాను మొదటగా పాదం వేసినది పాల్కడలిలోనేకదా! ఆయన పాదాలలో శంఖ, రథాంగ, కల్పక, ద్వజా, అరవింద, వజ్రా, అంకుష ఇత్యాదులు గుర్తులుగా  చేసుకొని ఉన్న ఆపాదాన్ని పాడుదాం. ఎలాగైతే శిశువు తల్లి స్తన్యాన్ని గుర్తిస్తాడో, భక్తుడు భగవంతుని పాదాలను గుర్తించగలిగి ఉండాలి. సుకుమారమైన నిద్ర అంటే లోక రక్షణకోసం తానుచేసే సాత్విక-యోగనిద్ర.  మనకోసం ఇంకా ఎమి చేస్తె బాగుపడతాం అని ఏర్పాటు చేసుకొన్న స్థానం పాల్కడలి.

వ్యుహం-పాల్కడలి


నిన్నటి నాడు నారాయణ అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఇన్ని గుణాలు కల్గి ఉన్న నారాయణ తత్వాన్ని అర్థం చేసుకోవటం కష్టమే. మరి ఆ తత్వం మనల్ని ఎలా కాపాడుతుందో తెలుసుకోవటం అవసరం. మనం ఇప్పుడు ఒక శరీరం ధరించి ఉన్నాం, ఒక భూమి మీద నివసిస్తునాం. ఈ భూమి సౌరమండలంలో ఉంది. ఇదంతా ఎవరు ఏర్పాటు చేసారో మనం ఆలోచించటం లేదు. ఒక చిన్నవిత్తనం నుండి ఒకపెద్ద వటవృక్షం వచ్చినట్లుగా ఇది ఒకనాడు ఎర్పడింది ఒకడిలోంచే అని మనకు వేదం చెబుతుంది.

ఇవన్ని ఏవి లేనప్పుడు పరమాత్మ ఈ జీవులందరూ ఉన్నారే అతి చిన్నరూపం కలవారు, అతి విలక్షణమైన జ్ఞానం కలవారు, కర్మభారాలు మోసేవారు, తామంతట తాము దేహాలు ధరించలేనివారు మరినేను వీళ్ళకు ఉపకారం చేయకుంటే ఎలా! కర్మతోలగాలంటే దేహం కావాలి, దేహం ఉండే నేల కావాలి, దాన్ని భోగ స్థానం అంటారు. అందుకు అనుభవించే వస్తువులు కావాలి, వాటిని భోగ్యములు అని అంటారు. వీటిని అనుభవించే ఇంద్రియాలు కావలి వాటినే భోగ్య ఉపకరణములు అంటారు.  ఇన్నింటిని తయారు చేనినవాడిని మనం నారాయణ అంటాం. మరి ఇవన్నీ తయారు చేయటానికి ఆయన ఏర్పాటు చేసుకొన్న స్థానాన్నే వ్యూహం అంటారు.

అక్కడ ఆయన వాసుదేవ, అనిరుద్ద,ప్రత్ర్యుమ్న, సంకర్షన అనే నాలుగు పేర్లతో ఉంటాడు. సృష్టి, స్థితి, లయము ఈ మూడు కార్యాలు చేస్తాడు, ఆ స్థానాన్నే పాల్కడలి అని కూడా అంటారు.

ఆయన కళ్యాణ గుణాలకు అది మూలస్థానం. అక్కడ వాసుదేవ అనేరూపంతో సర్వం తన ఆదీనంలో పెట్టుకుంటాడు. అందులోంచి ఒక రూపం తీస్తాడు దానికి సంకర్షణ అని పేరు, ఇది ప్రళయం చేయటానికి శివునిలో తానుండి చేస్తాడు. మరొక రూపం తీస్తాడు, దానికి అనిరుద్ద అని పేరు సృష్టి కోసం తాను బ్రహ్మలో ఉండి చేస్తాడు,   మరొక రూపం తీస్తాడు, దానికి ప్రత్యుమ్న అని పేరు సృష్టించిన వాటిని రక్షించేందుకు ఇది ఇందృనిలో ఉండి చేస్తాడు.  అక్కడికి ఆయన మొట్టమొదటిగా అడుగు పెడతాడు, ఆదిశేశువు పైన ఆయన ఉంటాడు. ఆర్తితో పిలిచేవారి కోసం ఎదురు చూస్తూ ఉంటాడు.  ఎప్పుడెప్పుడు అవసరం ఏర్పడుతుందో అక్కడినుండి లోకరక్షణకై అవతారాలను పంపిస్తుంటాడు. అన్ని అవతారాలకు మూల స్థానం పాల్కడలియే. ఆయా అవతారల్లో ఆయన గుణ సంపదలను లోకానికి చాటుతాడు. అందుకే అవతారాలను విభవములు అంటారు.

 ఆయన పాదలను పాడుదాం. కడుపు నిండి పోతుంది-  ఇక "నెయ్యుణ్ణోం పాలుణ్ణోమ్" నెయ్యి వద్దు పాలు వద్దు. "నాట్కాలే నీరాడి" తెల తెల వారు జామున లేచి స్నానం చేద్దాం.  "మైయిట్టెళుదోం మలరిట్టు నాం ముడియోమ్" కాటుక,పూలు ధరించం, ఏవి విలాసాలో అవి వదిలేస్తాం. "శెయ్యాదన శెయ్యోమ్" మాపూర్వులు చెయ్యనివి ఏమి చెయ్యం - ప్రాచీణ ఆచారాలు మానెయ్యం " తీక్కుఱళై చ్చెన్ఱోదోమ్" పుళ్ళవిరుపు మాటలు మాట్లాడం. "ఐయముం పిచ్చైయుం ఆందనైయుం కైకాట్టి" చాతనైనంత వరకు ధాన ధర్మం చేస్తాం. "ఉయ్యుమాఱెణ్ణి ఉగంద్" ఇవన్ని ఆనందంతో చేస్తాం.

 శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్  స్వామివారి ప్రవచనం

కలి అనగా నేమి .కలియుగంలో ఏమి జరుగుతుంది

కలి అనగా నేమి .కలియుగంలో ఏమి జరుగుతుంది

ఒకసారి పాండవులంతా ( ఆ సమయంలోఅక్కడ ధర్మరాజు లేడు) కలసి కృష్ణుని సమీపించి " కలియుగం అంటే ఏమిటి? కలి యుగంలో ఏమి జరుగబోతుంది " అని అడిగారు.

దానికి శ్రీ కృష్ణుడు " నేను చెప్పను, మీరే తెలుసుకోండి అని " చెప్పి నాలుగు బాణాలు తీసుకుని నాలుగు దిక్కుల్లో వదలి, నలుగురిలో ఒక్కొక్కరు ఒక్కోదిక్కు వెళ్లి,తాను  వదిలిన బాణాలను తెమ్మని చెప్పి పంపించాడు..

     అర్జునుడు తూర్పు దిక్కుగా వెళ్లి, అక్కడ పడిన బాణాన్ని తీస్తుండగా మధురమైన స్వరం ఒకటి వినిపించింది.  చూస్తే ఒక చెట్టుకొమ్మపై కోకిల కూర్చుని మధురాతి మదురంగా గానం చేస్తూంది. కానీ అది తన కాళ్ల క్రింద ఎలుకనొకదాన్ని పట్టుకుని తినడానికి సిద్దంగా ఉండడం కూడా చూసి " ఇదేమి వింత..!" అనుకుని వెనుకకు వచ్చేసాడు...

      భీముడు ఉత్తర దిక్కుగా వెళ్లగా, అక్కడ పడిన బాణం పడే చోట ఐదు బావులు కన్పించాయి. వాటిలో ఒకటి చిన్నదిగా ఉండి పూర్తిగా ఎండిపోయి ఉంది.దానీ చుట్టూ ఉన్న నాలుగు
బావులు పూర్తిగా నిండిపొయి చాలదా అన్నట్లు వాటిలో నీరు భయటకు పొర్లుపోతుంది. ఈ సంఘటన చూసిన భీముడు ఏమీ అర్ధంకాక బాణం తీసుకుని తన దారిన తాను వెళ్ళిపోయాడు...

       మూడవ వాడైన నకులుడు పడమట దిశగా వెళ్లి బాణంతో తిరిగి వస్తుండగా దగ్గరలోఒక ఆవు అపుడే జన్మనిచ్చిన దూడను తన నాలుకతో తుడుస్తుండడం చూసాడు. ఆ ఆవు , దూడ శరీరమంతా తుడుస్తూ ఉండగా కొందరు మనుషులు బలవంతంగా అతి కష్టంమీద ఆ ఆవునుండి దూడను వేరుచేయడం జరిగింది. ఈ పెనుగులాటలో దూడ తీవ్రంగా గాయపడింది. ఈ సంఘటన చూసిన నకులుడు మనసులో కొంచెం బాధ పడ్డాడు. చేసేదేమీ లేక వెనుకకు వచ్చేసాడు...

       చివరివాడైన సహదేవుడు దక్షిణ దిశగా పోయి బాణం తీస్తుండగా పక్కనున్న కొండపైనుండి పెద్ద బండరాయి ఒకటి రాళ్లను పిండి చేస్తూ, చెట్లను విరచుకుంటూ వేగంగా దొర్లుతూ రావడం చూసాడు. అది అట్లా దొర్లుకుంటూ పెద్ద పెద్ద వృక్షాలను విరిచేస్తూ చివరికి ఒక చిన్న మొక్క దగ్గరకొచ్చి ఆగిపోయంది. సహదేవునికి మర్మం అర్దంకాక తిరిగివచ్చేసాడు...

      నలుగురు కృష్ణుని వద్దకు వచ్చి తాము చూసిన సంఘటనలను వివరించి వాటియందలి అర్దాన్ని తెలుపవలసిందిగా కోరారు...

      అపుడు కృష్ణుడు మందహాసంతో " కలియుగంనందు మానవులు తాము గొప్ప పండితులమని మాకు సాటి ఎవరూ లేరనే అహంకారంతో కోకిలకూత వలే నీతులు చెపుంట్తారు. కానీ చేసేవి మాత్రం నీచమైన పనులు. వీరు జీవితమంతా అజ్ఞనపు చీకటిలో ఉండి పూజకు పనికి రాని పువ్వు వలే బ్రతకాల్సి వస్తుంది. ఇదే అర్జునుడు చూసిన సంఘటనలోని అర్దం."

        " ఇక రెండవది.. కలియుగంనందు చాలా మంది వద్ద పుష్కలంగా ధనం ఉన్నప్పటికీ వ్యర్థపరమైన ఖర్చులు పెడుతుంటారు తప్ప తమ మద్యనే ఉంటూ కటిక పేదరికాన్ని అనుభవిస్తున్న తోటి మానవులకు పైసా కూడా ఇవ్వరు. వీరు దనంతో సుఖాలను అనుభవిస్తున్నామనుకుంటుంటారు ..కానీ శవాలతో సహవాసం చేస్తుంటారు. ఇదే భీముడు చూసినదాంట్లోఅంతరార్దం."

          " ఇంకా మూడవది... కలియుగంలోతల్లిదండ్రులు (ఆవు తన దూడ పై చూపించిన అతి ప్రేమ వలే )తమ సంతానంపై మితిమీరిన ప్రేమ చూపిస్తుంటారు. నిజానికి ఈ అతి వలనే వారు చెడు త్రోవ లో పోయి జీవితాన్ని నాశనం చేసుకుంటుంటారు. వీరివలన సమాజం చైతన్యం కోల్పోతుంది.. నకులుడు చూసిన సంఘటనలో అంతరార్దం."
       " ఇక చివరిగా కలియుగ మానవులు తమ ప్రవర్తన తీరుతెన్నులు సరిగా లేక, జీవిత పరమార్థం, మానవ జన్మ ఆవశ్యకత తెలుసుకోలేక కొండపైనుండి దొర్లి పడిపోయిన బండవలే దారీ తెన్నూ లేక నానా చిక్కుల్లో చిక్కుకుంటూ అశాంతిని అనుభవిస్తుంటారు.ఈ క్రమంలో తోటివారిని కూడా నానా అవస్థలకు గురి చేస్తుంటారు..

 అయితే అలా దొర్లుతూ చివరికి భగవంతుని చెంతకు వచ్చేటప్పటికి అశాంతి అంతా పొేయి పరమ శాంతిని పొందుతుంటాడు. ఇదే సహదేవుడు చూసిన సంఘటనలోని భావం." అని కృష్ణుడు బోదించాడు...

ధనుర్మాసం – ప్రాధాన్యత :

ధనుర్మాసం – ప్రాధాన్యత :


ఓం నమో పరమాత్మయే నమః

ధనుస్సంక్రమణం మానవజన్మ దేవదేవుని ప్రాప్తి కోసం నిర్దేశితమైనది. ఆభగవత్ ప్రాప్తి ఎక్కడో కాదు ఈభూమిపైనే. భక్తి ప్రపత్తి, ఆరాధన, ఆర్తి కలగలిపి సేవిస్తే భగవంతుడు మానవులకు ప్రాప్తిస్తాడని ఎందరో విశ్వసిస్తారు. ఆప్రాప్తిని అనుభవించి ఆ అనుభవాన్ని సర్వవ్యాప్తం చేయడమే శరణాగతి. ధనుర్మాస వ్రతం శరణాగతికి ప్రతీక.

ఈమాసంలో ఆండాల్ బాహ్య అనుభవంతో అంతరనుభవంతో ముప్ఫై రోజులు తాదాత్మ్యం చెందుతూ పాశురాలను గానం చేసింది. సత్సంగం వల్ల భగవత్సంగం ప్రాప్తిస్తుందని ఈపాశురాల గీతమాలిక తిరుప్పావై నిరూపిస్తుంది. మాసాల్లో మార్గశిరం తానేనని శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెబుతాడు. మార్గశీర్ష మాసంలో ధనూరాశిలోకి సూర్యుడు ప్రవేశించి మకరరాశిలోకి సాగే కాలాన్ని ధనుర్మాసం అంటారు. భువిపైన మన సంవత్సరాన్ని దివిలో ఒకరోజుగా లెక్కించే దేవతలకు మార్గశీర్షం బ్రహ్మీముహూర్తంగా పేర్కొంటారు. అంటే సూర్యోదయానికి ముందు తొంభైఆరు నిమిషాలు. ఉపనిషత్ భాషలో ధనుస్సు అంటే ప్రణవనాదమని అర్థం. ధనుస్సునుంచి వచ్చే టంకారమే ఓంకారనాదానికి మూలం. ఈనాదాన్ని గానంగా చేసుకొని సంకీర్తనం చేయడంవల్ల పరమాత్మను సాధించవచ్చునంటారు. నిజానికి ధనుర్మాస వ్రతఫలం ఇదే. ఆషాఢశుద్ధ ఏకాదశినాడు శ్రీమహావిష్ణువు యోగనిద్రకు ఉపక్రమించే రోజు.తిరిగి కార్తిక శుద్ధ ఏకాదశి నాడు విష్ణువు ఆయోగనిద్రనుండి మేల్కొని శుద్ధ త్రయోదశినాడు సకల దేవతాయుతుడై బృందావనానికి చేరుకుని, ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశినాడు ఉత్తరద్వారము నుండి మనకు దర్శనభాగ్యమును కలిగిస్తాడు. ఆదివ్య దర్శనభాగ్యం వలన క్షీణించిన శక్తియుక్తులు తిరిగి చేకూరుతాయి.దీనినే రాబోవు ఉత్తరాయణ పుణ్యకాలమునకు సంకేతంగా చెప్తారు. ఈధనుర్మాసం ఆరంభానికి ముందు గృహం లోపల పవిత్రమైన గోమూత్రంతో శుద్ధి చేయాలి. ఇంటిబయట ముంగిళ్ళలో గోమయంతో కళ్ళాపి జల్లాలి. దీనివలన అనారోగ్య కారకాలైన క్రిములు నశిస్తాయి. ఇలా పవిత్రములైన ఈప్రదేశములందు లక్ష్మీ నివాస స్థానములైన రంగవల్లులను తీర్చిదిద్దుతారు. ఆరంగవల్లులందు లక్ష్మీస్వరూపాలైన గొబ్బెమ్మలనుంచి వానిని పూలు, పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. భగవదారాధనను ఎన్నడు మరువరాదనే విషయాన్ని గుర్తుచేసేలా హరిదాసులు నామ సంకీర్తనలు చేస్తూ ఇంటింటికి తిరుగుతుంటారు. వీరిని గౌరవించినా భగవదారాధనే అవుతుంది. లక్ష్మీ స్వరూపాలైన గోవుల గిట్టలందు, ధర్మ స్వరూపాలైన వృషభాల గిట్టలందు లక్ష్మి ఉంటుందని చెప్తారు. అందువల్ల వృషభాన్ని అలంకరించి వాని అనుమతితో పనిలేకుండగనే ఇళ్ళముందుకు తెచ్చి వానితో నృత్యం చేయిస్తూ ఆనందింప చేస్తారు. ఆనందం కూడా లక్ష్మీ స్వరూపమే. అంతేకాక వృషభాల గిట్టల స్పర్శ వలన ఆప్రదేశం కూడా పవిత్రమవుతున్నది. శంఖం భగవస్వరూపం. కనుక అందుండి వచ్చే ధ్వని పవిత్రమవుతున్నది. ఈపవిత్ర శబ్దమును ఈ ధనుర్మాసమంతా వినిపించే జంగమ దేవరలు గౌరవింపదగినవారు. ధాన్య సమృద్ధి కలుగునదీ ఈమాసమునందే. లక్ష్మీ స్వరూపాలైన గోవులని ఈమాసంలో పూజించడం ఆచారంగా వస్తున్నది. ముఖ్యంగా ఉత్తరద్వార దర్శన సమయంలో అనగా ముక్కోటి నాడు గోపూజ అత్యంత ప్రధానమైనది. కోరిక కోరికలను తీర్చేది గోపూజ. ఈకాలంలో విష్ణుపూజ, దాన జపాదులు విశేషఫలప్రదం. గోదాదేవి ’మార్గశి’ వ్రతం ప్రారంభించి శ్రీరంగనాథుని అర్చించిన వేళ ఇది. తిరుప్పావై పారాయణ ఈరోజు నుండి మొదలు. వైష్ణవ సంప్రదాయంలో విశేషించి ఈమాసానికి ప్రత్యేక ప్రాధాన్యం.

Thursday 15 December 2016

తిరుప్పావై మొదటిరోజు పాశురం


తిరుప్పావై

1.    పాశురము :


    *మార్గళిత్తింగళ్ మది నిఱైన్ద నన్నాళాల్
    నీరాడ ప్పోదువీర్ పోదుమినో నేరిళైయీర్
    శీర్ మల్ గు మాయ్ ప్పాడి చ్చెల్వచ్చిఱుమీర్ కాళ్
    కూర్ వేల్ - కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్
    ఏరార్ న్దకణ్ణి యశోదై యిళ శింజ్గమ్
    కార్ మేని చ్చెంగళ్ కదిర్ మదియమ్బోల్ ముగత్తాన్
    నారాయణనే నమక్కే పఱై దరువాన్
    పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్ !

భావము : సుసంపన్నమైన గోకులంలో పుట్టి సుశోభితులైన గోపికలారా~ మార్గశీర్ష మాసం ఎంతో మంచిది. వెన్నెలలు కురిపిస్తుంది. చాలా మంచి రోజులివి. శూరుడైన నందగోపుని కుమారుడును, విశాల నేత్రియగు యశోదకు బాల సింహము వంటి వాడును, నల్లని మేఘము వంటి శరీరిమును, చంద్రునివలె ఆహ్లాదకరుడును, సూర్యునివలె తేజోమయుడును యైన నారాయణునే తప్పు, యితరములను కోరని మనకు ఆ స్వామి వ్రతమునకు కాలవసినవిచ్చుటకు సిద్ధపడినాడు. కావున మీరందరూ యీ వ్రతములో ప్రవేశించి లోకము ప్రకాశించునట్లుగ దాని కంగమైన మార్గళి స్నానము చేయు కోరికగల వారందరును ఆలసింపక శ్రీఘ్రముగ రండని శ్రీ గోదాదేవి గొల్ల కన్నియలందరను ఆహ్వానించుచున్నది.


        తిరుప్పావైగీతమాలిక


    అవతారిక:

వ్రతము చేయుటకు అనువైన సమయము, మాసము - మార్గశీర్షమాసము. కనుక భాగత్సంశ్లేషము కోరే భక్తులందరను వ్రతము చేయగా మార్గళి స్నానం చేదురు, రండీ! అని గోదాదేవి ఆహ్వానిస్తున్నది.

    1వ మాలిక

        (రేగుప్తి రాగము -ఆదితాళము)

ప..    శ్రీ గోకుల వాసులారా! - సిరికన్నియలార!
    భావతాపము దీర్చుకొనగ - వ్రతము చేయరండి!

అ.ప..    మార్గశీర్ష మాసమెంతో - మంచిది కద! రండి!
    మనసు పడిన వారెల్లరు -మార్గళి నీరాడ రండి!

1. చ..    ఆపద శంకించి కాచు - ఆనందుని తనయుని
    యశోదమ్మ యొడి యాడెడు - ఆ  బాల సింహుని
    నీలమేఘశ్యాముని - ఇన శశి సమవదమని
    నారాయణు గొలువనిపుడు - నరుల బొగడ రండి

2. ఛ.    ఈ నోమును నోచు మనము - ఇతరములను కోరము
    పర సాధన మొసగెడి మన - పరమాత్ముడే, సర్వము
    లోకమంత పొగడగ నీ - నోము మనము నోచెదము
    మనసు పడిన వారెల్లరు - మార్గళి నీ రాడరండి.

తిరుప్పావై అంటే ఏమిటి..??


తిరుప్పావై అంటే ఏమిటి..??

శుక్రవారం నుండి ధనుర్మాసం ప్రారంభం అవుతుంది కనుక ఈ మాసంలో తిరుప్పావై చదువుకొంటే చాలా మంచింది. తిరుప్పావై ఒక అద్భుత వేదాంత గ్రంధం. భగవంతుని సులభంగా అందించగలిగే సాధనా మార్గం. ''తిరు'' అంటే శ్రీ అని, ''పావై'' అంటే పాటలు లేక వ్రతం అని అర్ధం. కలియుగంలో మానవకన్యగా జన్మించి గోదాదేవిగా ప్రఖ్యాతమైన ఆండాళ్ భగవంతుడినే తన భర్తగా భావించి, ఆయన్ను చేపట్టడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై వ్రతం. తిరుప్పావై లో పాశురాలు ఉంటాయి. పాశురం అంటే ఛందోబద్ధంగా ఉన్న పాటలు. ఆండాళ్ అపురూప భక్తి పారవశ్యాన్నే శ్రీకృష్ణ దేవరాయలు ఆముక్తమాల్యద అనే గ్రంథంగా అందించారు.

తిరుప్పావై వ్రతానికి కొన్ని విధివిధానాలు ఉన్నాయి. వేకువజామునే నిద్ర లేచి స్నానం చేయాలి. ప్రతిరోజూ క్రమం తప్పకుండా స్వామి కీర్తనలను, తిరుప్పావై పాశురాలను ఆలపించాలి. పేదలకు దానాలు, పండితులకు సన్మానాలు చేయాలి. స్వామికి, ఆండాళ్ కు ఇష్టమైన పుష్ప కైంకర్యం చేయాలి. ప్రతిరోజూ స్వామివారికి పొంగలి నివేదించాలి.

సృష్టిలో భగవంతుడొక్కడే పురుషుడు, మానవులందరూ స్త్రీలు అనే ఉద్దేశంతోనే విష్ణుమూర్తిని శ్రీవారు అని సంబోధిస్తుంటారు. అటువంటి విష్ణుమూర్తిని భర్తగా పొందాలనే తలపుతో గోదాదేవి ధనుర్మాసంలో చేసిన ఈ వ్రతాన్ని నేటికీ మనం ఆచరిస్తున్నాం. ధనుర్మాసం మొదటిరోజున ఈ వ్రతాన్ని ఆరంభించి, భోగిరోజున ఆండాళ్, శ్రీరంగనాథుల కల్యాణం జరిపించడంతో ఈ వ్రతం ముగుస్తుంది.

శ్రీవైష్ణవ సంప్రదాయం ప్రకారం భక్తిసాగరంలో మునిగితేలినవారిని ''ఆళ్వారులు'' అంటారు. పన్నెండుమంది ఆళ్వారుల్లో విష్ణుచిత్తుడు మొదటివాడు. ఆయన గోదాదేవికి భక్తిసంపదలను వారసత్వంగా ఇచ్చారు. నిజానికి భూదేవియే ఆండాళ్ అని చెప్తారు. జనకమహారాజు భూమిని దున్నే సమయంలో సీతామాత దొరికింది. అలాగే శ్రీరంగనాథునికి పుష్ప కైంకర్యం కోసం విష్ణుచిత్తులవారు తులసితోట సాగుచేస్తుండగా ఆండాళ్ దొరికింది.

భగవంతుని తప్ప ఇతరులను సేవించడానికి వినియోగం కాని తులసివనంలో ఆండాళ్ దొరకదాన్ని గమనిస్తే సీతాదేవి ఆండాళ్ భూదేవి అంశయే అన్న సంగతి అర్ధమౌతుంది. ఆండాళ్ అసలు పేరు కోదై. ''కోదై'' అంటే మాలిక. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది. ఆ గోదాదేవి రచించిన 30 పాశురాలలో ఏయే అంశాలు ఉన్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. 30 పాశురాలలోని అంశాలు స్థూలంగా మంచిని ప్రబోధిస్తాయి. మంచి అలవాట్లతో జీవించమని, తోటివారికి సాయపడమని, భగవంతుని తప్పనిసరిగా ఆరాధించమని ఈ ప్రబోధాలు సూచిస్తాయి. ప్రతి పాశురంలోనూ ఇలాంటి సదాచరణే ఉంటుంది.

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles