Showing posts with label పండుగలు. Show all posts
Showing posts with label పండుగలు. Show all posts

Thursday 27 July 2017

శ్రావణ మాసం విశిష్టత

శ్రావణ మాసం

సృష్టి,స్థితి లయ కారకులైన త్రిమూర్తులలో స్థితికారుడు,దుష్టశిక్షకుడు,శిష్టరక్షకుడు అయిన శ్రీమహావిష్ణువుకు, ఆయన దేవేరి అయిన శ్రీమహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన, వివిధ వ్రతాలు, పూజలు ఆచరించడం వలన విశేష ఫలితాలు, సకల సౌభాగ్యాలను ప్రసాదించే దివ్యమైన మాసం "శ్రావణ మాసం"

చాంద్రమానం ప్రకారం శ్రావణమాసం ఐదవ మాసం. ఈ మాసంలోని పూర్ణిమనాదు చంద్రుడు శ్రవణ నక్షత్రం సమీపంలో ఉంటాడు కనుక ఈ మాసానికి శ్రావణ మాసం అని పేరు వచ్చింది. శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం "శ్రవణా నక్షత్రం" అటువంటి శ్రవణా నక్షత్రం పేరుతో ఏర్పడిన శ్రావణ మాసం శ్రీమహావిష్ణువు పూజకు ఉత్కృష్టమైన మాసం.

శ్రావణ మాసంలోని మూడువారాలు అత్యంత పుణ్యప్రదమైనవి. మంగళ,శుక్ర,శనివారాలు ఈ మాసంలో అత్యంత ప్రధానమైనవి,మహత్తును కలిగినవి. శ్రావణ మసంలోని మంగళవారాలు శ్రీగౌరీ పూజకు,శుక్రవారాలు శ్రీలక్ష్మీ పూజకు, శనివారాలు శ్రీమహావిష్ణువు పూజకు ముఖ్యమైన దినాలు. వీటికితోడు శ్రావణమాసంలోని శుక్లపక్షంలోగల పదిహేను రోజులు ఎంతో విశేషమైన రోజులనీ, ఒక్కోరోజు ఒక్కో దేవుని పూజ చేయాలని శాస్త్ర వచనం.

పాడ్యమి - బ్రహ్మదేవుడు
 విదియ - శ్రీయఃపతి
 తదియ - పార్వతీదేవి
 చవితి - వినాయకుడు
 పంచమి - శశి
 షష్టి - నాగదేవతలు
 సప్తమి - సూర్యుడు
 అష్టమి - దుర్గాదేవి
 నవమి - మాతృదేవతలు
 దశమి - ధర్మరాజు
 ఏకాదశి - మహర్షులు
 ద్వాదశి - శ్రీమహావిష్ణువు
 త్రయోదశి - అనంగుడు
 చతుర్దశి - పరమశివుడు
 పూర్ణిమ - పితృదేవతలు

మహిళలకు సౌభాగ్యానిచ్చే శ్రావణ మాస వ్రతాలు

శ్రావణమాసం మహిళలకు అత్యంత ముఖ్యమైనది. మహిళలు పాటించే వ్రతాల్లో అధికం ఈ మాసంలోనే ఉండడంవల్ల వ్రతాలమాసమని,సౌభాగ్యాన్ని ప్రసాదించే మాసమని కూడా పేర్కొనబడింది.

మంగళగౌరీ వ్రతం
 శ్రావణమాసంలో ఆచరించే వ్రతాల్లో ముఖ్యమైనది ఈ వ్రతం. ఈ వ్రతాన్ని కొత్తగా పెళ్ళయిన ముత్తైదువలు చేయాలి. నెలలోని అన్ని మంగళవారాలు దీనిని చేయవలెను.

వరలక్ష్మీ వ్రతం
 మహిళలకు అత్యంత ముఖ్యమైన శ్రావణమాసంలో ఆచరించే మరో ప్రధానమైన వ్రతం శ్రీ వరలక్ష్మీ వ్రతం. దీనిని పూర్ణిమ ముందు వచ్చే శుక్రవారం ఆచరింపవలెను.

శ్రావణమాసంలో వచ్చే పండగలు

శుక్లచవితి-నాగులచవితి
 మన రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాలలో ఈరోజు నాగులచవితి పండుగను జరుపుకుంటారు. ఉపవాసం ఉండి పుట్ట వద్దకు వెళ్ళి పాలు పోసి పూజిస్తారు.

శుక్ల ఏకాదశి-పుత్రదా ఏకాదశి
 ఈ ఏకాదశికే లలితా ఏకాదశి అని కూడా పేరు. పుత్ర సంతానం కావాలనుకునేవారు ఈనాడు ఏకాదశీ వ్రతాన్ని ఆచరించడం మంచిది.

శ్రావణ పూర్ణిమ - రాఖీపూర్ణిమ
 సోదరుడి సుఖసంతోషాలు కోరుతూ అక్కాచెల్లెళ్ళు సోదరుడి చేతికి రాఖీ కడతారు నుదుట బొట్టు పెట్టి.అనంతరం మిఠాయిలను తినిపిస్తారు. సోదరుడు సోదరి ఆశీర్వాదం తీసుకుని కానుకలివ్వడం ఆనవాయితీ. అంతే గాక ఈ దినం పాత యజ్ఞోపవీతాన్ని విసర్జించి కొత్తది ధరించడం ఆచారం.

పూర్ణిమ - హయగ్రీవ జయంతి
 వేదాలను రక్షించేందుకు శ్రీమహావిష్ణువు హయగ్రీవ రూపం ధరించినట్లు పురాణ కథనం.హయగ్రీవ జయంతి ఐన ఈ రోజు హయగ్రీవుడిని పూజించి శనగలు,ఉలవలతో గుగ్గిళ్ళు తయారుచేసి నైవేద్యం సమర్పిస్తారు.

కృష్ణవిదియ- శ్రీ రాఘవేంద్రస్వామి జయంతి
 క్రీ.శ.1671 వ సంవత్సరంలో విరోధికృత్ నామ సంవత్సరం శ్రావణ బహుళ విదియనాడు శ్రీ రాఘవేంద్రస్వామివారు సజీవంగా సమాధిలో ప్రవేశించారు.

కృష్ణపక్ష అష్టమి - శ్రీకృష్ణాష్టమి

శ్రీమహావిష్ణువు ధరించిన అవతారాల్లో ఎనిమిదో అవతారమైన శ్రీకృష్ణ పరమాత్మ జన్మించిన దినం. దీనినే కృష్ణాష్టమి లేదా జన్మాష్టమి అని పేర్లు. ఈ రోజు పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం కృష్ణుడిని పూజించి నైవేద్యంగా పాలు, పెరుగు , మీగడ, వెన్నలను సమర్పించడం ఆచారం.

కృష్ణపక్ష ఏకాదశి - కామిక ఏకాదశి
 ఈ దినం ఏకాదశీ వ్రతం, ఉపవాసాలను పాటించడంతో పాటు నవనీతమును దానం చేయడం మంచిది.ఈ ఏకాదశీ వ్రతాన్ని పాటించడం వల్ల మనసులో ఉన్న కోరికలన్నీ నెరవేరుతాయని శాస్త్ర వచనం.

కృష్ణపక్ష అమావాస్య - పోలాల అమావాస్య
 ఇది వృషభాలను పూజించే పండుగ. కాగా కాలక్రమేములో పోలేరమ్మ అనే గ్రామ దేవతలను ఆరాధించే పర్వదినంగా మార్పు చెందింది. ఇది ఆచరించడం వల్ల పిల్లలకు అకాల మృత్యు భయం తొలగిపోతుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి.

Wednesday 26 July 2017

నాగపంచమి వ్రతకధ



ఏటా శ్రావణమాసం శుద్ధ పంచమి రోజును నాగ పంచమి అంటారు. బ్రహ్మదేవుడు, ఆదిశేషువును అనుగ్రహించిన రోజు అన్నమాట.''నాగులచవితి'' మాదిరిగానే ''నాగ పంచమి'' నాడు నాగ దేవతను పూజించి, పుట్టలో పాలు పోస్తారు. నాగ పంచమి రోజున నాగ దేవతను పూజించిన వారికి, సంవత్సరం పొడుగునా ఏ సమస్యలూ లేకుండా, అన్నీ సవ్యంగా నెరవేరుతాయి. అంతా అనుకూలంగా ఉంటుంది.

చలి చీమ నుండి ... చతుర్ముఖ బ్రహ్మ వరకు , రాయి - రప్ప , చెట్టు -చేమ , వాగు-వరద , నీరు -నిప్పు , అన్నిటా అందరిలోనూ దైవత్వాన్ని దర్శించే విశిష్టమైన సంస్కృతి హిందువులది . హిందువుల దృష్టిలో పాము కుడా పరమాత్మ స్వరూపమే . వేయి పడగల ఆదిశేషుడు విష్ణుమూర్తికి పాన్పు . వాసుకి పరమేశ్వరుడి కన్టాభరణమ్ . వినాయకుడు నాగ యజ్ఞోప వీతుడు.

నాగ జాతి జనము :

కశ్యప ప్రజాపతికి , కద్రువ దంపతులకు .. అనంతుడు ,తక్షకుడు , వాసుకి , ననినాగుడు , శంఖుడు , కర్కోటకుడు , ఉగ్రకుడు పిందారకుడు , హహుషుడు , ఐరావతుడు మొదలగు వారు జన్మించి కనబడిన వారినల్లా కాటు వేస్తూ భయభ్రాంతులను చేయసాగారు .

దాంతో సకల దేవతలు బ్రహ్మను వేడుకోగా ఆయన కోపించి తల్లి శాపానికి గురై వారంతా నశిస్తారని శపించాడు . అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా విధాత ముందు వినమ్రులై " మమ్మల్ని మీరే సృష్టించి మాకీ విధంగా శాపమివ్వడం న్యాయమా " అని వేడుకున్నారు .

"విషయుక్తంగా పుట్టినంత మాత్రాన అందర్నీ కాటువేసి ప్రాణికోటిని నశింప జేయడం తప్పు కదా ' నిష్కారణంగా ఏ ప్రాణినీ హింసించరాదు . గరుడ మంత్రం చదివే వారిని , ఔషధమని సమేతులను తప్పించుకు తిరగండి .దేవతా విహంగ గణాలకు , జ్ఞాతులైన మీరు మీమీ స్థాన గౌరవాలను నిలిపుకోండి . వాయుభాక్షకులై సాదుజీవులు గా మారండి . మీ నాగులంతా ఆతలా వితల పాతాళ లలో నివాసం చేయండి" అని బ్రహ్మ శాసించగా వారంతా ఆయన ఆజ్ఞను శిరసావహించారు .

 దాంతో దెవత లంతా నాగులను ప్రశంసించారు . భూలోక వాసులంతా ప్రార్ధనలు చేశారు నాగులకు . దివ్య ప్రభావ సంపన్నమయిన నాగజాతికి కృతజ్ఞతాపూర్వకం గా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజచేయడం మొదలు పెట్టారు. పుట్టలో ఆవుపాలు , వడపప్పు , చలిమిడి , అరటిపండ్లు , కోడి గ్రుడ్లు జారవిడిచి నైవేద్యం గా సమర్పిస్తారు .

పార్వతీ దేవికి పరమేశ్వరుడు చెప్పినట్లు గా పురాణాలులో చెప్పడం జరిగినది .
ఓ పార్వతీ దేవి... శ్రావణ మాస శుక్ల పంచమినాడు నాగారాధన చేయడం అత్యంత శ్రేష్టమైనది. ఈ నాగపంచమినాడు ద్వారానికి ఇరువైపులా సర్ప చిత్రాలను గోమయంతో రాసి పూజ చేయడం ఎంతో శుభప్రదం. చతుర్థి రోజున ఉపవాస వ్రతాన్ని ఆచరించి పంచమి రోజున బంగారం వెండి, కర్రతోగానీ, లేదా మట్టితోగానీ వారి వారి తాహతుని అనుసరించి ఐదు పడగల పామును చేయించాలి. లేదంటే పసుపు, చందనంతోగానీ ఏడు తలల పాము చిత్ర పటములు గీచి ఆ రూపాలకు జాజి, సంపెంగ, గన్నేరు ఇత్యాది పుష్పాలతో పూజించాలి. పాయసము, పాలు నివేదన చేయాలని పరమేశ్వరుడు వివరించాడని పురాణాలు చెబుతున్నాయి.

శ్రావణమాసం, శుక్లపక్షంలోని పంచమి తిథి నాడు నాగపంచమి పండుగ వస్తుందని శాస్త్ర వచనం.అందుచేత శ్రావణమాసం న వచ్చే నాగపంచమి రోజున నాగదేవతను పూజించాలి. నాగచతుర్థి రోజున (నాగపంచమికి ముందురోజు) ఉపవాస వ్రతాన్ని ప్రారంభించాలి. గరుడ పంచమిగా పిలువబడే నాగపంచమి రోజున సూర్యోదయానికి ముందేలేచి శుచిగా స్నానమాచరించి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి.

ఇంటి గడప, పూజగదిని పసుపు, కుంకుమలు, పుష్పాలతో అలంకరించుకోవాలి. నాగదేవత ప్రతిమకు నేతితోనూ, పాలతోనూ అభిషేకం చేయించి పెరుగును నైవేద్యంగా పెట్టాలి. పూజ అయ్యాక బ్రాహ్మణుడికి తాంబూలం, పానకం, వడపప్పులతో సహా ఈ నాగప్రతిమను దానంగా ఇవ్వాలి. నాగపంచమి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి జాగరణ చేయాలి. ఈ విధంగా చేసిన వారికి నాగరాజులు అనుగ్రహిస్తారని పురాణాలు చెబుతున్నాయి. అంతేగాకుండా పాపాల నుంచి విముక్తి లభించడం, సర్ప భయం తొలగిపోవడం వంటివి జరుగుతాయి.

నాగ పంచమి వ్రత కథ

పూర్వము ధనవంతురాలైన ఒక గృహిణి వుడేది ... ప్రతిరోజూ సర్పాలు అనేకం వచ్చి తనను కాటు వేస్తున్నట్లు గా ఆమెకు కలలు వస్తున్నవి దానితో ఆమె భయకంపితురాలైంది . ఒక రోజున వారి కులగురువు వారి ఇంటికి వచ్చి ఆమె దీన గాధను విన్నారు . విని "అమ్మా " నువ్వు గతజన్మలో పుట్టలో పాలు పోసేవారిని చూసి ఎగతాళి చేశావు , అందువలన నీకు ఈ జన్మలో ఈ జాడ్యము సంక్రమించినది అని చెప్పి నివారణకోసం నాగపంచమి నోము నోయమని , పాముల భయం తొలగి పోతుందని చెప్పెను . ఆమె అట్లాగే నోచి ఆ స్వప్నాల భయం నుండి విముక్తురాలైనది . నాగపంచమి వ్రత కధల్లో ఇది ఒకటి .
ఈ కధ వెనుక ఒక సామాజిక మైన హితవు ఉన్నది .. ఇతరులకు ఎవ్వరికీ ఇబ్బంది కలగని విధంగా ఎవరైనా తన కుటుంబ ఆచారాన్ని తానూ పాతిస్తున్నట్లయితే వారిని పరిహసించకూడదు .. ఎవరి విశ్వాసము వారిది.

మన సంస్కృతిలో పాములు పూజింపబడుతున్నాయి. అలాగే యోగాలో కూడా ఇవి ఎంతో ముఖ్యమైన భూమిక పోషిస్తున్నాయి.. ఒక విధంగా చూస్తే, పాము ‘కుండలినికి’ సంకేతం. స్వభావం, కదలిక, నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల, పామును కుండలినికి సంకేతంగా చూస్తారు. ఇంకో అంశం ఏమిటంటే పాము జీవ పరిణామక్రమంలో చాలా ముఖ్యమయిన మలుపు. జీవపరిణామ క్రమంలో ‘శరీరం పరంగా కోతి ప్రముఖ స్థానంలో ఉంటుంది, అలాగే ‘శక్తి’ పరంగా పాము విశిష్ట స్థానంలో ఉంటుంది. మరో అంశం ఏమిటంటే పాములు కొన్ని రకాల శక్తులకు ఎంతో స్పందిస్తాయి. ఎక్కడ ధ్యానానికి అనుకూలంగా ఉంటుందో లేక యజ్ఞయాగాదులు నిర్వహింప బడుతుంటాయో అక్కడికి పాములు ఆకర్షింపబడతాయి. అలాగే పాములు గురించి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి.

స్వభావం, కదలిక, నిశ్చలత్వం వంటి విషయాల్లో కుండలినికి పాములతో ఉండే పోలిక వల్ల, పామును కుండలినికి సంకేతంగా చూస్తారు. అందుకే ఈ సంస్కృతిలో మీరు పాముని చంపడం నిషిద్ధం. భారతదేశంలో ఒక పాముని చంపినా, ఒక పాము మృతదేహాన్ని చూసినా దానికి అంతిమ సంస్కారం చేయడం ఆనవాయితీ. జీవపరంగా మనిషికి పాముకి ఎంతో దగ్గర సంబంధం ఉండటం వల్ల, ఈ సంస్కృతిలో పాము కూడా మనిషిలాగే ఎప్పుడూ సరైన అంతిమ సంస్కారాన్ని పొందుతూ ఉంది. అందువల్ల ఒక పాముని చంపడం అంటే అది హత్యతో సమానమే.

నాకు తెలిసినంత వరకూ పాము లేని గుడి అంటూ ఉండదు. ప్రతి గుడిలో ఎక్కడో ఒక చోట ఒక చిన్న పాము విగ్రహమైనా ఉంటుంది. అన్ని ప్రాచీన దేవాలయాల్లో పాములన్నాయి. క్రొత్తగా, షాపింగు కాంప్లెక్సులలా కట్టిన కొన్ని దేవాలయాల్లో పాములు ఉండకపోవచ్చు. కాని మీరు ఏ పురాతన దేవాలయాన్ని సందర్శించినా అక్కడ పాముల కోసం ప్రత్యేకంగా ఓ స్థానం ఉంటుంది. ఎందుకంటే అది జీవ పరిణామక్రమంలో చాలా ముఖ్యమయిన మలుపు. అంతేకాకుండా, ఎన్నో విధాలుగా జీవ ప్రేరేపణకు కారణం అదే.

కాలసర్ప యోగం  ఉన్నవారు, ప్రత్యేకంగా నాగ పంచమి రోజున నాగ దేవతకు విశేష పూజలు నిర్వహిస్తారు. కాలసర్ప యోగం  ఉన్నవారికి అనేక కష్టాలు ఎదురౌతాయి. శారీరక అనారోగ్యం కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ఇబ్బందులు ఎదురౌతాయి. సవ్యంగా జరగాల్సిన పని కూడా ఆగిపోతుంది. ఊహించని అవరోధాలు వస్తుంటాయి. ఏదో రూపంలో మానసిక అశాంతి కలుగుతుంది. అలాంటప్పుడు, నాగ పంచమి నాడు పుట్టలో పాలు పోసి, కాలసర్ప దోష శాంతి చేయించుకోవాలి. దాంతో దోష నివారణ జరిగి, సుఖసంతోషాలు అనుభూతికి వస్తాయి

🌷సర్వేజనాఃసుఖినోభవంతు 💐

Tuesday 31 January 2017

శనిత్రయోదశి


శనిత్రయోదశికి ఎందుకింత విశిష్టత అంటే...
శనివారం ఇటు శని భగవానునికీ, అటు విష్ణుమూర్తికీ ప్రీతిపాత్రమైన రోజు. ఇక త్రయోదశి శివునికి ఇష్టమైన తిథి. అలా
స్థితి, లయకారులిద్దరికీ ఇష్టమైన రోజుగా శనిత్రయోదశి స్థిరపడింది. ఈ రోజున శనీశ్వరునికి తైలాభిషేకం శుభప్రదం.
~~~~~~~~~~~~
నవగ్రహాలలో ఏడవ వాడైన శనీశ్వరుడు సూర్యభగవానునికి ఛాయాదేవికి కలిగిన కుమారుడని పురాతన తాళపత్రాలు చెబుతున్నాయి అందుకే ఆయనను సూర్యపుత్రడు అనీ, ఛాయాసుతుడు అనీ పిలుస్తారు. .  సోదరుడు యమధర్మరాజు, సోదరి యమున
----------------
నీలాంజన సమాభాసం
రవి పుత్రం యమాగ్రజం
ఛాయా మార్తాండ సంభూతం
తమ్ నమామి శనైశ్చరం  
-----------------
ఈ శని గ్రహం ఒకో రాశిలోనూ దాదాపు రెండున్న సంవత్సరాల పాటు సంచరిస్తూ 12 రాశులనీ చుట్టుముట్టడానికి దాదాపు 30 సంవత్సరాలు పడుతుంది. ఇంత  నిదానంగా సంచరిస్తాడు కాబట్టి ఈయనకు మందగమనుడు అన్న పేరు. ఇతర పేర్లు కృషాణు, శౌరి, బభ్రు,రోద్రాంతక, సూర్యపుత్ర.
నిజానికి శని భగవానుడిని మనసారా పూజించి ఆరాధించే భక్తులను కష్టాలనుంచి గట్టెక్కించే కళంకములేని కరుణామూర్తి శనీశ్వరుడని భక్తుల విశ్వాసం.
బ్రహ్మాండ పురాణంలో తెలుపబడిన "నవగ్రహ పీడహర స్తోత్రం":
||సుర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః మందచారః ప్రసన్నాత్మా పీడం హరతు మే శని: |
|| ఓం శం శనయేనమ:||
|| ఓం నీలాంబరాయ విద్మహే సూర్య పుత్రాయ ధీమహి తన్నో సౌరి ప్రచోదయాత్ ||
|| ఓం ప్రాం ప్రీం ప్రౌం శం శనైశ్వరాయ నమః ||
శని గాయత్రీ మంత్రం:
ఓం కాకథ్వజాయ విద్మహే ఖఢ్గ హస్తాయ ధీమహి తన్నో మంద: ప్రచోదయాత్.

|| ఓం శనైశ్వరాయ విద్మహే సూర్యపుత్రాయ ధీమహి తన్నో: మంద: ప్రచోదయాత్ ||
కిషోర్ శర్మ యాయవరం

Friday 13 January 2017

భోగి పండుగ సందర్భంగా

 

🍀భోగి లేదా భోగి పండుగ అనునది ఆంధ్రులు జరుపుకునే ఒక ముఖ్యమైన పండుగ. ఆంధ్రులు పెద్ద పండుగగా జరుపుకునే మూడు రోజుల సంక్రాంతి పండుగలో మొదటిరోజును భోగి అంటారు. భోగి పండుగ సాధారణంగా జనవరి 13 లేదా జనవరి 14 తేదిలలో వస్తుంది. దక్షిణాయనంలో సూర్యుడు రోజు రోజుకి భూమికి దక్షిణం వైపుగా కొద్ది కొద్దిగా దూరమవుతూ దక్షిణ అర్ధగోళంలో భూమికి దూరం అవుట వలన భూమిపై బాగా చలి పెరుగుతుంది. ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు, ఉత్తరాయణం ముందురోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు అందరు వేయటం వలన ఈ రోజుకు భోగి అనే పేరు వచ్చింది.

*🌷విశేషాలు🌷*

🍀సంక్రమణ మహాపర్వానికి ముందు రోజుకి ఒక ప్రాధాన్యం ఉంది. దీనికి భోగిపర్వం అని పేరు. అయితే భోగము అనే మాటకు అర్థం ఏమిటంటే అనుభవము అని. ఆనందంగా దేనిని అనుభవిస్తామో లేదా దేనిని అనుభవించడం వల్ల ఆనందం పొండుతామో దానిని భోగము అనాలి. అలాంటి భోగములు అనుభవించవలసిన రోజుని భోగి అంటారు. నిజమైన ఆనందాన్ని అనుభవించడమే నిజమైన భోగం. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి ఆనందం. సామాన్యుల ఆనందాలు వేరు. వాళ్ళకి లౌకిక విషయాలు దొరికితే అది భోగం. ఆ విషయంతో విసుగు కలిగితే మరో విషయం లభించాలని. కానీ ఏది లభిస్తే మరి ఇంకేదీ కావాలని అనిపించదో, ఏది పరిపూర్ణమైన ఆనందమో అదే నిజమైన భోగం. అలాంటి భోగం యోగం వల్లనే లభ్యం అవుతుంది. అందుకే యోగులే భోగులు కాగలరు. అలాంటి దివ్య భోగం ఈరోజున అమ్మ గోదాదేవి ఆండాళ్ళమ్మ పొందినది. అదేమిటంటే పరమాత్మ ప్రాప్తి. రంగనాథుని చేపట్టినది. రంగనాథుని అనుగ్రహాన్ని పొందినది. రంగనాథుని సాంగత్యం అనబడేటటువంటి ఆ కైవల్యానందం అనే భోగాన్ని అమ్మ పొందినది కనుక ఈరోజు భోగి అనే పేరు భక్తి సాంప్రదాయం పరంగా నిర్వచించేవారు చెబుతారు. సరిగ్గా ఈ రోజుతో ధనుర్మాసం పూర్తి అవుతున్నది. తర్వాతు రీహ్య్ నుంచి మకర మాసం వస్తున్నది సౌరమానం ప్రకారంగా. ఈ ధనుర్మాస వ్రతమంతా ఈరోజు పూర్తీ జరిగి దాని ఫలితంగా అమ్మవారు స్వామియొక్క అనుగ్రహాన్ని పొందినది.

*🌷భోగి మంటలు🌷*

🍀చలికాలంలో అత్యంత చలిగా ఉండే రోజు భోగి. ఈ రోజున ఆంధ్రులు మంటలు వేసి చలికాచుకుంటారు, ఈ మంటలనే భోగి మంటలు అంటారు. భోగిమంటలకు ఎక్కువగా తాటిఆకులను ఉపయోగిస్తారు. ఈ ఆకులను భోగికి కొన్ని రోజుల ముందే కొట్టుకొని తెచ్చి భోగిమంటల కొరకు సిద్ధం చేసుకుంటారు. అనేక ప్రాంతాలలో ప్రత్యేకంగా భోగిమంటల కొరకు తాటాకు మోపులను ఇళ్ళవద్దకే తెచ్చి విక్రయిస్తున్నారు. వీటితో పాటు మంటలలో మండగల పనికిరాని పాత వస్తువులను ముందురోజు రాత్రికి సిద్ధం చేసుకుంటారు. తెల్లవారుజామున సాధారణంగా 3 గంటల నుంచి 5 గంటల మధ్యన ఎవరి ఇంటి ముందువారు ఈ మంటలు వేయడం ప్రారంభిస్తారు.

*🌷కొత్త బట్టలు🌷*

🍀ఈ పండుగనాడు ఆంధ్రులు కొత్తబట్టలు ధరించడం ఒక సంప్రదాయంగా ఉంది. తెల్లవారుజామున భోగిమంటల వద్ద చలికాచుకున్న చిన్నా పెద్దలు భోగిమంటల సెగతో కాచుకున్న వేడినీటితో లేదా మామూలు నీటితో తలస్నానం చేసి కొత్తబట్టలు ధరిస్తారు.

*🌷ముగ్గులు🌷*

🍀పండుగ నెలలో ముగ్గులు ప్రతిరోజు వేస్తారు, కాని భోగి రోజు ముగ్గు ఒక ప్రత్యేకత, ముగ్గువేసే వారికి ఇష్టం కూడిన మరింత కష్టం, సాధారణంగా ముగ్గు వేసే చోటనే భోగి మంటలు వేస్తారు, భోగి మంటల వలన చాలా కసువు తయారవుతుంది. ఆ కసువు అంతా పారబోసి కడిగి ముగ్గువేయడం కొంచెం కష్టంతో కూడుకొన్నప్పటికి ఇష్టమైన పనులు కాబట్టి చాలా ఆనందంగా చేస్తారు, రోజు వేసే ముగ్గుల కన్నా ఈ రోజు మరింత అందంగా రంగు రంగుల రంగవల్లికలేస్తారు.

*🌷భోగి పళ్ళు🌷*

🍀భోగి పండుగ రోజు పిల్లలపై రేగు పండ్లు పోసి ఆశీర్వదిస్తారు, అందుచేత ఈ పళ్ళను భోగి పళ్ళు అంటారు, భోగి పళ్ళ ఆశీర్వాదాన్నీ శ్రీమన్నారాయణుడి ఆశీస్సులుగా భావిస్తారు.

*🌷భోగి పులక🌷*

🍀కొన్ని ప్రాంతాలలో భోగి రోజున రైతులు తమ సాగుభూమికి ఆనవాయితీగా కొంతమేర సాగునీరు పారించి తడి చేస్తారు, ఒక పంట పూర్తయిన తదుపరి మళ్ళీ పంట కొరకు సాగుభూమిలో నీరు పారించడాన్ని పులకేయడం అంటారు, ఆనవాయితీగా భోగి రోజున పులకేయడాన్ని భోగి పులక అంటారు.

*🌷కోడి పందాలు🌷*

🍀కొన్ని ప్రాంతాల్లో భోగి రోజున కోడి పందాలు వేయడం ఒక ఆనవాయితీగా వస్తుంది, పౌరుషానికి ప్రతీకగా ఉండే కోళ్లు పోటీలో ప్రాణాలను పణ్ణంగా పెట్టి పోరాడుతాయి, ఈ పోటీలను చూసేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తారు. పోటీలో పాల్గొనే కోళ్లపై పందాలు కాస్తారు. తాహత్తుకు మించి మితిమీరిన పందాలు కాయడం వలన కలిగే అనర్ధాల వలన పందాలు కాయడంపై నిషేధాంక్షలు ఉన్నాయి.

*🌷గాలిపటాలు🌷*

🍀భోగి రోజున పిల్లలు చాలా ఆనందంగా గాలిపటాలు ఎగురవేస్తారు, వివిధ రకాల గాలిపటాలు తయారు చేసి లేదా కొనుక్కొని ఎగరవేయడంలో పోటీపడతారు.

*🌷సెలవు🌷*

🍀భోగి రోజు దాదాపు విద్యార్థులందరికి సెలవు ఉంటుంది, వేరువేరు ప్రాంతాలకు చదువుల కోసం వెళ్ళిన విద్యార్థులు భోగికి ముందే తమ స్వంత ఊరు చేరుకుంటారు.


భోగి యొక్క విశిష్టత



భోగి అంటే భోజనం
భోగి అంటే దేవునికి భోగం
భోగి అంటే కుటుంబాలన్నీ భోగభాగ్యాలతో తులతూగడం
భోగి అంటే పాతకు శలవు పలికి కొత్త జీవితాన్ని ప్రారంభించడం
భోగి అంటే పిల్లలకి భోగంగా భోగిపళ్లు పోయడం
భోగి అంటే అన్నిటినీ అంగరంగవైభవంగా ఆనందించడం

భోగి అంటే సూర్యుణ్ని ఆరాధించే అతి పెద్ద ఉత్సవం. సంక్రాంతి పండగ వచ్చిందంటే తెలుగు లోగిళ్లన్నీ కళకళ లాడుతుంటాయి. కొత్త పంటలు ఇంటికి రావడం, అల్లుళ్లు, కూతుళ్లు, మనుమలు... ఇంటి నిండా ఆత్మీయులు, సన్నిహితులు... అబ్బో... ఆ వేడుక చూడడానికి ఇంద్రుడికున్న వెయ్యి కళ్లు అద్దెకు తెచ్చుకున్నా కూడా చాలవేమో. పిల్లల ఆటపాటలు, బావలను ఆటపట్టించే మరదళ్లు, మామగారిని కోరికలు కోరే కొత్త అల్లుళ్లు, అందరికీ రకరకాల పిండివంటలు తయారుచేసే అమ్మమ్మలు, మేనత్తలు... ఇవన్నీ పండగ సంబరాలను ఆస్వాదించేలా చేస్తాయి. ఏ ఇంట చూసినా అరిసెల పాకం వాసన నాసికాపుటాలను సోకుతుంది. లోగిళ్లన్నీ ఉమ్మడి కుటుంబాలతో కళకళలాడతాయి. భోగి అంటేనే భోగమయిన పండగేమో అనిపిస్తుంది. ఈ పండగంత సంపన్నమైన పండగ మరొకటి లేదని నిరూపిస్తుంది.

పూర్వం ఈ సమయానికి పంటలన్నీ చేతికి వచ్చి గాదెలు నిండి లోగిలి ధాన్య రాసులతో నిండి నిండు చూలాలులా ఉండేది. ఈ పండుగను వేడుకగా మూడు రోజులు చేసుకునే ఆనవాయితీ ప్రారంభం అయ్యింది. ఈ పండగకి మూడు రోజులూ ఇంటిల్లిపాదీ పనివారితో సహా కొత్త దుస్తులు కొనుక్కునేవారు. నేతపనివారు చలికాలం లోనే వస్త్రాలు తేలికగా నేయగలరు. వేసవిలో అయితే దారాలు త్వరగా తెగిపోతాయి. అందుకే ఏడాదికి సరిపడా దుస్తులు ఈసమయం లోనే తీసుకునేవారు. ఆరోజుల్లో వస్తు మార్పిడి విధానమే ఉండేది. నేసిన వస్త్రాలకు ప్రతిగా ధాన్యాన్ని కుంచాలతో కొలిచేవారు. అలా వారు వీరు అనే తేడా లేకుండా అందరి ఇళ్లు సుసంపన్నంగా ఉండేవి.

భోగి మంటలు

భోగి సౌరమానాన్ని ఆధారంగా చేసుకున్న పండగ ఇది. తెల్లవారు జామునే భోగి మంట వేస్తారు. మంటలో పాత కర్రపుల్లలు, పిడకల దండలు, కొబ్బరిమట్టలు... లాంటి వాటితో పెద్దపెద్ద మంటలు వేస్తారు. ఇంట్లోని పాత వస్తువులను పారెయ్యలేక ఏడాదిపాటుగా దాచిపెడతారు. దానిని భౌతికలోభ గుణం అంటారు. ఈ సంధర్భంలో అన్నీ మంటలో వేయడం వల్ల వైరాగ్యం కలుగుతుందనేది. లౌకికార్ధం. సమాజానికి మేలు కలగటమే కాక అందరికీ వీటి అక్కరకు వచ్చే పని చేయటం ఇందులోని పరమార్ధం. పాత వస్తువులతో పాటు, మనషుల మనసుల్లో దాగి ఉన్న పాత అలవాట్లను సైతం అగ్నిలో దహింపచేసి, ఆ రోజు నుంచి కొత్త మార్గంలో ప్రయాణించడానికి సూచన. గ్రామాల్లో నాలుగు రోడ్ల కూడళ్లలో భోగిమంట వేస్తారు. అలా అందరూ ఒకచోట చేరటం వలన సమైక్యత ఏర్పడుతుంది. ఈ మంటలో వేసిన వస్తువులన్నీ పూర్తిగా కాలిపోయిన తరవాత, దాని మీదే నీళ్లు కాచుకుని స్నానాలు చేస్తారు. ఈ రోజున మంట వేసుకోవటం వెనుక కూడా ఆరోగ్య రహస్యం దాగి ఉంది. సరిగ్గా భోగితో దక్షిణాయనం పూర్తయ్యి ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. చలి కూడా వెనకపడుతుంది. ఒక్కసారిగా వాతావరణం వేడిగా మారుతుంది. ఆ వేడిని తట్టుకోవడం కోసమే ఈ మంట వేసుకునే సంప్రదాయం వచ్చి ఉండవచ్చునని ఆధ్యాత్మికవేత్తల అభిప్రాయం. వీటి నుండి వచ్చే పొగ ఆరోగ్యం కలిగించేదే కాని హాని కలిగించేది కాదు. ఈ మంట వేయడానికి పిల్లలందరూ ఇంటింటికీ వెళ్లి పిల్లల్నందర్నీ నిద్రలేపి పరాచికాలాడుకుంటూ, చలి కాచుకుంటూ పరమానందం చెందుతారు.

భోగి రొజున తలంటు

తల మాడుపై ఉండే బ్రహ్మరంధ్రం మీద నువ్వులనూనె పెట్టి తల్లి తలంటు పోయాలి. ఆ రంధ్రం లోకి నూనె చేరటం ద్వారా చైతన్యం కలుగుతుంది. తప్పనిసరిగా కుంకుడుకాయల రసంతోనే తలంటి, తల ఆరటం కోసం సాంబ్రాణి పొగ వేసి జుట్టు ఆరబెట్టాలి. దీనివల్ల కుదుళ్లు గట్టిపడతాయి. ఆ తరువాత పిల్లలకు నూతన వస్త్రాలు వేస్తారు. సూర్యునికి ఇష్టమయిన పాయసం తప్పనిసరిగా చేస్తారు. సంక్రాంతి అమావాస్య నాడు వచ్చి, అయనం మార్పు జరుగుతుంది. పితృకార్యాలు చేయడానికి మంచిది. ఆ కార్యాలు చేయవలసిన వాళ్లు వాటికి సంబంధించిన వంటకాలన్నీ ఏర్పాటు చేయాలి. అందువల్ల భోగి నాడు సంబరాలు చేసుకోవాలి. ఏ బాధలు పోవాలనే ఆకాంక్షతో ఈవిధంగా చేస్తారు.

అమ్మ వంటలు పూర్తి చేయగానే పిల్లలు లొట్టలు వేసుకుంటూ పిండివంటలు కడుపునిండా తింటారు. సాయంత్రం అయ్యేసరికి భోగిపళ్లకు సిద్ధం అవుతారు. భోగం అంటే పిల్లలకు భోగం చేయడం. పిల్లలకు భోగి మూడిటినీ కలిపి తలచుట్టూ మూడు సార్లు తిప్పి తల మీద పోస్తారు. ఇంట్లోని పెద్ద వాళ్ల తరువాత పేరంటాళ్లు కూడా పోస్తారు. కొన్ని ప్రాంతాలలో రేగుపళ్లు, చిల్లరడబ్బులు, కొత్తబియ్యం, తేగముక్కలు, చెరకు ముక్కలు, పాలకాయలు, పచ్చి శనగ కాయలు, పూల రేకలు అన్నీ కలిపి పోస్తారు. దీనివల్ల పిల్లలపై దృష్టి దోషం పోతుందనేది విశ్వాసం. పిల్లలు కూర్చునే పీట కింద ఇంట్లో తయారు చేసుకున్న పిండివంటన్నీ వేస్తారు. వాటిని తరువాత ఇంట్లో నమ్మకంగా పనిచేసే వారికి ఇచ్చేస్తారు. చివర్లో పేరంటాళ్లకి వాయినం ఇస్తారు. ఇందులో కూడా ఆరోగ్యానికి ఉపకరించే వాటిని (మొలకెత్తిన శనగలు తమలపాకులు, వక్క) ఇస్తారు. మన పండుగల వెనుక ఆరోగ్యం దాగి ఉంది. అందుకే ఈ వంటకాలు, వాయినాలు ఆనవాయితీగ వస్తున్నాయి. కొన్ని చోట్ల భోగి పళ్లు పోయడానికి ముందు కొబ్బరి ముక్కలు చిన్నచిన్నగా తరిగి వాటిని దండగా గుచ్చి పిల్లలకి మెడలో వేస్తారు. భోగిపళ్ల ప్రహసనం పూర్తయ్యాక ఆ ముక్కలు పిల్లలు తినేస్తారు.

ప్రతి పండగ వెనక పరమార్ధం, లౌకికం ఉంటాయి. మనవలందరూ ఇంటికి చేరడంతో తాతయ్యలకు, అమ్మమ్మలకు పట్టరాని ఆనందం కలుగుతుంది. అదే వారికి రెట్టింపు ఉత్సాహాన్ని కూడా ఇస్తుంది. ఎక్కడేక్కడో ఉన్న వారంతా ఈ సంధర్భంగా ఒకచోటికి చేరుకుని, సంబరాలు చేసుకోవటం, ఇంటిల్లిపాదీ ఒకరినొకరు ఆట పట్టించుకోవటం... ఇవన్నీ వారికి నూతన శక్తినిస్తాయి. మళ్లీ పండగ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ఎదురుచూస్తూ ఉంటారు. అసలు పండగల వెనక ఉన్న పరమార్ధమే ఇది. ఈ హడావిడి సమాజంలో ఇటువంటి పండగలే అందరినీ ఒకచోటికి చేరుస్తున్నాయేమో. శ్రీరస్తు శుభమస్తు.

అల్లుడితో భోజనం, కొడుకుతో చదువు ఉపయోగం

అల్లుడితో భోజనం అంటే మామగారికి భోగం. ప్రతిరోజూ సాధారణమైన భోజనం చేసి విసుగెత్తిన మామగారు. అల్లుడి రాకతో ఇంట్లో వండే పిండివంటలన్నీ కడుపునిండా భుజిస్తారు. కొడుకుతో చదువు అంటే పిల్లాడితో మళ్ళీ నేర్చుకోవటం. ఏనాడో వదిలేసిన చదువును మళ్ల్లీ పిల్లలతో పాటు అభ్యసించడం అన్నమాట. మొత్తం మీద అందరికీ ఇది ఎంతో ఆనందదాయకమైన పండుగ. వృత్తి పనులు చేసే మిరాసీదార్లు ఏడాది పొడవునా చేసిన పనికి ప్రతిఫలంగా ధనం అడిగేవారుకాదు. ఈ పండుగ సమయంలో ఏడాదికి సరిపడాధాన్యం పంట నూరుస్తుండగానే తీసుకువెళ్లేవారు.

సూర్యారాధన సంరంభం

ప్రతి నెల సంక్రమణానికి ముందు వచ్చే రోజు భోగి. సూర్యుడు దక్షిణాయనంలోంచి ఉత్తరాయణంలోకి మారతాడు కనక ఈ సంక్రమణం ఘనంగా నిర్వహిస్తారు. ఇది మాఘమాసానికి ముందు వస్తుంది. మాఘమాసంలో స్నానాలు. సూర్యారాధన జరుగుతాయి. జపతపాలకి, ప్రతిష్ఠలకి, దేవవ్రతాలకి ఈ నెల ప్రత్యేకం. 27 నక్షత్రాల అమృతం పూర్తయ్యాక వచ్చేదే భోగి. రేగు పళ్లను అర్కఫలాలు అంటారు. పిల్లలకు భోగిపళ్లు పోయడమంటే సూర్యునికి ఆరాధన చేయటం.

🔥🔥భోగి శుభకాంక్షలు💐💐💐

​భోగి పండుగ రోజు మంటలు వేయడంలోని పరమార్థంఏమిటి?​



సూర్యుడు దక్షిణాయనంలో ఉండే చివరి రోజు భోగి. ఈ రోజు చలి తారస్థాయిలో ఉంటుంది కాబట్టి, భోగిమంటలు వేసుకోమని సూచిస్తుంటారు. భోగినాటికి ఉధృతంగా ఉండే చలి వల్ల క్రిమికీటకాలు ప్రబలే అవకాశం ఉంది కనుక, భోగిమంటలు వాతావరణంలోకి కాస్త వెచ్చదనాన్ని నింపుతాయి. పైగా సంక్రాంతినాటికి పంట కోతలు పూర్తవడంతో, పొలాల నుంచి పురుగూ పుట్రా కూడా ఇళ్ల వైపుగా వస్తాయి. వీటిని తిప్పికొట్టేందుకు కూడా భోగిమంటలు ఉపయోగపడతాయి.

భోగి మంట వెనక మరో విశేషం కూడా ఉంది. సంక్రాంతి రోజు నుంచి సూర్యుడు ఉత్తరాయణంలోకి మళ్లుతాడు. దీని వలన ఎండ వేడిలో ఒక్కసారిగా చురుకుదనం మొదలవుతుంది. పరిసరాలలోని ఉష్ణోగ్రతలలో ఒక్కసారిగా వచ్చే ఈ మార్పుని తట్టుకునేందుకు శరీరం ఇబ్బంది పడుతుంది. దీంతో జీర్ణసంబంధమైన సమస్యలు ఏర్పడవచ్చు.

 భోగిమంటలతో రాబోయే మార్పుకి శరీరాన్ని సన్నద్ధం చేసినట్లవుతుంది.

ఇక్కడ ఒక విషయం గమనించాలి. భోగిమంటలు అంటే కేవలం చలిమంటలు కాదు. అగ్నిని ఆరాధించుకునే ఒక సందర్భం. కాబట్టి భోగిమంటలు వేసుకునేందుకు పెద్దలు కొన్ని సూచనలు అందిస్తుంటారు. హోమాన్ని ఎంత పవిత్రంగా రాజేస్తామో భోగిమంటను అంతే పవిత్రంగా రగిలించాలట.

ఇందుకోసం సూర్యాదయానికి ముందే నిద్రలేచి స్నానమాచరించాలి. ఇలా శుచిగా ఉన్న వ్యక్తి చేతనే భోగి మంటని వెలిగింపచేయాలి. అది కూడా కర్పూరంతో వెలిగిస్తే మంచిది.

ఇక భోగిమంటల్లో వేసే వస్తువుల గురించి కూడా కాస్త జాగ్రత్త వహించాలి. ఒకప్పుడు భోగిమంటల్లో చెట్టు బెరడులు, పాత కలప వేసేవారు. ధనుర్మాసమంతా ఇంటి ముందర పెట్టుకున్న గొబ్బిళ్లను, పిడకలుగా చేసి భోగి మంటల కోసం ఉపయోగించేవారు. ఇవి బాగా మండేందుకు కాస్త ఆవు నెయ్యిని జోడించేవారు. ఇలా పిడకలు, ఆవునెయ్యితో ఏర్పడే మంట నుంచి వచ్చే వాయువులో ఔషధగుణాలు ఉంటాయని ఆయుర్వేదం చెబుతోంది.

కానీ కాలం మారింది. రబ్బర్‌ టైర్లు, విరిగిపోయిన ప్లాస్టిక్‌ కుర్చీలని కూడా భోగిమంటల్లో వేస్తున్నారు. వాటిని భగభగా మండించేందుకు పెట్రోలు, కిరసనాయిల్ వంటి ఇంధనాలని వాడేస్తున్నారు.


ఇలాంటి భోగిమంటల వల్ల వెచ్చదనం మాటేమోగానీ, ఊపిరితిత్తులు పాడవడం ఖాయమంటున్నారు. పైగా రబ్బర్‌, ప్లాస్టిక్, పెట్రోల్, కిరసనాయిల్‌ వంటి పదార్థాల నుంచి వెలువడే పొగతో అటు పర్యావరణమూ కలుషితం కావడం ఖాయం.

మన పూర్వీకులలాగా పిడకలు, చెట్టు బెరడులు, ఆవునెయ్యి ఉపయోగించి భోగిమంటలు వేయలేకపోవచ్చు. కనీసం తాటి ఆకులు, పాత కలప, ఎండిన కొమ్మలు వంటి సహజమైన పదార్థాలతోనన్నా భోగిమంటలు వేసుకోమన్నది పెద్దల మాట. అలా నలుగురికీ వెచ్చదనాన్ని, ఆరోగ్యాన్నీ అందించే భోగిమంటలు వేసుకోవాలా! లేకపోతే నాలుగుకాలాల పాటు చేటు చేసే మంటలు వేసి సంప్రదాయాన్ని ‘మంట’ కలపాలా అన్నది మనమే నిర్ణయించుకోవాలి.

Monday 9 January 2017

ముక్కోటి ఏకాదశి నాడు చదువ వలసిన మంత్రం


ఎకాదశ్యాం నిరాహారో భూత్వాహా మపరేహని \

              భోక్ష్యామి  పుండరీకాక్ష  \

                   శరణం మే భవాచ్యుతా ||

అనే మంత్రాన్ని చెప్పి దేవునికి
పుష్పాంజలి సమర్పిన్చాలి

సోమవారం శివునికి ప్రీతికరముగ భావిస్తాము.

నిజానికి ప్రతికాలము పరమేశ్వరార్చనకు ప్రాముఖ్యతన్న్నిస్తాయి. అయితే
"శివ పురాణము " ప్రకారం "ఆదివారం" శివారధనకు చాలా ప్రాధాన్యం. ఆ రోజున రుద్రాభిషేకాలు నిర్వహించడం ఆయురారోగ్య ఐశ్వర్యప్రదం.
అది అలాగ ఉండగా, సోమవారం " సౌమ్యప్రదోషం" గా శివుని ఆరాధించడం విశేష ఫలప్రదమని పురాణాది శాస్త్రాల వచనం.
సోమవారమ్నాడు ఉదయాన్నే నిత్య కర్మలు పూర్తిచేసి, ఉపవాసముండి సాయంకాలం శివున్ని ఆరధించి, నక్షత్రోదయ సమయాన్న ఈశ్వర నివేదితమైన వంటని తినడం నక్త వ్రతం అంటారు. ఇది ఐశ్వర్యకరం, సర్వాభీష్ఠప్రదం!
స్కందాది పురాణాలలో సోమవారవ్రతం గురించి విశేషముగ చెప్పారు. పై నియమముతో 16 సోమవారాలు చేస్తే అన్ని గ్రహదోషాలు పోవడమేకాక, అన్ని అభిష్టాలు నెరవేర్తాయి.
ప్రత్యేకించి ఈ సోమవారాలు శ్రావణ మాసంలోనూ, కార్తీకంలోను మరీ విశేషం. నభోవాస ఇందువాసరే - శ్రావణ మాస సోమవారాలలో ఈశ్వరారాధన మహైశ్వర్య ప్రదం
కార్తీక మాసం అంతా ' నక్తనియమం' గొప్పది. అలాగ కుదరనప్పుడు కనీసం సోమవారాలనాడు తప్పనిసరిగా చెయ్యాలి.
ఆ సాయంకాలార్చనలో, స్వామిని బిల్వాలతో అర్చన చెయ్యడం సంప్త్ప్రదాయకం.
ఇందువాసరే వ్రతంస్థిత్వా
నిరాహారో మహేశ్వరౌ
నక్తం హౌష్యామి......అని శాస్త్ర వచనం.
లక్ష్మి ప్రదమైనది ఇందువాసరం. (సోమవారం)
పార్వతిసహిత పరమేశ్వరున్ని ఆర్ధించాలి.
"సోమ" శబ్దానికి " చంద్రుడు" అనే అర్ధమే కాక, స+ ఉమ = ఉమా సహితుడు అని శివపరమైన అర్ధము చెప్పవచ్చు
పార్వతి సహితుడైన పరమేశ్వరునుకి ఆరధన కార్తీక సోమవారాలలో విశేషం .
రామాద్యవతారాలలో శ్రి మహా విష్ణువు కూడా సదా శివుని అర్చించి, మనకు కారణ మార్గం ఉపదేశించారు.
శ్రీ రాముడు అగస్త్య మహర్షి ద్వారా " విరజా దీక్ష" ను స్వీకరించి, భస్మోద్ధుళితాం గుడై శివధ్యానంలో గడిపాడని "పద్మ పురాణం" చెప్తోంది.
అతడి దీక్షకు ఫలితముగ, సదాశివుడు పార్వతి సహితుడై సాక్షత్కరించి, దేవసభా మధ్యంలో, శ్రీ రామునకు సందర్శాననందాన్నిచ్చాడు.
శివూని సహస్ర నామాలతో సంస్తుతించి, ప్రసన్నుని చేసుకున్నాక తిరిగి, ఏకాంత దర్శనమిచ్చి రామునకు శివుడు చెప్పిన విషియాలే "శివ గీత" గా ప్రసిద్ధమయ్యాయి.
శ్రీ కృష్ణుడు కుడా ఉపమన్యు మహర్షి వలన శివ దీక్షను పొంది, శివారాధన చేసినట్లు, శివధర్మాలను అర్జున ధర్మరాజాదులకు ఉపదేశించినట్లు " మహాభారతం " చెప్తోంది.
శివస్య హృదయం విష్ణుః
విష్ణోశ్చ హృదయం శివః
శివుని హృదయం విష్ణువు, విష్ణువు హృదయం శివుడు.
శివుడు రామ కృష్ణాది విష్ణువు నామ జపం లో ఆనందతుడువుతుంటే, విష్ణువు శివార్చనలో ఆనందిస్తాడు. శివుడు పరమ వైష్ణవుడు. విష్ణువు పరమ శైవుడు.
కాబట్టి ఉభయుల పట్ల అభేద దృష్టితో దేవారధన సాగాలి.

Sunday 8 January 2017

ఉత్తరద్వారదర్శనంలో అంతరార్థం


ఉత్తరద్వారం నుంచి వెడుతుంటే మనకి వైకుంఠం గ్యారంటీ అనిపిస్తుంది. అంతమాత్రానికే గ్యారంటీ అయితే కాదనంకాదు కాని దాని వల్ల పాపాలు మాత్రం పోతాయి. అందులో సందేహం లేదు. కాని వైకుంఠానికి ఒకటే ద్వారం ఉందా? ఇది కొద్దిగా ఆలోచించవలసిన అంశం. ఆ పదాలని మనం శాస్త్రీయమైన అర్ధంతో చూస్తే అద్భుతమైన జ్ఞానం వస్తుంది.

ఉత్తరద్వారం - మిగిలిన మూడు ద్వారాలు లేక కాదు కాని వాటి ప్రవేశం వేరు. ఉత్తరద్వారం - ఉత్తరం అంటే జ్ఞానద్వారం. ఉత్తరం అంటే north అనేకాకుండా గొప్పది, ఉన్నతమైనది అని అర్ధం కూడా. సూర్యభగవానుడి గురించి చెప్తూ వేదం ఉత్తరాం దివం దేవః అని వర్ణించింది. ఉత్తరాం అంటే ఉన్నతం. ఉత్-తరాం. ఉత్-అంటే ఉత్కృష్టమైనదని అర్థం. ఉత్ - ఉత్తర - ఉత్తమ.

ఉత్తర అంటే గొప్పదని అర్ధం. ఉత్తరద్వారం అంటే గొప్పదైన ద్వారం. ఏ ద్వారం గుండా వెడితే పరమాత్మ వద్ద స్థిరంగా ఉండగలమో ఆ ద్వారం ఉత్తరద్వారం. అది జ్ఞానద్వారం. దాని లోంచి వెళ్ళగలిగేది ఎవరంటే శుద్ధసత్వసంపన్నులైన బ్రహ్మజ్ఞానులు మాత్రమే వెళ్ళగలరు.  ఇతరులు వెళ్ళలేరు. వారు ఉత్తరద్వారం గుండా వెడమని ప్రయత్నిస్తుంటే ఆ జ్ఞానాన్ని అడ్డుకున్నవాళ్ళు ఇద్దరున్నారు. అవి రజోగుణం, తమోగుణం ఇవి అడ్డుకుంటూ ఉంటాయి.

సాయుజ్యమోక్షమన్నది ఏదైతే ఉందో అది పరమాత్మలో లయమయ్యేవరకూ ఇంకా కొంచెం దూరం ఉంటూ ఉంటుంది. అందుకే అద్వైతం ఆ మోక్షాన్ని సంపూర్ణంగా ఒప్పుకోవు. దీన్నే భాగవతంలో చెప్తూ రసత్తమోదూషితులు అని జయవిజయులని వర్ణించారు. వాళ్ళు సత్వగుణాన్ని ఉత్తరద్వారంలోకి వెళ్ళకుండా అడ్డుకుంటున్నారుట.

మనలో కూడా సత్వగుణం సనకసనందాదులవలే భగవంతుడు వైపుకి వెళ్ళాలని ప్రయత్నిస్తుంటే మనలో ఉన్న రజోగుణతమోగుణాలు వెళ్ళనివ్వకుండా తోసేస్తూ ఉన్నాయి. అప్పుడు మనం వాటిని ప్రయత్నపూర్వకం క్రిందకి అణచెయ్యాలి. అప్పుడే స్వామే వచ్చి మనల్ని అనుగ్రహిస్తాడు. అది ఆ కథలో ఉన్న అసలు అంతరార్ధం.

ఉత్తరద్వారం తెరుకోవడమంటే జ్ఞానకవాటం తెరుచుకోవడం. అది తెరుచుకోవాలంటే రజోగుణ తమోగుణాలని తొలగించాలి. అదే అసలైన ఉత్తరద్వారప్రవేశం. అప్పుడే విష్ణుదర్శనం లభిస్తుంది.

ముక్కోటి ఏకాదశి....


ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. 
సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు.
సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గం' మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది.
ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే భగవద్దర్శనార్థం వేచి ఉంటారు.
ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు
కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి మూడు కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు.

ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణుడు అర్జునునికి ఇదే రోజున ఉపదేశించాడని విశ్వాసం ఉంది.

ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయి. ఈ రోజున ముఖ్యమైనవి ఉపవాసం, జాగరణ. అటు తర్వాత జపం, ధ్యానం.

విష్ణుపురాణం ప్రకారం ఇద్దరు రాక్షసులు తనకు వ్యతిరేకంగా ఉన్నా మహావిష్ణువు వారి కోసం తన వైకుంఠ ద్వారాలను తెరిచాడనీ, తమ కథ విని, వైకుంఠ ద్వారం గుండా వస్తున్న విష్ణు స్వరూపాన్ని చూసిన వారికి వైకుంఠం ప్రవేశం కల్పించాలనీ వారు కోరారు.

అందుజేతనే ఆ రోజును వైకుంఠ ద్వారాన్ని తలపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ ఈ రోజు భక్తులు ఆ ఉత్తరద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకొంటారు.

తిరువతిలో కూడా ఈ రోజును వైకుంఠద్వారం పేరిట ఉన్న ప్రత్యేక ద్వారాన్ని తెరిచి ఉంచుతారు

Tuesday 3 January 2017

వైకుంఠ ఏకాదశి


మాసంలో వచ్చే ప్రతి ఏకాదశి అనేది ముఖ్యమైనది. మన మనస్సుని, బుద్ధిని నియంత్రించుకోవడం అనేది ప్రధానమైన అంశం. అయితే పుష్యమాసపు శుక్ల ఏకాదశికి ఒక వైలక్షణ్యం ఉంది. దీనికే వైకుంఠ ఏకాదశి అని అంటారు. ముక్కోటి దేవతలు అని మన శాస్త్రాలు చెబుతాయి, వారంతా స్వామిని సేవించుకొని తాము తరించాము అని భావిస్తారట. భగవంతుడు ఉత్తర ద్వారాలు తెరిపించి వైకుంఠంలోంచి బయలుదేరి కోరుకున్న వారిని ఆద్వారంలోంచి లోనికి తీసుకు వెళ్ళడానికి సిద్దపడతాడట. ఇది ఈ నాటి ప్రత్యేకత. వారు ఎలాంటి వారైనా సరే, పుణ్యాత్ములా పాపాత్ములా అనే ప్రశ్న లేదు. ఎవడైతే స్నానమాడి స్వామి నామాన్ని తలుస్తాడో వాడికి మోక్షం ఇస్తాడట. అందుకే ఈనాడు కాకి కూడా స్నానం చేస్తుందట. సామాన్యంగా ఈ నాడు, ఎవరిపైన కోపం వచ్చి ఉపవాసం చేసినా మోక్షమేనట. అంత పవిత్రమైన రోజు ఈ రోజు.
ఎందుకైంది అంత పవిత్రం ఈ రోజు? ఎందుకు పరమాత్మ ఉత్తర ద్వారంలోంచే రావాల్సి వచ్చింది, తూర్పు ద్వారం లేదా ? ఏ కారణం చేత ఉత్తర ద్వారం తెరువాల్సి వచ్చింది ? ఈ విషయాన్ని మనకు శ్రీపాంచరాత్ర ఆగమ సంహితల్లో శ్రీప్రశ్నం అనే ఒక సంహిత ఒక అందమైన విషయాన్ని తెలియజేస్తుంది. ఒకనాడు భగవంతుడు సృష్టి చేద్దాం అని అనుకున్నాడు. సృష్టి అనేది ఆయన నేరుగా చేయడు. సృష్టి అనేది రెండు విడుతలుగా చేస్తాడు, కొంత తాను నేరుగా చేస్తాడు, మిగతాది ఒకరి ద్వారా చేయిస్తాడు. తాను మొదట ముడిపదార్థాన్ని తయారుచేసి ఇస్తాడు. దాన్ని తయారుచేసే విధానం ఇతరులకు రహస్యంగానే ఉంచుతాడట. దాన్ని తయారుచేసే విధానం వేదాల్లో ఉంటుంది, కానీ దాన్ని అర్థం చేసుకొవడం ఎవ్వరికీ రాదట. పాలకడలిలో పవలించి ఉన్న పరందాముడికి మాత్రమే తెలుసు ఆ రహస్యం. కావల్సిన భోగ, భోగ్య, భోగ ఉపకరన వస్తువులని తయారుచేసి, తన నాభిలోంచి బ్రహ్మగారిని బయటకు తీస్తాడు. అంటే సృష్టికి అవసరమైన పంచభూతాలని, కావల్సిన వస్తువులని తయారుచేసి, ఇకపై సృష్టి చేయడానికి బ్రహ్మగారిని నిర్ణయించుకుంటాడు. ఆయనకు వేదం చెప్పి సుర నర తిర్యక్ స్థావరాలను సృజింపజేస్తాడు. బ్రహ్మగారికి సంశయాలు ఏర్పడితే తొలగిస్తూ ఉంటాడు వేద ఉపదేశం ద్వారా. అయితే అప్పుడప్పుడు బ్రహ్మగారు పరాక్కు వల్ల వేదాన్ని కోల్పోతే తాను ఆయా పరిస్థితి బట్టి ఒక సారి చేపవలె, ఒక సారి హంసవలె , ఒకసారి గుఱ్ఱంవలే ఎన్నో రూపాలు దాల్చి వేద ఉపదేశం చేసాడు అని మన శాస్త్రాలు చెబుతున్నాయి. ఒక్కో కల్పం ఆరంభం అయినప్పుడు ఒక్కో సారి వేదోపదేశం చేస్తాడు పరమాత్మ. అయితే వేదాన్ని కొంత అశ్రద్దతో వింటే, జరిగే సృష్టిలో కొంత తప్పులు ఏర్పడుతాయి. బ్రహ్మ గారు చేసే అశ్రద్ద గురించి శ్రీసుఖ మహర్షి పరిక్షిత్తుతో చెబుతాడు భాగవతంలో. ఇట్లా బ్రహ్మగారికి వేద ఉపదేశం అనేది ఎన్నో సార్లు చేస్తాడు పరమాత్మ.

ఇట్లా ఒకసారి బ్రహ్మ గారు పరాక్కుతో విన్నాడట. అప్పుడు ఆయన చెవుల్లోంచి ఇద్దరు వచ్చారట. వారి పేర్లు మధు మరియూ కైతభ. విజ్ఞానాన్ని మనం చైతన్య మూర్తులని భావిస్తాం. బ్రహ్మ గారికి ఉపదేశం చేసిన వేదం మానవ అకృతి దాల్చి ఉన్న నలుగురు బాలరవలె ఉందట. ఆ నలుగురిని ఎత్తుకొని ఈ మధు కైతభ అనే అసురులు వెళ్ళిపోయారు. వారిని సముద్రంలో దాచి ఉంచారు. భగవంతుడు బ్రహ్మగారికి ఉపకారం చేయడానికి మశ్చ్య రూపం దాల్చి వారితో పోరాడాడు, అయితే వారు పుట్టింది సరియైన సృషి కార్యంలో కాదు, వారు అసురీ ప్రవృత్తి కల్గి ఉన్నారు. ఎంతకూ చావడం లేదు. అయితే ఇంత దెబ్బలాట ఎందుకు అని భగవంతుడు వారిని వేదాలను అందిస్తే ఒక వరం ఇస్తా అని చెప్పాడు. దానికి తోడు మరొక వరం వారే అడిగారు. అందుకు ఒప్పుకున్నాడు పరమాత్మ. మొదటి వరంగా భగవంతుణ్ణి తమకు మోక్షాన్ని ప్రసాదించమని అడిగారు. అసుర ప్రవృత్తి కలవారికి మోక్షం ఎలా వస్తుంది. మోక్షానికి ఒక మార్గం ఉంది. పరమపదానికి వెళ్ళాలంటే అర్చిరాది మార్గాల్లో ఇలా పన్నెండు లోకాలని దాటుతూ విరజానది దాటి ఐరంమదం అనే సరస్సులో అలంకరించుకొని కదా వెళ్ళాల్సి ఉంటుంది. ఇవన్నీ పరమాత్మ ఏర్పర్చినవే కానీ నియమాలని ఆయన కూడా గౌరవిస్తాడు. మనం ఆడే ఆటల్లో నియమాల్ని మనమే పెట్టుకుంటాం, నియమాలని విడిచి ఆడే ఆటలో ఉత్సాహం అనేది ఉండదు. అట్లానే భగవంతుడు తాను ఏర్పచిన నియమాలని విస్మరించడు. కానీ ఈ అసురులు ఇద్దరూ మోక్షం కావాలనే కోరారు. అందుకు భగవంతుడు ఒక సులభమైన ఒక ఉపాయం వెతుకున్నాడు. వైకుంఠానికి ఉత్తరం వైపు ద్వారాలని తెరిపించి ఆయన వచ్చి వారిని స్వీకరించేందుకు ఒప్పుకున్నాడు. అసలు మోక్షాన్ని ఎవరు కోరుతారు. మన వాంగ్మయాలు, వేదాలు జీవుడు చేరాల్సిన ఒక ఆనంద స్థితి అనేది ఉంది అని చెబుతున్నాయి. భగవంతుడు చేసిన ఉపదేశాలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. ఎన్ని చెప్పినా మనం మనమే. భగవంతుని నిత్య నిలయాన్ని చేరాలి అనే ద్యాస మనకు లేదు. ఒక్క జన్మ కాదు, కోట్ల జన్మలు ఆయన ఇస్తూనే ఉన్నాడు. మనం ఈ సంసార ప్రవాహంలోంచి బయట పడాలని కోరిక అంత కంటే లేదు. సర్వ వ్యాపి అయిన నారాయణుడు ఉండేది ఎంత దూరం మనకు, కానీ మనం ఆయన సొత్తు అని ఒప్పుకోం. అసురులైనప్పటికీ వారు కోరిన కోరిక సరియైనది అని భగవంతుడు ఎంతో సంతోషించాడు. విభువైన భగవంతునికి మనపై ఉండే ప్రేమ అంత. అందుకు వారు సంతోషించి వేదాలని తిరిగి ఇచ్చారు. వారు మరొక వరం కోరుకున్నారు. వారు కోరిన వరాన్ని చూస్తే ఎంతో ఆశ్చర్యం వేస్తుంది. భగవన్! మామీద ఉండే దయ చేత మాకు ఇంత ఉపకారం చేస్తున్నావే, ఈ రోజు ఈ విషయాన్ని తలచుకున్నా, నీవు ఉత్తర ద్వారంలో వస్తుంటే చూస్తారో వారికి కూడా మోక్షాన్ని ఇవ్వు అని కోరారు. వారు అసురులైనప్పటికీ ఎంత ఉత్తములు అనేది తెలుస్తుంది. భగవంతుడి ముఖం వికసించింది. ఈ వైభవాన్ని తలచినా, భగవంతుణ్ణి ఉత్తర ద్వారంలోంచి వస్తుంటే చూసినా వారికి మోక్షం నిశ్చయం అని భగవంతుడు వరం ఇచ్చాడు.

అయితే పరమపదంలో ఉన్న స్వామిని మనం ఎట్లా చూడగలం. అయితే భగవంతుడు ఉండేది ఐదు స్థానాల్లో. పరమపదంలో ఆయనే ఉంటాడు. పాలకడలిలో ఆయనే ఉంటాడు. అవతారాల్లో ఆయనే ఉంటాడు. మనలో అంతర్యామిగా ఆయనే ఉంటాడు. ఈ నాలుగు స్థానాలు అందరికీ ఉపకరించవు. అతి సామాన్యులకు కూడా అందుబాటులోకి రావడానికే విగ్రహ రూపంలో ఉంటాడు. పరమపదంలోని స్వామికి అర్చా మూర్తికి తేడా లేదు అని పాంచరాత్ర ఆగమాలు తెలిపాయి. అందుకోసమే ఈ రోజు ఆలయాల్లో స్వామి ఉత్తర ద్వారం ద్వార బయటికి వచ్చి మండపంలో ఉన్న భక్తులని తీసుకొని తిరిగి ఉత్తర ద్వారం గుండానే లోనికి వెళ్తాడు. అట్లా వచ్చే స్వామిని సేవిస్తే చాలు. భూమి మీద మొదటగా అవతరించిన అర్చా మూర్తి అయిన శ్రీరంగనాథుడు కూడా బయటికి వచ్చి భక్తులని తరింపజేస్తాడు. అట్లానే అనేక స్థానాల్లో స్వామి వేంచేసి ఉన్నాడు అనేక ఆలయాల్లో, స్వామి ఉన్న గర్భాలయాన్ని పరమపదం అనే భావిస్తారు. స్వామి అర్చా రూపంలో వచ్చినా ఆయన పూర్ణత్వంలో లోటు ఉండదు. అట్లా వచ్చే స్వామిని సేవించుకుంటే చాలు తరించిపోతాం. దానికి తోడు ఆయన నామాల్ని పాడుతే ఆయనెంతో సంతోషిస్తాడు.

Wednesday 21 December 2016

చాలామందికి ఈ సందేహం వుంది



కొందరు లలితా సహస్రనామ పారాయణ ప్రతి నిత్యం చేస్తుంటారు.  కొందరు రెండు పూటలా చేస్తారు

కొందరు ప్రత్యేక దినాలలో…ఇలా రకరకాలుగా…

ఈ మధ్య లలితా సహస్రనామ పారాయణ చేసేవారి సంఖ్య ఎక్కువైందనే చెప్పొచ్చు.

వీరిలో కొందరికి మామూలుగా నిత్యం మహా నైవేద్యం పెట్టే అలవాటు వుంటుంది.

ఇలాంటివారికి ఏ సమస్యాలేదు.కొందరికి ఇంట్లో మడిగాగానీ, నిష్టగాగానీ చెయ్యటం కుదరదు.

ఒక్కొక్కళ్లకి ఒక్కో రకం ఇబ్బంది.ఇలాంటివారికి లలితా సహస్రనామం పారాయణ చేసినప్పుడు అనేక అనుమానాలు.

మహా నైవేద్యం పెట్టలేక పోయామే..అసలు అమ్మవారికి ఏం నైవేద్యం పెట్టాలి..ఏదో ఇవాళ ఒక పండు పెట్టేశాను.

సరిగ్గా చేశానో లేదో…ఇలా గుంజాటన పడతారు. అందరికీ మహా నైవేద్యం పెట్టటం అన్నివేళలా కుదరకపోవచ్చు.నిత్యం పారాయణ చేసేవారు తొందరగా అయ్యేది ఏదైనా చేసి పెట్టవచ్చు.అమ్మవారిని హరిద్రాన్నైక రసికా అని కీర్తిస్తాం.పెసర పప్పు వేసిన పులగం నైవేద్యం పెట్టవచ్చు.అదీ కుదరకపోతే కర్జూర పండు నైవేద్యం పెడితే మహా నైవేద్యం పెట్టినట్లేట.ఒక్కొక్కసారి అవి కూడా వీలు పడకపోవచ్చు..సమయానికి దొరకక, తెచ్చినవి అయిపోయి వగైరా ఏ కారణ వల్లనైనా.అప్పుడు వీలయితే ఆవుపాలలో, లేదా ఇంట్లో వుండే పాలల్లో తేనె కలిపి నైవేద్యం పెట్టవచ్చు.అందుబాటులో వున్న ఏ పండయినా నైవేద్యం పెట్టవచ్చు.అమ్మవారికి కావలసినది భక్తికానీ ఏమి పెట్టాము అన్నది కాదు.మనం నిండు మనసుతో భక్తిగా ఏదైనా సమర్పించవచ్చు.

కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు వుంటాయి.చంద్ర దోష పరిహారార్ధం కొందరు పౌర్ణమినాడు చంద్రుని లలితా పరమేశ్వరి రూపంలో పూజించి, ఆరుబయట చంద్ర కిరణాలు పడే చోట పూజ చేసి పాలు, బెల్లంతో చేసిన పరవాణ్ణం నైవేద్యం పెట్టి అందరికీ పెట్టి వారు తింటారు.అలాగే నవరాత్రులలో అమ్మవారిని పూజించేవారు మినప గారెలు తప్పనిసరిగా నైవేద్యం పెడతారు.శుక్రవారం నియమంగా పారాయణ చేసేవారు అమ్మ గుడాన్నప్రీత మానస కనుకబెల్లం వేసిన పరనాణ్ణం నైవేద్యం పెడతారు.

నిత్యపారాయణకి వీలయితే ఏమైనా చెయ్యవచ్చు.. వీలుకానప్పుడు భక్తిగా ఏది సమర్పించినా పరవాలేదు

నైవేద్య విశిష్టత, పద్ధతి ఎలాగో మీకు తెలుసా?

Offerings to god


మనం రోజూ తినే తిండి అనేక సంక్లిష్ట దశాభేదాల్ని దాటుకొని అంతిమంగా మన నోట్లోకొచ్చిపడుతున్నది. ఆ యావత్తు దశాభేదాల్లోను మనిషి చేసే కృషికి అడుగడుగునా సహకరిస్తున్న భగవంతుని లీలా విశేషం ఉంది. ఆ లీలావిశేషమే లేకపోతే మనం దున్నినా విత్తలేం ... విత్తినా మొక్కలు రావు ... వచ్చినా ధాన్యం పండదు ... పండినా దాన్ని ఇంటికి తెచ్చుకోలేం ... తెచ్చుకున్నా తినలేం ... ఇలా అడుగడుగునా మనం అత్యంత ప్రాథమికమైన తిండి అవసరాల కోసం భగవంతుని కృప మీద ఆధారపడి ఉన్నాం. అందుకే ఆ ఆహారద్రవ్యాల్ని ఆహారరూపంలోకి మార్చుకోగలిగిన తరువాత భగవంతుణ్ణి విధివిధానంగా పూజించి వండినవాటిని భగవంతుడి సన్నిధిలో పెట్టి "హే భగవాన్ ! ఇది నీ దయామృతవర్షం. మమ్మల్ని బతికించడం కోసమే నువ్వు దీన్ని సృష్టించావు. నీ ప్రసాదం కావడం చేత ఇది పరమ పవిత్రమైనది." అని కృతజ్ఞతలు చెప్పుకొని దాన్ని భుజించడం ఉత్తమం. ఈ విధమైన స్తోత్రం చేత ఆయన మిక్కిలి సంతోషిస్తాడు. వారికి ఈ జన్మలోనే కాక రాబోయే జన్మల్లో కూడా ఆహారాదులకు లోపం లేకుండా చూసుకుంటాడు. వారి వంశంలో కూడా ఏ విధమైన లోటూ ఉండదు.

ఈ విధమైన హృదయపూర్వక భగవన్నివేదనకి హిందూధర్మంలో నైవేద్య సమర్పణ అని పేరు. నైవేద్య సమర్పణలో కొన్ని సంప్రదాయాలున్నాయి. ముఖ్యంగా
ఇంట్లో నైవేద్యంగా సమర్పించబడే ఆహారపదార్థాలు శాకాహారమైనా కావచ్చు. మాంసాహారమైనా కావచ్చు. మొత్తం మీద మనం తినేదే పెట్టాలి. శాకాహారమే అయి ఉండాలనే నియమమేమీ లేదు. అయితే కొందరు మాంసాహారాన్ని ఎందుకు వద్దంటారంటే,  మాంసాహారాన్ని సమర్పించేవారు సాధారణంగా అబ్రాహ్మణులై ఉంటారు. మనం భగవంతుడికి ఏది సమర్పిస్తే అదే మనకి వచ్చే జన్మలో వందరెట్లుగా సంప్రాప్తమౌతుంది. కనుక వారు వచ్చే జన్మలో కూడా మాంసాహార కుటుంబాలలోనే జన్మించాల్సి వస్తుంది. అతిమాంసాహార వ్యసనం వల్ల మరుజన్మలో జాతకంలో సర్పదోషాలు ప్రవేశిస్తాయి. ఆధ్యాత్మిక పురోగతికి అదొక పెద్ద ఆటంకమని పూర్వీకులు భావించారు. కాని భవిష్యపురాణాది గ్రంథాల్లో చెప్పిన ప్రకారం ... కలియుగంలో బ్రాహ్మణుల్లో కంటే అబ్రాహ్మణుల్లోనే ఎక్కువమంది ఆధ్యాత్మిక మహాపురుషులు జన్మిస్తారు. కాబట్టి యుగధర్మాన్ని బట్టి అదొక లోపంగా భావించనక్కరలేదు.

ద్రవ్యశుద్ధి చాలా ముఖ్యమైన విషయం. అంటే ఏ విధమైన ధనంతో ఆ ఆహారాన్ని సిద్ధం చేశారు? అది అక్రమార్జితమా? సక్రమార్జితమా? హింసార్జితమా? అహింసార్జితమా? ద్రవ్యశుద్ధి లోపించిన నైవేద్యాల్ని భగవంతుడు తిరస్కరిస్తాడు. అలాగే తమకి మధుమేహం ఉంది గదా అని దేవుడికి తీపిలేని వంటలూ, లేదా తమకి రక్తపోటు ఉంది గదా అని ఆయనకి ఉప్పువెయ్యని వంటలూ నైవేద్యంగా సమర్పిస్తూంటారు. అది అవాంఛనీయం. ఇందాక చెప్పిన సూత్రం ప్రకారం మనం దేన్ని సమర్పిస్తామో దాన్నే ఆయన వందరెట్లుగా మనకి తిరిగి యిస్తాడు కాబట్టి అవే మధుమేహం, రక్తపోటూ మనకి మరుజన్మలో కూడా సంప్రాప్తిస్తాయి. దేవుడికి ఏది పెట్టినా, ఎంత పెట్టినా ఫర్వాలేదనే అపోహలో చాలామంది హిందువులు బతుకుతున్నారు. అందుచేత ఏదైనా దైవకార్యం వచ్చినప్పుడు వారు వంటకాల్లో తగినన్ని సంబారాలు వెయ్యకుండా మానవమాత్రుడెవడూ నోట్లో వేసుకోలేని విధంగా పదార్థాలు వండి వాటినే ఇంట్లోను, దేవాలయాల్లోను సమర్పిస్తున్నారు. దేవుడికి ఏం పెడతామనేది, ఎంత పెట్టాలనేది మన స్థితిగతుల్ని బట్టి నిర్ణయమైపోయే ఉంటుంది.

హైదరాబాదు బోనాల్లో అమ్మవారు పూనినప్పుడు "నీకేం కావాలి తల్లీ ?" అని భక్తులడిగారు. "నాకీ మధ్య మాంసం పెట్టడం మానేశారేంట్రా?" అనడిగారు అమ్మవారు. "జీవాల్ని బలివ్వడం మీద ప్రభుత్వం నిషేధం విధించింది తల్లీ ! శాకాహారంతో తృప్తిచెంది మమ్మల్ని కాపాడవమ్మా !" అని వేడుకున్నారు భక్తులు. అమ్మవారు శాంతించి "సరే ! అలాగే కానివ్వండ్రా" అన్నారు.
"శ్రియా దేయమ్, హ్రియా దేయమ్, భియా దేయమ్, సంవిదా దేయమ్" అన్నారు వేదఋషులు. అంటే కలిగినంతలో పెట్టాలి. ఎక్కడైనా పొరపాటు జరుగుతుందేమోననే జాగ్రత్తతో పెట్టాలి. భయభక్తులతో పెట్టాలి. ఆలోచించి పెట్టాలి అని అర్థం.

భగవంతుడు బాల్యప్రియుడు. అమ్మవారికి ఎనిమిదేండ్ల పిల్లగా దర్శనమివ్వడం అభిమతమైనట్లే అయ్యవారికి ఆరేళ్ళ పిల్లగాడుగా దర్శనమివ్వడం మిక్కిలి ఇష్టం. అందువల్ల ఒక చిన్నపిల్లవాణ్ణి ఎలా ముద్దుచేసి, బతిమాలి, వెంటపడి అన్నం తినిపిస్తామో అలాగే, అంతటి తత్పరతతోనే భగవంతుడికి నైవేద్యం పెట్టాలి. బయట కొన్న వంటకాల్ని నైవేద్యం పెట్టకూడదు. అవి వ్యాపారనిమిత్తం అనేక రకాలైన అశౌచాలకి గురై ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోను అవి పనికిరావు. నిలవ ఉన్నవీ, పులిసిపోయిన పదార్థాల్ని ఇంట్లో వండినా సరే నైవేద్యానికి పనికిరావు. అయితే సంతోషీమాత తప్ప మిగతా అందరు దేవతల విషయంలోను కొత్తపెరుగుకు మినహాయింపు ఉంది. గ్రామదేవతలకైతే చద్దెన్నం మహాప్రీతికరం. తమ సొంత యింట్లోను, తమ సొంత ఆఫీసులోను నైవేద్యాన్ని తాము (గృహిణి, గృహస్థుడు/ యజమానుడు, యజమానురాలు) స్వయంగా కానీ, తాము నియమించిన వేదబ్రాహ్మణుడు కానీ సమర్పించాలి. ఇతరులు పనికిరారు. నైవేద్యంలో బెల్లం ముక్క, నేతి అభిఘారమూ తప్పనిసరి. హారతి ఇచ్చాకనే నైవేద్యం సమర్పించాలి.

నైవేద్యం పెట్టేటప్పుడు ఆహార పదార్థాల చుట్టూ కుడిచేత్తో నీళ్ళు చిలకరించి సంబంధిత దేవతాస్తోత్రం చదవాలి. ఏ దేవుడికైనా, దేవతకైనా పనికొచ్చే సర్వదేవతోపయోగి

 శ్లోకం :


శ్లో|| బ్రహ్మార్పణమ్ బ్రహ్మహవిర్ బ్రహ్మాగ్నౌ బ్రహ్మణా హుతమ్ |
బ్రహ్మైవ తేన గన్తవ్యమ్ బ్రహ్మకర్మసమాధినా ||
విష్ణుమూర్తికీ, ఆయన అవతారాలకూ అయితే ...
శ్లో|| పత్రమ్ పుష్పమ్ ఫలం తోయం యస్తే భక్త్యా ప్రయచ్ఛతి |
తద్భవాన్ భక్త్యుపహృతమ్ అశ్నాతి ప్రయతాత్మనః ||
శ్లో|| యత్కరోమి యదశ్నామి యజ్జుహోమి దదామి యత్ |
యత్ తపస్యామి గోవింద తత్కరోమి త్వదర్పణమ్ ||
శ్లో|| కాయేన వాచా మనసేంద్రియైర్వా
బుద్ధ్యాఽఽత్మనా వా ప్రకృతేః స్వభావాత్ |
కరోమి యద్యత్ సకలమ్ పరస్మై
నారాయణేతి సమర్పయామి ||
ఏ కులస్థులైనా సరే, ఏ దేవీదేవతలకైనా నైవేద్యం పెట్టేటప్పుడు ...
ఓం సత్యమ్ చిత్తేన పరిషించామి | అమృతమస్తు | అమృతోపస్తరణమసి స్వాహా |
అని నైవేద్యం చుట్టూ నీటి బిందువుల్ని చిలకరించాలి. తరువాత--
ఓమ్ ప్రాణాయ స్వాహా ! ఓం వ్యానాయ సాహా | ఓమ్ ఉదానాయ స్వాహా | ఓం సమానాయ స్వాహా | ఓమ్ బ్రహ్మణే స్వాహా |
అని కుడిచేత్తో ఆహారపదార్థాల్ని దేవుడికి/ దేవతకు చూపించాలి.
మధ్యేమధ్యే పానీయం సమర్పయామి
అని నైవేద్యం మీద మళ్లీ నీటిబిందువుల్ని ప్రోక్షించాలి.
నమస్కరోమి అని సాష్టాంగం చేసి లేవాలి.

దేవుడికి దిష్టి తగలకుండా ఆ కాసేపు గది తలుపు మూసెయ్యాలి. లేకపోతే భోజనప్రియత్వం గలవారు ఆ ఆహారపదార్థాల వంక కుతూహలంగా, సాభిప్రాయంగా చూసినప్పుడు వాటిల్లో రంధ్రాలేర్పడడం, రంగుమారడం జరుగుతుంది. ఆ మార్పుల్ని యోగులు మాత్రమే తెలుసుకోగలరు. ఒకటి-రెండు నిమిషాల తరువాత లోపలికకి వెళ్ళి మళ్ళీ దేవుడికి నమస్కారం చేసుకొని ఆహార పదార్థాల్ని బయటికి తీసుకురావాలి.

Sunday 18 December 2016

పూజా విధానంలోని క్రియలలో అంతరార్థము.

Poojaitems


1. గంటలు :

దేవాలయాల్లో పూజ సమయంలో గంటలు వాయిస్తారు. దీనివల్ల రెండు విధాల ప్రయోజనం ఉంది. ఒకటి-బయటి ప్రపంచంలో శబ్దాలు లోపలికి ప్రవేశించకుండా చేయడం, రెండవది-మనస్సును దేవుని మీదికి ఏకాగ్రంగా మళ్లించడంలో తోడ్పడుతుంది.

2.దీప హారతి:

దీపాన్ని వెలిగించి దేవుని విగ్రహం ముందు తిప్పడం. దీనిలోని అంతరార్థం ఏమిటంటే దైవాన్ని జ్యోతి స్వరూపంగా భావించడం. దైవమే కాంతి. ఆ సమయంలో భక్తుల భావన ఈ విధంగా ఉంటుంది. ” స్వామీ! నీవే ఈ విశ్వంలో స్వయం ప్రభవమైన జ్యోతివి. సూర్యుడు, చంద్రుడు అన్నీ వీటిలోని తేజస్సు. కాంతివి నీవే. నీ దివ్య కాంతిచే మాలోని చీకటిని తొలగించి, మా బుద్ధిని ప్రభావితం చేయి” అని.

3. ధూపం

భగవంతుని ముందు పరిమళాలు వెదజల్లే అగరువత్తులను వెలిగిస్తాము. వాటి సువాసనలు అన్ని దిక్కులా వ్యాపిస్తాయి. వీటి ధూపం క్రిమిసంహారిణిగా కూడా పనిచేస్తుంది. భగవంతుడు సర్వవ్యాపి. విశ్వమంతా నిండియున్నాడు అన్న భావన అందరిలో కలుగుతుంది. ఈ విషయం అక్కడ ఉన్న వారందరికీ మాటి మాటికీ జ్ఞప్తి చేసినట్లవుతుంది.

4. కర్పూర హారతి

వ్యక్తిగతమైన అహంకారము కర్పూరమువలె కరిగిపోవాలని ఈ హారతిలోని అంతరార్థం. ఈ విధంగా జీవాత్మ పరమాత్మతో ఐక్యం కావాలని భక్తులు కోరుకుంటారు.

5. గంధపు సేవ

ఈ సేవలో చాలా అర్థం ఉంది. భగవంతుని విగ్రహానికి పూయడానికి గంధాన్ని మెత్తగా నూరుతారు. అంత శ్రమకు లోనయినప్పటికీ గంధం ఓర్పుతో సహించి, మంచి పరిమళాన్ని వెదజల్లి ఆహ్లదం కలిగిస్తుంది. ఆ విధంగానే ఎన్ని కష్టాలకు లోనయినప్పటికీ భక్తుడు చలించక కష్టాలను చిరునవ్వుతో స్వీకరించాలి. ఎటువంటి పరిస్థితుల్లోనూ శత్రువుకైనా అపకారం తలపెట్టకూడదు. ఇదే ఈ గంధసేవలోని అంతరార్థం.

6. పూజ

దేవునికి పత్రం, పుష్పం, ఫలం, తోయం అనే వాటిని భక్తులు పూజలో సమర్పిస్తారు. కాని భగవంతునికి వీటితో పనిలేదు. నిజానికి ఏ విధమైన వస్తువులు భక్తులు సమర్పించాలని భగవంతుడు కోరడు. కాని ఆ అర్పణలో ఎంతో పరమార్థం ఉంది.

7 పత్రం(శరీరము)

ఇది త్రిగుణాలతో కూడుకున్నది. పూజలో దీనిని భగవంతునికి అర్పిస్తాడు.

8 పుష్పం (హృదయము)

ఇక్కడ పుష్పం అంటే చెట్ల మీద పూచే పూవు అని అర్థం కాదు. సుగంధ పరిమళాలను వెదజల్లే హృదయ కుసుమం అని అర్థం. ఇటువంటి హృదయ కుసుమాన్ని దైవపరంగా అర్పించాలి.

9 ఫలం (మనస్సు)

మనస్సు ఫలాలను అంటే మనం చేసే కర్మల ఫలితాలను మనం ఆశించక భగవంతునికి అర్పితం చేయాలి.దాన్నే త్యాగం అంటారు.

10. తోయం(నీరు)

భగవంతుని అర్పించవలసిన నీరు అంటే మనలోని హృదయపూర్వకమైన ప్రేమ, ఆనందం మొదలైన దివ్య భావాల వల్ల వెలువడే ఆనంద భాష్పాలు దైవానికే అర్పితం కావాలి.

11 కొబ్బరికాయలు

హృదయం అనే కొబ్బరికాయ కోరికలు అనే పీచుతో కప్పబడి ఉంటుంది. దానిలో ఉండే నీరు సంస్కారము. కోరికలు అనే పీచును హృదయం అనే కొబ్బరికాయ నుంచి వేరుజేసి, తీయనైన కొబ్బరిని భగవంతునికి అర్పితం చేయాలి. అదే నిజమైన నివేదన. లోపల సంస్కారము అనేవి వున్నంతకాలం, హృదయం శరీరాన్ని కదలకుండా అంటిపెట్టుకొని ఉంటుంది. హృదయము అనే కొబ్బరికాయను పీచు అనే కోరిక వాసన వదలదు. మనంచేసే పనులను విత్తనాలతో పోలుస్తారు.మంచి విత్తనం వేస్తే మంచి మొక్క ఎట్లా మొలుస్తుందో మంచి పనులు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.

12. నమస్కారము

చేతులు జోడించగానే పదివేళ్లు కలసివుంటాయి. ఈ పదివేళ్లు పది ఇంద్రియములకు గుర్తు. ఇందులో కర్మేంద్రియ,జ్ఞానేంద్రియములను హృదయములోని పరమాత్మకు కైంకర్యము చేయుచున్నాను అని చేతులు జోడించుటయే నమస్కారములోని అంతరార్థము.

13. ప్రదక్షిణము

ముల్లోకములన్నియు భగవంతుని స్వరూపముతో నిండివున్నాయి. ఆ భగవంతుని సగుణాకరామైన విగ్రహమునకు గాని, లింగమునకు గాని, ప్రదక్షిణము చేసినట్లయిన ముల్లోకములు చుట్టి సర్వదేవతలకు నమస్కారములు చేసిన ఫలితము వుంటుంది.. అందుకే ప్రదక్షిణము పూజాంగములలో ఒకటిగా చేర్చారు.

Friday 2 December 2016

పోలి స్వర్గం నోము

స్త్రీలు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే నోముల్లో పోలి స్వర్గం నోము ఒకటి. పురాతనకాలం నుంచి తన ఉనికిని కాపాడుకుంటూ వస్తోన్న ఈ నోము, ఈ తరం స్త్రీలను కూడా ఎంతగానో ప్రభావితం చేస్తోంది. ఈ నోము జరుపుకోవడానికి కారణమైన కథ, జానపద కథలా అనిపిస్తూ వినడానికి ఆసక్తిగా ... ఆచరించడానికి ఇష్టంగా అనిపిస్తూ వుంటుంది.

ఇక కథలోకి వెళితే ... ఓ మారుమూల గ్రామానికి చెందిన రజక స్త్రీకి ఐదుగురు కోడళ్లు ఉండేవాళ్లు. ఆ అయిదుగు కోడళ్లలో చివరిది ... చిన్నది అయిన కోడలే పోలమ్మ. చిన్నప్పటి నుంచి కూడా పోలమ్మకు దైవభక్తి ఎక్కువ. పూవులు కోయడం ... పూజలు చేయడంతోనే ఆమెకి కాలం గడిచిపోయేది. పెళ్లి జరిగేంత వరకూ దైవంతో ఆమె ఏర్పరచుకున్న అనుబంధానికి ఎలాంటి ఆటంకం కలగలేదు. కానీ పెళ్లి అయిన తరువాత ఆమె ఆనందానికి గండి పడింది. పూవులు కోయడానికి ... పూజలు చేయడానికి ... అసలు గుడికి వెళ్లడానికి కూడా వీలు లేకుండా పోయింది. అందుకు కారణం ఆమె అత్త.సాధారణంగా ఇంటి కోడలకి దైవభక్తి ఎక్కువగా వుంటే ఎవరైనా మెచ్చుకుంటారు. కానీ పోలి విషయంలో అది తారుమారైంది. పోలి అత్తకు తాను మహా భక్తురాలిననే గర్వం ఎక్కువ. కొంతమంది అమ్మలక్కలు కూడా ఆమె వెనకచేరి భజన చేయడం వలన ఆమెలో మరింత అహంకారం పెరిగింది. పోలి కారణంగా తన పేరు కాస్తా పోతుందని భావించి ఆమెను మాత్రం ఇంటి పట్టున వుంచి, మిగతా కోడళ్ళను తీసుకుని గుడికి వెళ్లి వచ్చేది.ఈ నేపథ్యంలో ఒక కార్తీక అమావాస్య రోజున పోలికి ఇంటి పనులు పురమాయించి, ఆమెకి పూజా సామాగ్రి అందుబాటులో లేకుండా చేసి మిగతా కోడళ్లతో అత్త నదీ స్నానానికి వెళ్లింది. పోలి ఏ మాత్రం బాధపడకుండా, బావి దగ్గరే స్నానం చేసి ... పత్తి చెట్టు నుంచి పత్తి తీసి వత్తిని చేసింది. చల్ల కవ్వానికి వున్న వెన్నను తీసి దానితో దీపాన్ని వెలిగించి దైవానికి నమస్కరించింది. పోలి భక్తికి మెచ్చిన దైవం ఆమె కోసం పుష్పక విమానం పంపింది.ఊరు జనం చూస్తుండగానే పోలి ఆ విమానం ఎక్కింది. విమానం కొంచెం పైకి లేవగానే అక్కడికి వచ్చిన అత్త, తాను కాకుండా తన కోడలు స్వర్గానికి వెళ్లడానికి వీల్లేదంటూ పోలిని కిందకి లాగడానికి ఆమె కాళ్లు పట్టుకుంది. 

ఆ వెంటనే మిగతా కోడళ్లు ఒకరి తరువాత ఒకరుగా ఒకరి కాళ్లు ఒకరు పట్టుకుని విమానం నుంచి కిందకి వేలాడసాగారు. అది చూసిన దేవతలు పోలితో వారికి పోలిక లేదంటూ విమానం నుంచి కిందకి పడదోశారు. పోలి మాత్రం బొందితో స్వర్గానికి వెళ్లిపోయింది.అప్పటి నుంచి ప్రతి ఏడాది ఆశ్వయుజ అమావాస్య మొదలు ... కార్తీక అమావాస్య వరకూ ప్రతి నిత్యం బ్రహ్మీ ముహూర్తంలో నిద్రలేచి నదీ స్నానం చేసి దీపం వెలిగించి పోలి కథ చెప్పుకుని అక్షింతలు తలపై వేసుకోవడం ఆనవాయతీగా వస్తోంది. ఈ విధంగా నెల రోజుల పాటు నదీ స్నానం నోము పూర్తయ్యాక కార్తీక అమావాస్య రోజున బ్రాహ్మణుడికి దీపదానం ఇవ్వాల్సి ఉంటుంది.

Monday 23 May 2016

ఉగాది ప్రసాద శ్లోకం

* ఉగాదినాడు ఈ శ్లోకమును చదివి ఉగాదిపచ్చడి ని తీసుకోవాలి.
* ఉగాది ప్రసాద శ్లోకం
" శతాయు వజ్రదేహాయ సర్వసంపత్‌ కరాయచ
సర్వారిష్ట వినాశాయ నింబకం దళబక్షణం "
(ఉగాదినాడు ఈ శ్లోకమును చదివి ఉగాదిపచ్చడి ని తీసుకోవాలి)

Thursday 7 January 2016

వైకుంఠ ఏకాదశి వైభవం!!!

సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే పుష్య శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు. అలాంటి ముక్కోటి విశేషాలేమిటో చూద్దాం.

ముక్కోటి రోజున మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి.. భక్తులకు దర్శనమిస్తాడు. కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి.. మూడు కోట్ల ఏకాదశులతో సమానమట. అందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గళి' మధ్య.. ముక్కోటి ఏకాదశి వస్తుందని చెబుతారు.

వైకుంఠ ఏకాదశి రోజు.. ముర అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడట. అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థం తినకూడదని అంటారు. ఏకాదశీ వ్రతం చేసే వారు ఉపవాసం, జాగరణ, హరినామ సంకీర్తన, పురాణపఠనం, జప, తపాలు నిర్వహిస్తారు. 'భగవద్గీతా' పుస్తకదానం చేస్తారు. మామూలు రోజుల్లో.. దేవాలయాల ఉత్తర ద్వారాలు మూసి ఉంచుతారు. కానీ, ముక్కోటి రోజున భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి మహావిష్ణువును దర్శనం చేసుకొంటారు. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తే మంచిదని చెబుతారు.

ముక్కోటి రోజున పూర్తిగా ఉపవసించాలి. తులసి తీర్థం తప్ప ఏదీ తీసుకోకూడదు. ద్వాదశి నాడు అతిథి లేకుండా భుజించకూడదు. ఈరోజున ఉపవాసం చేసినవారు పాప విముక్తులవుతారట. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదం. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమొక దివ్యాస్త్రం. ఔషధం సేవించేడంతో పాటు పాటించవలసిన పథ్యమే ఉపవాసం. 'లంకణం పరమౌషధ'మనే నానుడి తెలిసిందే. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం. దైవానికి దగ్గరవాలన్నదే ఉపవాసంలోని ఆశయం.

పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి. ఏకాదశి వ్రతంలో ఏడు నియమాలున్నాయి. ఒకటి దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. రెండు.. ఏకాదశి రోజు మొత్తం- ఉపవాసం ఉండాలి. మూడు.. అబద్ధం ఆడకూడదు. నాలుగు స్త్రీ సాంగత్యం పనికి రాదు. ఐదు.. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆరు.. ముక్కోటి రాత్రంతా జాగరణ చేయాలి. ఏడు.. అన్నదానం చేయాలి.

ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించే రెండు పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి. పర్వతమహర్షి సూచనమేరకు వైఖానసుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువల్ల.. నరక బాధలనుభవించే అతని పితృదేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్లారట!

మురాసురుడి కథ రెండోది. కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను బాధించేవాడు. దేవతలు తమ గోడు విష్ణుమూర్తికి విన్నవించారు. రక్షించమని ప్రార్థించారు. విష్ణువు మురాసురుడిపై దండెత్తి, మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు. కాని, మురాసురుడు మాత్రం తప్పించుకొని వెళ్లి, సాగరగర్భంలో దాక్కున్నాడు. మురాసురుణ్ని బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి, ఒక గుహలోకి వెళ్లాడు. విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు, విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు. అంతే! మహాలక్ష్మి దుర్గ రూపంలో అక్కడ ప్రత్యక్షమై, మురాసురుణ్ని సంహరించింది. విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని, ఆమెకు 'ఏకాదశి' అనే బిరుదునిచ్చాడు! అప్పటినుంచి ఏకాదశీ వ్రతం ప్రాచుర్యం పొందింది.

ఇందులోని తాత్త్విక సందేశం ఇలా వుంది. విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. ఉపనిషత్తులు తెలిపినట్లుగా, ప్రతి మానవ హృదయగుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. అంత దగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్ధేశించి ఏకాదశీ వ్రతాన్ని నియమంగా ఆచరించాలి. ఉపవాసం ద్వారా పదకొండు ఇంద్రియాలను నిగ్రహంతో ఉంచుకుని, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించమని భావం. పంచజ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలతో కలుపుకుని మొత్తం పది. వాటితో పాటు.. మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారా పాపాలు చేస్తారు మానవులు. ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం. అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని, జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారని చెబుతారు. ఇదీ హిందువులు పరమపవిత్రంగా భావించే ముక్కోటి ఏకాదశికి చెందిన పూర్తి సారాంశం.

E-mail Newsletter

Sign up now to receive breaking news and to hear what's new with us.

Recent Articles